సినిమా ఇండస్ట్రీలో కరోనా కేసులు వేగంగా పెరుగుతున్నాయి. అసలు కరోనా సెకెండ్ వేవ్ లో ఇంత వేగంగా వ్యాప్తి చెందుతుందని ఎవ్వరూ ఊహించలేదు. నటీనటులకు వరుసగా కరోనా పాజిటివ్ వస్తుండటంతో.. ఏం చేయాలో తెలియక సినిమా మేకర్స్ తలలు పట్టుకుంటున్నారు. షూటింగ్ స్పాట్స్ లో కరోనా కలకలం సృష్టిస్తే.. ఒక్కసారిగా ఆ స్పాట్ లో ఉన్న వందమందికి పైగా కరోనా సోకే అవకాశం ఉంది. పోనీ షూటింగ్ కి బ్రేక్ ఇద్దామంటే.. ఇప్పటికే మొదలైన సినిమాలకు అతి గతి లేకుండా పోతుంది.
అయితే తాజాగా మరో ప్రముఖ నటుడికి కూడా కరోనా పాజిటివ్ అని తేలింది. నటుడు బ్రహ్మాజీ కరోనా వ్యాధికి గురై.. ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్నారు. అయితే ఆందోళన చెందాల్సిన విషయం ఏమిటంటే.. ఆయన గత కొన్ని రోజులుగా ఒక పెద్ద సినిమా షూటింగ్ లో పాల్గొంటున్నారు. పైగా కరోనా అని తేలింది కూడా షూటింగ్ స్పాట్ లోనే. ఉదయానే షూటింగ్ కి వచ్చిన బ్రహ్మాజీకి రెగ్యులర్ చెక్ అప్ చేశారు. అందులో భాగంగా కరోనా పాజిటివ్ అని తేలింది. దాంతో ఇప్పుడు ఆ పెద్ద సినిమాకి చెందిన యూనిట్ సభ్యులు, హీరో, హీరోయిన్ మొత్తం ఐసోలేషన్ కి వెళ్లక తప్పలేదు.
ఇక్కడ భయపడే మరో అంశం ఏమిటంటే… ఆ యూనిట్ లో అందరూ సీనియర్ నటీనటులే ఉన్నారట. ఇప్పుడు ఆ నటీనటులతో సన్నిహితంగా ఉన్న మిగిలిన నటీనటులు కూడా తమ షూటింగ్స్ ను రద్దు చేసుకోవాల్సిన పరిస్థితి రావడంతో మిగిలిన సినిమాల పై కూడా పెద్ద ఎపెక్ట్ పడేలా ఉంది. ఏది ఏమైనా సినిమా ఇండస్ట్రీలో ఇలా వరుసగా కేసులు వస్తుండంతో.. మిగిలిన మేకర్స్ లో ఆందోళన మొదలైంది. నిజంగా మొదటి సారి కన్నా రెండోసారే కరోనా బాధితుల సంఖ్య మరీ ఎక్కువగా ఉంది.