Chandrababu Arrest: స్కిల్ డెవలప్మెంట్ స్కామ్ ఆరోపణలపై మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం రిమాండ్ ఖైదీగా రాజమండ్రి సెంట్రల్ జైలులో ఆయన ఉన్నారు. నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం, రాజకీయ కక్ష సాధింపు చర్య అని టీడీపీ నాయకులు ఆరోపణలు చేస్తున్నారు. బాలకృష్ణ, నారా లోకేష్ తో పాటు పలువురు ఖండించారు. INDIA కూటమిలో ఉన్న తృణమూల్ కాంగ్రెస్, ఆర్జేడీ నేతలు సైతం నారా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అక్రమం అన్నారు.
అయితే టాలీవుడ్ నుండి ఎలాంటి స్పందన లేదు. చంద్రబాబు నాయుడు అరెస్టై 5 రోజులు గడుస్తున్నా ఒక్క హీరో, దర్శక నిర్మాత, ఇతర ప్రముఖులు వ్యతిరేకించలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ మౌనం పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఎన్టీఆర్ కుటుంబ సభ్యుడు. ఎప్పటికైనా టీడీపీ పార్టీకి ప్రాతినిధ్యం లేదా కీలక పాత్ర వహించాల్సిన వాడు. అలాంటి ఎన్టీఆర్ టీడీపీ అధినేత అరెస్ట్ పై మాట్లాడకపోవడంతో పార్టీ వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
కొందరు దారుణమై ట్రోల్స్ తో ఎన్టీఆర్ పై తమ అసహనం వ్యక్తం చేస్తున్నారు. కొన్నాళ్లుగా చంద్రబాబు, బాలయ్యలతో ఎన్టీఆర్ కి జరుగుతున్న కోల్డ్ వార్ కారణం కావచ్చు. వ్యక్తిగతంగా ఏమున్నా ఇలాంటి కీలక సమయంలో ఆయన స్టాండ్ తీసుకోవాల్సిందని పలువురి వాదన. ఎన్టీఆర్ సంగతి అంటుంచితే.. ఇండస్ట్రీ పెద్దలు ఎందుకు గమ్మునుంటున్నారు?
జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రమే చంద్రబాబు అరెస్ట్ కి వ్యతిరేకంగా మాట్లాడారు. తన మద్దతు ప్రకటించారు. ఆయన రాజకీయాల్లో ఉన్నారు కాబట్టి, జగన్ కి వ్యతిరేకంగా పోరాటం చేస్తున్నారు కాబట్టి దీన్ని ప్రత్యేకంగా చూడాల్సిన అవసరం లేదు. 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన చంద్రబాబు టాలీవుడ్ అభివృద్ధికి ఎంతగానో దోహదం చేశారు. కొందరు పెద్దలు టీడీపీ ప్రభుత్వంలో కీలక పదవులు, ప్రయోజనాలు పొందారు. అలాంటి వారు కూడా మౌనం వహించడం విడ్డూరంగా ఉంది. చిత్ర పరిశ్రమ చంద్రబాబు అరెస్ట్ ని ఖండించకపోవడం పై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. సీఎం జగన్ కి భయపడుతున్నారా? లేక చంద్రబాబు అంటే బాధ్యత లేదా? అనే వాదన తెరపైకి వస్తుంది.