Chiranjeevi : మా ఎన్నికలు జరిగేంత వరకూ చిరంజీవిని పల్లెత్తు మాట అనకుండా ఉన్న మంచు ఫ్యామిలీ.. గెలిచిన మరుసటి రోజునుంచే వ్యూహాత్మకంగా మెగాస్టార్ ను టార్గెట్ చేస్తోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మీడియా సమావేశంలో విష్ణు మాట్లాడుతూ.. చిరంజీవి తనను పోటీలోంచి తప్పుకోవాలని కోరాడని, కానీ.. మేం ఎన్నికలకే వెళ్లాలని నిర్ణయించుకున్నామని చెప్పుకొచ్చాడు.

ఈ విషయం చెప్పొద్దని అనుకున్నామని, కానీ.. ఎన్నికలు అయిపోయాయి కాబట్టి చెబుతున్నామని అన్నాడు విష్ణు. అంటే.. ఓడిపోయి ఉంటే చెప్పేవాడు కాదా? అనే డౌట్ చాలా మందిలో మెదిలింది. మొత్తానికి.. ప్రకాష్ రాజ్ వెనుక చిరంజీవి ఉన్నారని ఆ విధంగా నేరుగా తొలిసారి మాట్లాడింది మంచు బృందం.
ఫలితాలు వచ్చిన తర్వాత చిరంజీవి పెద్దరికంగా శుభాకాంక్షలు తెలిపాడు కానీ.. ప్రమాణ స్వీకార కార్యక్రమానికి చిరంజీవిని ఆహ్వానించలేదు విష్ణు. బాలకృష్ణ సహా.. చాలా మందికి స్వయంగా ఫోన్ చేసిన మంచు టీం.. చిరుకు మాత్రం ఆహ్వానం పంపకపోవడం గమనార్హం. దీనిపై నెగిటివ్ కామెంట్స్ వినిపిస్తున్నాయి. చిరును పిలిస్తే హుందాగా ఉండేదని.. ఈ పద్ధతి సరికాదనే అభిప్రాయం వ్యక్తమైంది.
మొత్తానికి.. ఈ చర్యల ద్వారా.. మెగాస్టార్ ను టార్గెట్ చేశారని అంటున్నారు. అయితే.. ఇందులో మంచువారు ఎంత వరకు సక్సెస్ కాగలరు అనే చర్చ సాగుతోంది. మహా అంటే.. మా అధ్యక్ష పదవీ కాలం రెండు సంవత్సరాలు. ఈ హడావిడి ముగిసిన తర్వాత అక్కడ చేయడానికి కూడా ఏమీ ఉండదు. అదే సమయంలో.. ఇండస్ట్రీలో మెగాస్టార్ పలుకుబడి ఏంటన్నది అందరికీ తెలిసిందే. మా అసోసియేషన్లో చిరు బలం ఎంతన్నది ఇండస్ట్రీలో ప్రతి ఒక్కరికీ తెలుసు. మరి, చిరును టార్గెట్ చేసి విజయం సాధించగలరా? అది కూడా ఎంత కాలం?? అనే చర్చ గట్టిగానే సాగుతోంది.