టాలీవుడ్లో బాక్సాఫీస్ పై దండయాత్ర క్రమక్రమంగా పెరుగుతోంది. తొలి వారం ఐదు, రెండో వారం ఆరు సినిమాలు విడుదల కాగా.. ఈ వారం ఏకంగా తొమ్మిది సినిమాలు రిలీజ్ కు సిద్ధమయ్యాయి. ఏప్రిల్ 9న వకీల్ సాబ్ విడుదల తర్వాత మరో సినిమా థియేటర్లో విడుదల కాలేదు. అప్పటికే కరోనా విజృంభించడంతో.. వకీల్ సాబ్ రన్నింగ్ లో ఉండగానే.. థియేటర్లు మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. మళ్లీ ఇన్నాళ్లకు థియేటర్లు తెరుచుకోవడంతో సినిమాలు వరుసగా బాక్సాఫీస్ బాట పడుతున్నాయి.
కరోనా కారణంగా ఆలస్యమవడంతో.. తెచ్చిన అప్పులకు వడ్డీలు పెరుగుతుండడంతో.. నిర్మాతలు విడుదలకే మొగ్గు చూపుతున్నారు. అయితే.. పెద్ద నిర్మాతలు వేచి చూసే ధోరణిలోనే ఉండగా.. చిన్న నిర్మాతలు సినిమాను వదిలేస్తున్నారు. ఇప్పటి వరకు విడుదలైనవన్నీ చిన్న చిత్రాలే. ఈ వారం రాబోతున్న తొమ్మిది కూడా చిన్ని సినిమాలే. ‘‘ఎస్.ఆర్. కల్యాణ మండపం’’ చిత్రం మంచి వసూళ్లు రాబట్టడంతో మిగిలినవన్నీ క్యూ కడుతున్నాయి.
ఈ వారం రాబోతున్న 9 సినిమాల్లో.. శుక్రవారం ఏడు చిత్రాలు రిలీజ్ కాబోతున్నాయి. మరో రెండు శనివారానికి స్లాట్ బుక్ చేసుకున్నాయి. ఆ సినిమాలు ఏవీ అన్నది చూస్తే.. సుందరి, పాగల్, బ్రాందీ డైరీస్, సలామ్ నమస్తే, రావే నా చెలియా, చైతన్య, రైతన్న సినిమాలు తెలుగు స్ట్రయిట్ చిత్రాలు. వీటితోపాటు డబ్బింగ్ మూవీస్ కూడా ఉన్నాయి. ఈ లిస్టులో సిద్ధార్థ్ నటించిన ఒరేయ్ బామ్మర్ది, హాలీవుడ్ మూవీ కంజూరింగ్-3 ఉన్నాయి.
ఇందులో విశ్వక్ సేన్ నటించిన పాగల్ మూవీ శనివారం విడుదలవుతోంది. దీంతోపాటు ఆర్.నారాయణమూర్తి నటించిన రైతన్న చిత్రం కూడా శనివారమే వస్తోంది. మరి, ఈ తొమ్మిది చిత్రాల్లో ఎన్ని హిట్ కొడతాయి? ఎన్ని ఫట్ మంటాయి? అన్నది చూడాలి.