Dil Raju: నిర్మాతల గిల్డ్ కి పెద్ద దిక్కు దిల్ రాజే. ఇక రాజుగారు తలపెట్టిన షూటింగ్ ల బంద్ పోగ్రామ్ తొలి రోజే సక్సెస్ ఫుల్ గా దారుణంగా విఫలమైంది. అదేమిటి ? చాలా సినిమాల షూటింగ్ ఆగిపోయాయి కదా ?. అవును.. నిజమే, కానీ.. సుమారు డజనున్నర సినిమాలు యధావిధిగా షూటింగ్ లు జరుపుకున్నాయి. ఇక్కడ షాకింగ్ విషయం ఏమిటంటే.. ? గిల్డ్ అధినేత దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న ‘వారసుడు’ సినిమా షూటింగ్ యధావిధిగా జరిగిపోయింది. అలాగే, ఈ గిల్డ్ లో మరో కీలక వ్యక్తి అయిన నాగవంశీ నిర్మాణంలో వస్తున్న ‘సార్’ సినిమా షూటింగ్ కూడా యధావిధిగా సాగిపోయింది.

షూటింగ్ లకు బంద్ ఇచ్చి.. సినీ కార్మికుల పొట్ట కొట్టి.. దిల్ రాజు, నాగవంశీ మాత్రం తమ సినిమాల షూటింగ్ లు చేసుకున్నారు. మరి వీరికి నైతిక విలువలు లేవా ?, వీళ్ళు పెట్టిన చట్టాలు వీరికి వర్తించవా ?, అందరికీ శకునం చెప్పే బల్లి, తాను బోయి కుడితి తొట్లో పడ్డట్లు.. అందరికీ నీతులు చెప్పే వీళ్ళు.. చివరకు ఇలా నీతి తప్పడం దురదృష్టకరం. ఏది ఏమైనా తెలుగు సినిమా షూటింగ్స్ బంద్ పై అంతా గందరగోళం నెలకొంది.
దిల్ రాజు ‘వారసుడు’, ‘సార్’ షూట్స్ యధావిధిగా జరగడం పై కొందరు నిర్మాతలు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ అసహనాలు పై కూడా దిల్ రాజు స్పందించాడు. తాను తెలుగు సినిమా షూటింగ్‌లు చేయట్లేదని చెప్పుకొచ్చాడు. విజయ్ హీరోగా తమిళ సినిమా షూటింగ్ చేస్తున్నానని దిల్ రాజు తనను తాను సమర్ధించుకున్నాడు. ఇది ఆత్మ వంచనే. అయినా అంగిట బెల్లం ఆత్మలో విషం అన్నట్టు ఉంటుంది వీరి వైఖరి.

అయినా దిల్ రాజు చెప్పినట్టు ‘వారసుడు, సార్’ సినిమాలు ఉభయ భాషల సినిమాలే అనుకుందాం. కానీ షూటింగ్ ఎక్కడ జరిగింది ?, టాలీవుడ్ పరిధిలో జరిగింది. పైగా ఈ సినిమాకి పని చేసే ప్రతి ఒక్కరూ టాలీవుడ్ వాళ్లే, చివరకు నిర్మాతలతో సహా. అలాంటప్పుడు ఇవి తమిళ సినిమాలు ఎలా అవుతాయి ?, తమిళంలో రిలీజ్ కావొచ్చు.. కానీ సినిమా మాత్రం తెలుగు సినిమాలే.
గిల్డ్ పెద్దలరా.. చట్టాలు చేయడం.. వాటిని పాటించడం కూడా నేర్చుకోండి. లేకపోతే ఇండస్ట్రీలో చీలికలు వస్తాయి. అప్పుడు ఎవరీకి వారే యమునా తెరే అవుతారు. కాబట్టి దిల్ రాజు పద్ధతి మార్చుకో.