
ఫేక్ న్యూస్ పై విజయ్ దేవరకొండ చేస్తున్న పోరాటానికి సినీ ఇండస్ట్రీ నుంచి భారీగా మద్దతు లభిస్తుంది. విజయ్ దేవరకొండ తనపై చేస్తున్న తప్పుడు ప్రచారాలను ఖండిస్తూ నిన్న ఓ వీడియోను విడుదల చేసిన సంగతి తెల్సిందే. ఓ నాలుగైదు వెబ్ సైట్లు పనిగట్టుకొని తనపై తప్పుడు ప్రచారాలు చేయడమే కాకుండా బ్లాక్ మెయిల్ వంటి పనులకు పాల్పడుతున్నాయని ఆరోపించారు. వెబ్ సైట్ల పేరు ఎత్తకుండానే తనపై రాసిన కథనాలు చదివి విన్పించారు. కొన్ని వెబ్ సైట్లు సినీ ఇండస్ట్రీపైనే బతుకుతూ తమపైనే తప్పుడు ప్రచారం చేయడాన్ని ఆయన తీవ్రంగా ఖండించారు. సినిమా వాళ్లపై తప్పుడు ప్రచారం చేసే వెబ్ సైట్ల రేటింగ్స్, వారి కథనాలను అభిమానులు నమ్మి మోసపోవద్దన్నారు. ఆ వెబ్ సైట్లు డబ్బు కోసం ఎలాంటి తప్పుడు ప్రచారాలకైనా పూనుకుంటాయని స్పష్టం చేశారు.
వైసీపీ ఎమ్మెల్యేలకు నోటీసులు..!
ఈమేరకు విజయ్ దేవరకొండకు మద్దతుగా టాలీవుడ్ ఇండస్ట్రీ మద్దతుగా నిలిచింది. #KillFakeNews పేరిట హీరోహీరోయిన్లు విజయ్ దేవరకొండకు భారీగా మద్దతు పలుకుతున్నారు. విజయ్ కు మద్దతుగా సూపర్ స్టార్ మహేష్ బాబు ‘బ్రదర్ నీ వెనుక నేనున్నా’ అంటూ ట్వీట్ చేశారు. తాజాగా మెగాస్టార్ చిరంజీవి విజయ్ కు మద్దతుగా ట్వీట్ చేశారు. ‘విజయ్ మీ ఆవేదనను అర్థం చేసుకోగలను. బాధ్యతలేని రాతల వల్ల, మీలా నేను నా కుటుంబం బాధపడిన సందర్భాలు చాలా ఉన్నాయి.. మీ వెంట మేమంతా ఉన్నాం.. మంచి పనిచేసే విషయంలో ఎప్పుడు ఆత్మవిశ్వాసం కోల్పోద్దు’ అంటూ ట్వీట్ చేశారు. అదేవిధంగా జర్నలిస్టులకు చిరు ఓ రిక్వెస్ట్ చేశారు. దయచేసి మీ సొంత అభిప్రాయాల్ని రుద్దకుండా వార్తలను రాయాలని ఆయన సూచించారు.
‘కిల్ ఫేక్ న్యూస్’ పేరిట విజయ్ చేస్తున్న పోరాటానికి మెగాబ్రదర్ నాగబాబు సైతం మద్దతు పలికారు. ‘విజయ్.. నేను నీకు బలంగా మద్దతిస్తున్నాను.. సినిమా పరిశ్రమ రక్తాన్ని పీల్చే కొన్ని వెబ్‌సైట్లపై పోరాటం చేయడం అనేది, వాటిపై స్పందించడమనేది ఇప్పటికే చాలా ఆలస్యం అయింది.. నువ్వు స్పందించినందుకు థ్యాంక్స్.. టైమ్ టు టేక్ యాక్షన్ మై బాయ్’ అంటూ ట్వీట్ చేశారు. వీరితోపాటు అల్లరి నరేష్, రాశిఖన్నా, కాజల్ అగర్వాల్, సీనియర్ హీరోయిన్ రాధిక విజయ్ కు మద్దతు పలికారు. విజయ్ కు ఇండస్ట్రీ నుంచి భారీగా మద్దతు వస్తుండటంతో ఈ పోరాటం ఇంతటితో ఆగేలా కన్పించడం లేదు. ఈ వ్యవహారం మరింత ముదిరిపోయేలా కన్పిస్తుంది. ఈ వెబ్ సైట్లను ఇండస్ట్రీ బ్యాన్ చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. మన్ముందు ఏం జరుగుతుందో వేచి చూడాల్సిందే..!