Bunny Vasu
Bunny Vasu: పవన్ కళ్యాణ్ కి, అల్లు కుటుంబానికి వారధి లాగా ఉండే వ్యక్తి ప్రస్తుతం ఎవరైనా ఉన్నారా అంటే అది బన్నీ వాసునే అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. గీతా ఆర్ట్స్ లో 25 ఏళ్ళ నుండి అల్లు అరవింద్ కి నమ్మకస్తుడిగా పని చేస్తున్నాడు. అల్లు అర్జున్ కి కూడా అత్యంత సన్నిహితుడు. ఒక్కమాటలో చెప్పాలంటే సొంత కుటుంబ సభ్యుడు అనే అనుకోవాలి. గీతా ఆర్ట్స్ మ్యానేజింగ్ మొత్తం ప్రస్తుతం బన్నీ వాసునే చూసుకుంటున్నాడు. అదే విధంగా జనసేన పార్టీ కి కూడా బన్నీ వాసు ఎన్నో సేవలు అందించాడు. పాలకొల్లు అసెంబ్లీ నియోజకవర్గం లో 2019 ఎన్నికల సమయంలో పార్టీ గెలుపు కోసం ఎంతో కృషి చేసాడు. పార్టీ ఆ ఎన్నికలలో గెలవకపోయిన, గణనీయమైన వోటింగ్ ని దక్కించుకుంది అంటే, అది బన్నీ వాసు చేసిన కృషియే. పవన్ కళ్యాణ్ ఆయన నిజాయితీ ని గమనించి 2024 ఎన్నికలలో ఎమ్మెల్యే గా పోటీ చేయమని చెప్పాడు.
కానీ ప్రస్తుతం సినిమాల మీద ఎక్కువ ద్రుష్టి పెట్టడం వల్ల తానూ చేయలేనని, వచ్చే ఎన్నికలలో కచ్చితంగా పోటీ చేస్తానని చెప్పాడట. ఇదంతా పక్కన పెడితే గత ఏడాది నిర్మాతగా ‘ఆయ్’ మూవీ తో పెద్ద హిట్ ని అందుకున్న బన్నీ వాసు, ఈ ఏడాది ‘తండేల్’ చిత్రం తో మన ముందుకు రాబోతున్నాడు. మరో మూడు రోజుల్లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ లో పాల్గొంటూ ఫుల్ బిజీ గా ఉన్న ఆయన రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో సోషల్ మీడియా లో ప్రచారం అవుతున్న వార్తలపై క్లారిటీ ఇచ్చాడు. రిపోర్టర్ ఆయన్ని ఒక ప్రశ్న అడుగుతూ ‘ మీరు గీతా ఆర్ట్స్ నుండి బయటకి వచ్చి మీకంటూ ఒక ప్రత్యేకమైన బ్యానర్ ని ఏర్పాటు చేసుకోబోతున్నారని వార్తలు విన్నాము. అది నిజమేనా?’ అని అడుగుతారు.
దానికి బన్నీ వాసు సమాధానం చెప్తూ ‘ఇది చాలా మిస్ కమ్యూనికేషన్ అయ్యింది అండీ. వాస్తవానికి ఏమైందంటే అల్లు అరవింద్ గారు, నేను పాతికేళ్ల నుండి ఒక సమన్వయంతో ముందుకు పోతున్నాం. నాకు నచ్చని స్టోరీ ని అల్లు అరవింద్ గారు కూడా ఇష్టపడే వారు కాదు. ఒకవేళ ఆయనకి నచ్చని స్టోరీ ని నాకు నచ్చినా కూడా వదిలేసేవాడిని. కానీ అలా వదిలేసినవి కొన్ని సూపర్ హిట్ అయ్యాయి. నేను ఒకరోజు అల్లు అరవింద్ గారిని అడిగాను. సార్ మీకు నమ్మకం లేని ప్రాజెక్ట్స్, ఒకవేళ నాకు నమ్మకం కలిగిస్తే, మన బ్యానర్ లో కాకుండా, నా సొంత బ్యానర్ లో తీసుకోవచ్చా అని అడిగితే, తీసుకో, కానీ తీసే ముందు నాకు స్టోరీలు కచ్చితంగా వినిపించు అని చెప్పాడు. ఇంతే జరిగింది..ఇది సోషల్ మీడియా లో రకరకాలుగా రాసుకున్నారు’ అంటూ చెప్పుకొచ్చాడు.