Sushanth Singh: బాలీవుడ్ హీరో సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ ఆత్మహత్య వ్యవహారం దేశ వ్యాప్తంగా ఎంతటి సంచలనం సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాలీవుడ్ తో పాటు తెలుగులో కూడా ప్రేక్షకుల అభిమానాన్ని సొంతం చేసుకున్నారు సుశాంత్. ఆయన నటించిన “ధోని” సినిమా తెలుగులో కూడా మంచి విజయాన్ని దక్కించుకుంది. అయితే ఈ యంగ్ హీరో హఠాన్మరణం ఆయన అభిమానులకే కాకుండా అన్నీ ఇండస్ట్రి వర్గాల్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. ఈ కేసు దర్యాప్తులో భాగంగా బాలీవుడ్‌లో డ్రగ్స్ మాఫియా బయటకు వచ్చింది. ఆ కేసులో ఎన్నో మలుపులు తిరుగుతూ ఇంకా జరుగుతూనే ఉంటుంది. అయితే తాజాగా సుశాంత్ కుటుంబంలో మరో విషాదం చోటు చేసుకుంది.
సుశాంత్ సింగ్ రాజ్ పుత్ కుటుంబం అనుకోని ఘటనతో మరోమారు శోక సంద్రంలో మునిగింది. బీహార్‌లోని లఖిసరాయ్ జిల్లాలో ఈరోజు ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో సుశాంత్… కుటుంబానికి చెందిన ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సుశాంత్ బంధువు ఓం ప్రకాశ్ సింగ్ సోదరి అంత్యక్రియలకు హాజరైన అనంతరం పాట్నా నుంచి తిరిగి వస్తుండగా లఖిసరాయ్ జిల్లాలో ఈ ప్రమాదం జరిగింది. వారు ప్రయాణిస్తున్న సుమో ఓ ట్రక్‌ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో మొత్తం 10 మంది ప్రయాణిస్తున్నట్లు తెలుస్తుంది. వారిలో ఆరుగురు అక్కడికక్కడే చనిపోగా… నలుగురు తీవ్రంగా గాయపడ్డారు.
కాగా మరణించిన వారిలో సుశాంత్ మేనల్లుడు సహా బావ, హర్యానా కేడర్ ఐపీఎస్ ఓం ప్రకాశ్ సింగ్ సమీప బంధువులు ఉన్నారు. క్షతగాత్రులను సమీప ఆసుపత్రిలో చేర్పించారు. ఈ వార్త ప్రస్తుతం సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.