Vikrant Massey : ముంబైలో పుట్టి పెరిగిన విక్రాంత్ మస్సే… సీరియల్ నటుడిగా కెరీర్ ప్రారంభించాడు. మొదటిసారి 2007లో వచ్చిన ధూమ్ మచావో ధూమ్ సిరీస్లో నటించాడు. అనంతరం ధర్మవీర్ అనే సీరియల్ లో లీడ్ రోల్ చేశాడట. వరుసగా పలు సీరియల్స్ లో నటించాడు. ఇక సిల్వర్ స్క్రీన్ కి లుటేరా చిత్రంతో పరిచయం అయ్యాడు. 2013లో విడుదలైన ఈ చిత్రంలో రణ్వీర్ సింగ్, సోనాక్షి సిన్హా జంటగా నటించారు. అనేక చిత్రాల్లో సపోర్టింగ్ రోల్స్ తో పాటు ప్రాధాన్యత ఉన్న పాత్రలు చేశాడు.
విక్రాంత్ కెరీర్లో 12th ఫెయిల్ మైలురాయిగా నిలిచిన చిత్రం. గత ఏడాది విడుదలైన ఈ చిత్రానికి విధు వినోద్ చోప్రా దర్శకుడు. ఐపీఎస్ అధికారి మనోజ్ కుమార్ శర్మ జీవితం ఆధారంగా తెరకెక్కించారు. ఈ మూవీలో బీహార్ లోని చిన్న పల్లెటూరి నుండి వచ్చి ఐపీఎస్ కొట్టిన యువకుడు పాత్ర చేశాడు. ఎలాంటి అంచనాలు లేకుండా విడుదలైన ఈ మూవీ రికార్డు స్థాయిలో వసూళ్లు రాబట్టింది. విమర్శకుల ప్రశంసలు అందుకుంది.
12th ఫెయిల్ మూవీ బడ్జెట్ రూ. 20 కోట్లు కాగా… 70 కోట్ల వరకు వసూలు చేసింది. విక్రాంత్ తన సహజ నటనతో ఆకట్టుకున్నాడు.. ఈ మూవీ విక్రాంత్ కి భారీ ఫేమ్ తెచ్చిపెట్టింది. చేతినిండా చిత్రాలతో విక్రాంత్ బిజీగా ఉన్నాడు. 2024లో విక్రాంత్ నటించిన నాలుగు సినిమాలు ఆల్రెడీ విడుదలయ్యాయి. మరో మూడు చిత్రాలు చిత్రీకరణ దశలో ఉన్నాయి. విక్రాంత్ కెరీర్ పీక్స్ లో ఉండగా… ఆయన రిటైర్మెంట్ ప్రకటన చేశారు. 2025 తర్వాత చిత్రాలు చేయను అన్నారు. విక్రాంత్ ప్రకటన చిత్ర వర్గాల్లో కలకలం రేపింది. మంచి భవిష్యత్ ఉన్న హీరో ఎందుకు ఇలాంటి కీలక నిర్ణయం తీసుకున్నాడని చర్చ మొదలైంది.
కాగా విక్రాంత్ 2022లో శీతల్ ఠాకూర్ అనే నటిని వివాహం చేసుకున్నారు. వీరికి ఒకరు సంతానం. మరి విక్రాంత్ తన మాట మీద కట్టుబడి ఉంటాడా? లేక భవిష్యత్ లో సినిమాలు చేస్తాడా? అనేది చూడాలి.