Boycott Hari Hara Veeramallu: చాలా సంవత్సరాల తర్వాత పవన్ కళ్యాణ్ హీరోగా నటించిన చిత్రం విడుదలవుతుందంటే.. కచ్చితంగా ఆయన అభిమానులకు పండగ లాంటిదే. పైగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ నటించిన హరిహర వీరమల్లు చిత్రం విడుదలవుతున్న నేపథ్యంలో 2 తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. ప్రపంచ వ్యాప్తంగా సందడి నెలకొంది. పైగా ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత పవన్ కళ్యాణ్ సినిమా ప్రమోషన్లలో పాల్గొంటున్నారు. పలు సంస్థలకు ఇంటర్వ్యూలు కూడా ఇస్తున్నారు. ఇదే క్రమంలో సంచలన వ్యాఖ్యలు చేస్తూ పవన్ కళ్యాణ్ సినిమాపై హైప్ పెంచేస్తున్నారు. అనేక సందర్భాల్లో విడుదల, ఆ తర్వాత వాయిదా పడుతూ వచ్చిన హరిహర వీరమల్లు సినిమా ఎట్టకేలకు రిలీజ్ అవుతున్న నేపథ్యంలో రకరకాల చర్చలు జరుగుతున్నాయి.
హరిహర వీరమల్లు సినిమా విడుదల నేపథ్యంలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యల్లో కొన్ని అంశాలను పట్టుకొని వైసిపి నేతలు సోషల్ మీడియాలో తెగ నెగిటివ్ ప్రచారం చేస్తున్నారు. హరిహర వీరమల్లు బ్యాన్ చేయాల్సిందేనని.. ఆ సినిమాను తొలిరోజే షెడ్డుకి పంపిస్తామని హెచ్చరిస్తున్నారు. ఏకంగా సోషల్ మీడియాలో బాయ్ కాట్ హరిహర వీరమల్లు అనే హ్యాష్ ట్యాగ్ ను ట్విట్టర్లో ట్రెండ్ చేస్తున్నారు.. దీంతో చిత్ర నిర్మాణ బృందం ఒక్కసారిగా అలర్ట్ అయింది. ఇదే క్రమంలో ఈ చిత్ర నటుడు పవన్ కళ్యాణ్ స్పందించారు. వైసిపి బాయ్ కాట్ ఉద్యమాలు తన సినిమాకి వర్తించవని.. అవన్నీ కూడా ఫేక్ ఉద్యమాలని పవన్ కళ్యాణ్ కొట్టి పారేశారు. సినిమాను అడ్డుకుంటే ఊరుకునేది లేదని హెచ్చరించారు.
వైసీపీ అనుకూల మీడియా మాత్రం కేవలం హరిహర వీరమల్లు సినిమాకు నెగిటివ్ ప్రచారాన్ని చేయడాన్ని పనిగా పెట్టుకుంది. కొంతమంది వైసీపీ కార్యకర్తలు సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులను ఆధారంగా చేసుకొని హరిహర వీరమల్లు సినిమాకు వ్యతిరేకంగా జగన్ మీడియా ప్రచారం చేస్తోంది.. హరిహర వీరమల్లు సినిమా పై అల్లు అర్జున్, జూనియర్ ఎన్టీఆర్, మహేష్ బాబు అభిమానులు ఆగ్రహం గా ఉన్నారని.. గతంలో వీరు సినిమాలు విడుదలైనప్పుడు మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో నెగటివ్ ప్రచారం చేశారని.. ఇప్పుడు వీరి అభిమానులు కూడా పవన్ కళ్యాణ్ సినిమా హరిహర వీరమల్లుకు వ్యతిరేకంగా ప్రచారం చేస్తున్నారని జగన్ మీడియా వార్తలను ప్రసారం చేస్తోంది. అయితే దీనిపై పవన్ కళ్యాణ్ అభిమానులు మండిపడుతున్నారు. ఎన్ని అడ్డంకులు సృష్టించినా పవన్ కళ్యాణ్ సినిమా ఆగదని.. అదిరిపోయే స్థాయిలో రికార్డులను సృష్టిస్తుందని స్పష్టం చేశారు.
Also Read: ‘హరిహర వీరమల్లు’ యుఎస్ఏ రివ్యూ… హిట్టా? ఫట్టా?
ఇక ఇదే క్రమంలో వైసిపి అనుకూల మీడియా గతంలో పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు సంబంధించిన చిన్న చిన్న వీడియో బిట్లను ప్రముఖంగా ప్రచారం చేస్తోంది. సొంత కథలతో నేరుగా సినిమాలు తీయలేని వ్యక్తి.. రీ మేక్ లను మాత్రమే నమ్ముకున్న వ్యక్తి.. పవర్ స్టార్ ఎలా అవుతారని.. ఆయన స్వయం ప్రకాశితుడు కాదని.. ఆయన రీమేక్ స్టార్ అని వైసిపి అనుకూల మీడియా వ్యతిరేక కథనాలను ప్రసారం చేస్తోంది.. అయితే ఈ ప్రభావం సినిమాపై ఎంతవరకు ఉంటుందని విషయాన్ని చెప్పలేమని సినీ విశ్లేషకులు చెబుతున్నారు.. పవన్ కళ్యాణ్ కి విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది కాబట్టి.. వైసిపి వ్యతిరేక ప్రచారం పెద్దగా వర్కౌట్ అయ్యే అవకాశం ఉండదని వారు అంటున్నారు.