Bigg Boss winner 2024 : సరిగ్గా ఆరు నెలల క్రితం స్టాండ్ అప్ కమెడియన్ మునావర్ ఫారూఖీ హైదరాబాదులో స్టాండ్ అప్ కామెడీ షో పెడితే ఎంత వివాదానికి దారి తీసిందో చూశాం కదా. అప్పటి ఐటి శాఖ మంత్రి ప్రత్యేకంగా చొరవ తీసుకొని పోలీసుల తో బందోబస్తు నిర్వహిస్తే తప్ప నిర్వహించలేని పరిస్థితి ఏర్పడింది.. హిందూ దేవుళ్లను కించపరుస్తూ అతడు కామెడీ షోలు నిర్వహిస్తుంటాడని ఆరోపణలు ఉండేవి. అందువల్లే అతడు కామెడీ షోలు తెలంగాణ ప్రాంతంలో నిర్వహించవద్దని.. ప్రభుత్వం దీనికి అనుమతి ఇవ్వద్దని అప్పట్లో బీజేపీ నాయకులు నిరసనలు చేపట్టారు. రాజా సింగ్ లాంటి వాళ్ళైతే ఒక అడుగు ముందుకేసి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అయితే ఇప్పుడు ఎందుకు ఆ ప్రస్తావన అంటే.. వివాదాస్పద స్టాండ్ అప్ కమెడియన్ గా పేరుపొందిన మునాఫర్ ఫారూఖీ ఒక్కసారిగా నిన్నటి నుంచి మోస్ట్ ట్రెండింగ్ పర్సనాలిటీ అయిపోయాడు. ఇంతకీ అతడు ఏం చేశాడంటే..
బిగ్ బాస్ రియాల్టీ షో తెలుసు కదా.. మన దగ్గర ఏడు సీజన్లు పూర్తి అయితే.. హిందీలో అయితే ఏకంగా 17వ సీజన్ లోకి అడుగుపెట్టింది.. సల్మాన్ ఖాన్ హోస్ట్ గా ఆ షో నడుస్తోంది.. 17వ సీజన్ గత ఏడాది అక్టోబర్ 15న ప్రారంభమైంది. విక్కీ జైన్, ఆయేషాఖాన్, దోభాల్, ఐశ్వర్య శర్మ, నీల్ భట్, ఇషా మాల్వియా, జిగ్నా వోరా, ఫిరోజా ఖాన్, రింకూ ధావన్.. ఇలా 17 మంది పోటీదారులు 17వ సీజన్లో పాల్గొన్నారు. ఇక ఆదివారం ఫైనల్ నిర్వహించారు.. సల్మాన్ ఖాన్ సమక్షంలో విజేతను ప్రకటించారు. ఫైనల్ లో మునావర్ అభిషేక్ కుమార్ ను ఓడించి ట్రోఫీ గెలుచుకున్నాడు. ట్రోఫీతో పాటు 50 లక్షల నగదు, ఒక కారును కూడా గెలుచుకున్నాడు. బాలీవుడ్ నటుడు అజయ్ దేవగన్, కోలీవుడ్ నటుడు మాధవన్ ప్రత్యేక అతిధులుగా ఫైనల్ కు హాజరయ్యారు. ఫైనల్ సందర్భంగా కంటెస్టెంట్లతో ఈ ఇద్దరు నటులు మాట్లాడారు. సల్మాన్ ఖాన్ కూడా వారితో జత కలిసి నవ్వులు పూయించారు. అంతేకాదు బహుళ ఆదరణ పొందిన తమ సినిమాలోని పాటలకు స్టెప్పులు వేశారు..
ఫైనల్లో మన్నారా చోప్రా, అంకిత లోఖండే, ప్రముఖ యూట్యూబ్ అరుణ్ శ్రీకాంత్ మహాశెట్టి, అభిషేక్ కుమార్, మునావర్ ఫారూఖీ ట్రోఫీ కోసం పోటీపడ్డారు. చివరి అంచెలో ట్రోఫీ కోసం మునావర్, అభిషేక్ పోటీ పడాల్సి వచ్చింది. ఈ క్రమంలో తీవ్ర ఉత్కంఠ మధ్య సల్మాన్ ఖాన్ మునావర్ ను విజేతగా ప్రకటించారు. 50 లక్షల ప్రైజ్ మనీ, ఒక కారు కూడా అందజేశారు.. ఈ విషయాన్ని మునావర్ తన ట్విట్టర్ ఎక్స్ ద్వారా పంచుకున్నారు.. ఈ సోను జియో సినిమా లైవ్ టెలికాస్ట్ చేసింది.. కాగా ట్రోఫీని అభిషేక్ గెలుచుకుంటారని చాలామంది అనుకున్నారు. కానీ కొన్ని టాస్క్ లలో మునావర్ ప్రతిభ చూపడంతో అతడిని విజేతగా ఎంపిక చేశామని నిర్వాహకులు తెలిపారు. మునావర్ బిగ్ బాస్ 17వ సీజన్ ట్రోఫీ గెలుచుకోవడంతో అతడి అభిమానులు సంబరాలు చేసుకుంటున్నారు. సామాజిక మాధ్యమాల వేదిక అతడికి శుభాకాంక్షలు చెబుతున్నారు.. ప్రస్తుతం ట్విట్టర్ ఎక్స్, గూగుల్ ట్రెండ్స్, ఫేస్బుక్, ఇన్ స్టా గ్రామ్ లలో మునావర్ యాష్ ట్యాగ్ తెగ చర్చనీయాంశమవుతున్నది.