Brahmanandam Election Campaign: హాస్య నటుడు బ్రహ్మానందం ఎన్నికల ప్రచారంలో దిగారు. ఆయన ఓ అభ్యర్థి తరపున క్యాంపైన్ లో పాల్గొన్నారు. అయితే ఆయన ప్రచారం చేసింది తెలుగు రాష్ట్రాల్లో కాదు. పక్క రాష్ట్రం కర్ణాటకలో. తన సన్నిహితుడైన బీజేపీ అభ్యర్థి కే సుధాకర్ కి ఓటు వేయాలని బ్రహ్మానందం ఓటర్లను కోరారు. చిక్కబళ్లాపూర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి కే సుధాకర్ పోటీ చేశారు. బ్రహ్మానందం ఆయన తరపున తనదైన ప్రచారం చేస్తున్నారు. సినిమా డైలాగ్స్ కొడుతూ ఓటర్లను అలరిస్తున్నారు. ”ఖాన్ తో గేమ్స్ వద్దు శాల్తీలు లేచిపోతాయ్’ అని బ్రహ్మానందం డైలాగ్ చెప్పగా ఓటర్లు విజిల్స్ వేశారు.
చిక్కబళ్లాపూర్ నియోజకవర్గంలో తెలుగు ఓటర్లు అధికంగా ఉంటారు. వారిది అక్కడ నిర్ణయాత్మక పాత్ర ఉంటుంది. ఈ క్రమంలో పాప్యులర్ తెలుగు కమెడియన్ బ్రహ్మానందాన్ని తెరపైకి తెచ్చారు. ఆ మధ్య జరిగిన ఉప ఎన్నికల్లో కూడా బ్రహ్మానందం కే సుధాకర్ తరపున ప్రచారం చేశారు. బ్రహ్మానందంని చూసేందుకు స్థానికులు ఆసక్తి చూపారు. ఆయనతో ఫోటోలు దిగారు. బ్రహ్మానందం ప్రసంగాలు గట్టిగానే ప్రభావం చూపాయని అంటున్నారు.
కే సుధాకర్ 2013, 2018 ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు. అనంతరం బీజేపీకి దగ్గర కావడంతో అనర్హత వేటు ఎదుర్కొన్నారు. ఉప ఎన్నికల్లో బీజేపీ తరపున పోటీ చేసి గెలుపొందారు. బీజేపీ ప్రభుత్వంలో ఆయన వైద్యారోగ్య శాఖ మంత్రిగా చేశారు. అనారోగ్యానికి గురైన తారకరత్నను బెంగుళూరు హృదయాల ఆసుపత్రిలో అడ్మిట్ చేసిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో మెరుగైన వైద్యం అందించేందుకు కే సుధాకర్ అన్ని ఏర్పాట్లు చేశారు. నందమూరి కుటుంబ సభ్యులు ఆయనకు ధన్యవాదాలు తెలిపారు.
మరోవైపు బ్రహ్మానందం ఆచితూచి సినిమాలు చేస్తున్నారు. వయసు మీద పడ్డాక ఆయన సీరియస్ రోల్స్ ఎంచుకుంటున్నారు. పంచతంత్రం, రంగమార్తాండ చిత్రాల్లో ఆయన తన ఇమేజ్ కి భిన్నమైన రోల్స్ చేశారు. ముఖ్యంగా రంగమార్తాండ చిత్రంలో ఏడిపించేశారు. కొన్ని సన్నివేశాల్లో ప్రకాష్ రాజ్ ని ఆయన డామినేట్ చేశారు.