Homeఎంటర్టైన్మెంట్Megastar Chiranjeevi: శ్రీదేవితో అలా చేసి.. 15 రోజులు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యా -...

Megastar Chiranjeevi: శ్రీదేవితో అలా చేసి.. 15 రోజులు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యా – చిరంజీవి

Megastar Chiranjeevi: కార్మిక దినోత్సవం సందర్భంగా హైదరాబాద్ కోట్ల విజయ్ భాస్కర్ రెడ్డి మైదానంలో తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో సినీ కార్మికోత్సవం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మెగాస్టార్ చిరంజీవి, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, మంత్రులు తలసాని, శ్రీనివాస్ గౌడ్, మల్లారెడ్డి, ఏపీ మంత్రి వేణుగోపాలకృష్ణ, గద్దర్, నారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

ఈ సందర్భంగా మెగాస్టార్‌ చిరంజీవి మాట్లాడుతూ సినీ కార్మికులందరూ చేసుకుంటున్న పండుగకు నన్ను ఆహ్వానించిన ఫెడరేషన్‌కు ధన్యవాదాలు. నాకు తెలిసి ఇలాంటి కార్యక్రమం ఎప్పుడూ జరగలేదు. ఈ కార్యక్రమం ఇంత బాగా జరగటానికి కారణమైన ప్రతి ఒక్కరికి నా అభినందనలు. సినీ పరిశ్రమలో ఎవరి దారి వారిదే అవడం వల్ల ఇంతకు ముందు ఇలాంటి మేడేను జరుపుకోలేదు. ఈ రోజు కోసం నేను అమెరికా పర్యటన వాయిదా వేసుకున్నాను. నేనూ కార్మికుడినే. ఎవరికి ఏ కష్టమొచ్చినా వారి వెనకే ఉంటా. సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు ఇవ్వడం బాధ్యతగా భావించా. రాజకీయాలకు అతీతంగా సినీ కార్మికులు ఐక్యంగా ఉండాలి.

Also Read: F3 Movie: ‘బ్లాస్టింగ్’ అట.. ఇంతకీ ఏమిటి ఆ బ్లాస్టింగ్ ?

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి ప్రభుత్వ సహకారం కావాలి. తెలుగు రాష్ట్రాల సీఎంలు పరిశ్రమకు ఎంతో భరోసా ఇచ్చారు అని అన్నారు. కార్మికులు ఉద్యమించి తెచ్చుకున్న పండుగ ఇది. 24గంటల్లో 8గంటలు శ్రామికులు పని చేస్తారు. కానీ సినిమా కార్మికులకు నిర్ణీత సమయం ఉండదు. అడవిలో ఉంటారు. చలిలో పనిచేయాలి. పండగలు, పబ్బాలు అన్న తేడా లేకుండా కష్టపడుతూ ఉంటాము. నాకింకా గుర్తుంది.. షూటింగ్‌లో జరిగిన కారు ప్రమాదంలో నూతన ప్రసాద్‌కి తీవ్రగాయాలయ్యాయి. అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా కూర్చీలో ఉండి క్లోజప్ షాట్స్‌లో నటించారు.

వేరే ఇండస్ట్రీలో అయితే కోలుకునే వరకూ రేస్ట్ తీసుకుంటారు. సినీ పరిశ్రమ కోసం ఎంతోమంది తమ కుటుంబాలను త్యాగం చేశారు. సినీ కళాకారులు కాదు… సినీ కళా కార్మికులు అని నటుడు రావుగోపాల్ రావు అనేవారని గుర్తు చేసుకున్నారు. అలాగే అల్లూ రామలింగయ్య గారి తల్లి చనిపోయిన తర్వాత షూటింగ్‌కి వెళ్లారు. గుండెల నిండా విషాదం పెట్టుకొని మనకు నవ్వులు పంచారాయన. ఇక నా విషయం తీసుకుంటే.. జగదేకవీరుడు అతిలోకసుందరి కోసం 103జ్వరంతో బాధపడుతూ శ్రీదేవితో కలిసి డ్యాన్స్‌ చేశా. షూటింగ్‌ అనంతరం15 రోజులు హాస్పిటల్‌లో జాయిన్‌ అయ్యాను.

గాడ్‌ఫాదర్‌ సినిమా కోసం ముంబై, హైదరాబాద్‌ తిరగాల్సి వచ్చేది. నేను డల్‌గా ఉన్నానని చెబితే షూటింగ్‌ ఆగిపోయేది. ఇక సినీ కార్మికులకు నిత్యావసర సరుకులు, వ్యాక్సినేషన్ ఇవ్వడం నా బాధ్యతగా భావించా.ఎప్పుడు ఏం సహాయం కావాల్సిన నేను ఎప్పుడూ అండగా ఉంటాను మీ చిరంజీవి ఎప్పుడూ కార్మికుడే’ అంటూ చెప్పుకొచ్చారు.

గుడ్ల ధనలక్ష్మీ ట్రస్ట్ ద్వారా గుడ్ల ధనలక్ష్మీ 5 లక్షల రూపాయలు చెక్కును తెలుగు ఫిల్మ్ ఫెడరేషన్ కి మెగాస్టార్ చిరంజీవి గారి చేతులమీదుగా అనిల్ వల్లభనేని, దొరై, సురేష్ లకు ఇవ్వడం జరిగింది.

Megastar Chiranjeevi
Megastar Chiranjeevi

కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కిషన్‌ రెడ్డి మాట్లాడుతూ తెలుగు సినిమా అంతర్జాతీయ గుర్తింపు వెనుక కార్మికుల కృషి ఉందని అన్నారు. ప్రధాని మోదీ సైతం తెలుగు సినిమా ప్రాధాన్యతను ప్రశంసించారని పేర్కొన్నారు. కరోనా వల్ల పర్యాటక, సినీ రంగాలు చాలా నష్టపోయాయన్న కిషన్‌ రెడ్డి.. వ్యాక్సిన్ రావడం వల్ల పర్యాటక, సినీ రంగాలు నిలదొక్కుకున్నాయని చెప్పారు. మన నటీనటులను పొరుగు రాష్ట్రాల వాళ్లు అనుసరిస్తున్నారని తెలిపారు. కార్మికుల సంక్షేమానికి కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని కిషన్‌ రెడ్డి వెల్లడించారు. దేశ వ్యాప్తంగా 5 కోట్ల మంది మాత్రమే సంఘటిత రంగంలో ఉన్నారన్న ఆయన 45 కోట్ల మంది కార్మికులు అసంఘటిత రంగంలో ఉన్నారని అన్నారు. సంఘటిత రంగ కార్మికులకే ప్రభుత్వ ప్రయోజనాలు అందుతున్నాయి. 45 కోట్ల మంది అసంఘటిత రంగ కార్మికులు నష్టపోతున్నారు. అసంఘటిత రంగ కార్మికుల కోసం ప్రత్యేక చట్టాన్ని తెస్తున్నాం. ఈ-శ్రమ్‌ కార్డులు తీసుకుంటే కార్మికులకు ప్రయోజనాల కలుగుతాయి. ఇప్పటికే 28 కోట్ల ఈ-శ్రమ్‌ కార్డులను పంపిణీ చేశాం. అసంఘటిత రంగ కార్మికుల కోసం 29 కార్మికచట్టాలను 4 చట్టాలుగా మార్చామని అన్నారు.

తెలంగాణ సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మాట్లాడుతూ సినీ ఇండస్ట్రీకి చిరంజీవి పెద్ద దిక్కుగా ఉన్నారని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. ఆయన ఆధ్వర్యంలో మరిన్ని మంచి కార్యక్రమాలు చేపట్టాలని కోరారు. సినీ పరిశ్రమ పచ్చగా ఉండాలన్నదే చిరంజీవి ఆకాంక్ష అని తెలిపారు. రెక్కాడితే కాని డొక్కాడని పరిస్థితి సినీ కార్మికులదన్న ఆయన.. కరోనా సమయంలో వారు చాలా ఇబ్బందిపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. చలనచిత్ర పరిశ్రమకు అన్ని విధాలా సహకారమందిస్తున్నామని తెలిపారు. సినీ కార్మికుల కోసం చిరంజీవి ఎన్నో మంచి కార్యక్రమాలు చేస్తున్నారు. వారి కోసం చిరంజీవి పెద్ద ఆస్పత్రి కట్టాలని భావిస్తున్నారు. చిత్రపురిలో చిరంజీవి ఆస్పత్రి నిర్మిస్తే వేలాది కార్మికులకు ఉపయోగంగా ఉంటుంది. చిత్రపురిలోని పాఠశాలలకు, ఆస్పత్రికి కావాల్సిన స్థలం ఉంది. తెలుగు చలనచిత్ర పరిశ్రమకు కులం, మతం లేదు. సినీకార్మికులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తాం. ఇళ్లు లేని సినీ కార్మికులకు చిత్రపురిలో ఇళ్లు నిర్మంచి ఇస్తామన్నారు.

కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి మాట్లాడుతూ కరోనా వల్ల సినీకార్మికులకు తీవ్ర నష్టం జరిగిందని అన్నారు. షూటింగ్‌లు జరగక సినీకార్మికులకు భారీ నష్టం జరిగిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఒకప్పుడు ప్రపంచంలోని సినిమాలు మన వద్ద విడుదలయ్యేవన్న ఆయన.. నేడు మన తెలుగు సినిమాలు ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతున్నాయని హర్షం వ్యక్తం చేశారు. తెలంగాణ అభివృద్ధి వల్లే తెలుగు సినిమాకు విశ్వఖ్యాతి దక్కిందని స్పష్టం చేశారు. సినీ పరిశ్రమకు హైదరాబాద్ బంగారు గని అని పేర్కొన్నారు. నా అభిమాన హీరో చిరంజీవి, చిరంజీవి ఆంధ్రా కాదు. తెలంగాణలో ఉన్న సినిమా బిడ్డలంతా తెలంగాణ వాళ్లే. సినీ కార్మికులకు చిరంజీవి మంచి దారి చూపించాలి. ప్రపంచంలోని పెద్ద కంపెనీలు మన హైదరాబాద్‌లో పెట్టుబడులు పెడుతున్నాయి. కార్మికుల అభివృద్ధిలో ఇక నుంచి నేనూ భాగస్వామినవుతా. నేనూ ఓటీటీ సినిమాలు తీస్తా, స్టూడియోలు కడతా. చిరంజీవితో కలిసి సినీకార్మికులకు మేలు చేసే కార్యక్రమాలు చేపడతానని అన్నారు.

ఈ సందర్భంగా ఆంధ్ర ప్రదేశ్ మంత్రి చెల్లుబోయిన శ్రీనివాస వేణు గోపాల కృష్ణ మాట్లాడుతూ పేరుపేరునా కార్యక్రమానికి హాజరైన అందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున సినీరంగానికి ఎలాంటి సహాయం చేయగలమో అలాంటి సహాయం కచ్చితంగా చేస్తామని అన్నారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రజలకు సినిమాలంటే విపరీతమైన ఆసక్తి అని పేర్కొన్న ఆయన సినీ రంగం అభివృద్ధికి ఆంధ్రప్రదేశ్ ఎలా ఉపయోగపడుతుందో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి కూడా సినీ రంగం ఎంతో కొంత ఉపయోగపడాలని అన్నారు.. ఆంధ్ర ప్రదేశ్ ప్రాంతంలో సినిమా షూటింగులు జరగడానికి అనువైన అనేక ప్రదేశాలు ఉన్నాయి అని ఆయన ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.. కార్మిక దినోత్సవం రోజున ఇలాంటి కార్యక్రమం చేపట్టడం దానికి తాను హాజరయ్యే విధంగా తనకు మంత్రి పదవి ఇచ్చిన జగన్ మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను అని అన్నారు.

Also Read:Acharya Movie: ఆచార్య మూవీ పై ఇంత పగ ఎందుకు.. కారణం అదేనా?

Recommended Videos
Allu Arjun Crazy Offer to Director Sagar K Chandra | Allu Arjun Next Movie | Oktelugu Entertainment
మత్తులో సర్వం కోల్పోతున్న  స్టార్  హీరోయిన్ ? || Tollywood Star Actress || Oktelugu Entertainment
Aahana Kumra Glamorous Ramp Walk || Bombay Times Fashion Week || Oktelugu Entertainment

Shiva
Shivahttps://oktelugu.com/
Shiva Shankar is a Senior Cinema Reporter Exclusively writes on Telugu cinema news. He has very good experience in writing cinema news insights and celebrity updates, Cinema trade news and Nostalgic articles and Cine celebrities and Popular Movies. Contributes Exclusive South Indian cinema News.
Exit mobile version