మొత్తానికి ఎప్పుడా అని ఎదురుచూస్తోన్న మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) ఎన్నికల పై క్లారిటీ వచ్చింది. వచ్చే నెలలో మా ఎన్నికలు జరగబోతున్నాయి. గత నెల నుండి ‘మా’ అధ్యక్ష ఎన్నికల గురించి హడావుడి జరుగుతూనే ఉంది. బరిలో ఉన్నాను అంటూ ప్రకాష్ రాజ్ గ్రాండ్ గా ప్రకటించడం, హే.. నువ్వు ఏమిటి నేను కూడా పోటీ చేస్తా.. నేను లోకల్’ అంటూ మంచు విష్ణు ఉత్సాహ పడటం..
మొత్తమ్మీద మీడియాకి రెండు వారాలు పాటు మంచి ఇంట్రెస్టింగ్ స్టఫ్ దొరికింది. ఇక మధ్యలో నాకేం తక్కువ అంటూ హేమ రంగంలోకి దిగడం, అందరూ పోటీ చేస్తున్నారు, నేనెందుకు పోటీ చేయకూడదు అంటూ జీవిత కూడా పోటీకి సిద్ధం అంటూ ముందుకు రావడం.. ఇలా ‘మా’లో మళ్ళీ లొల్లి రగిలింది. మరి ఈ లొల్లిలో ఎవరు గెలుస్తారు ? అనేది ఇప్పుడు ఇంట్రెస్టింగ్ పాయింట్. మెగాస్టార్ సపోర్ట్ ప్రకాష్ రాజ్ కి ఉంది.
కాబట్టి, ప్రకాష్ రాజ్ గెలుస్తాడు అంటున్నారు. కానీ, ప్రస్తుత అధ్యక్షుడు నరేష్, మంచు విష్ణుకి మద్దతు తెలుపుతున్నాడు కాబట్టి, విష్ణుకు బాగా ప్లస్ అవుతుంది అనేది సినీ జనం మాట. నరేష్ ఏమైనా సూపర్ స్టారా ? అతను సపోర్ట్ చేస్తే గెలవడానికి అని కొంతమంది కామెంట్స్ చేస్తున్నా.. ఓటర్లతో నరేష్ కి మంచి అనుబంధం ఉంది. పైగా నరేష్ ఈ కరోనా సాయంలో ఓటర్లను ఆదుకున్నారు.
కాబట్టి, నరేష్ సపోర్ట్ విష్ణుకి ఉంటే.. పోటీలో ఉన్న ప్రకాష్ రాజ్ వర్గానికి గట్టి పోటీనే అంటున్నారు. పైగా నందమూరి బాలకృష్ణ, ప్రభాస్ వంటి హీరోలు మంచు విష్ణు వైపు ఉన్నట్లు కనిపిస్తోంది. పైగా బాలయ్య స్టేట్ మెంట్స్ పాస్ చేశాడు. బాలయ్య ఎప్పుడైతే రంగంలోకి దిగాడో కులాల చీలిక వచ్చిందా అంటున్నారు.
కాగా ఈ విషయం పై నరేష్ క్లారిటీ ఇస్తూ.. “మా”లో కులాల పేరుతో రాజకీయాలకు చోటు లేదు, సినిమా ఇండస్ట్రీలో ఉన్న అందరిదీ ఒకే కులం, ఒకే మతం అదే సినిమా కులం’ అంటూ నరేష్ చెప్పుకొచ్చాడు. మరి ఈ మాటలు ఎన్నికల సమయంలో ఎంతవరకు నిజమో తెలిసిపోతుంది లేండి.