Bigg Boss Telugu 8: కమెడియన్స్ అంటే బిగ్ బాస్ కి ఎందుకు అంత చిన్న చూపు?, కేవలం వాళ్ళను కామెడీ కి మాత్రమే పరిమితం చేస్తారా..?, వాళ్ళు పడిన కష్టాన్ని అసలు గుర్తించరా అంటే అవుననే చెప్పాలి. ఈ సీజన్ వైల్డ్ కార్డ్స్ గా హౌస్ లోకి అడుగుపెట్టిన గత సీజన్స్ కంటెస్టెంట్ అవినాష్ టేస్టీ తేజ కేవలం ఎంటర్టైన్మెంట్ పంచడం మాత్రమే కాదు, టాస్కులు కూడా ఎంత దమ్ముగా ఆడుతున్నారో మన కళ్లారా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా టేస్టీ తేజ గురించి మాట్లాడుకోవాలి. హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ అందరికంటే తేజ చాలా తెలివైనోడు. గత సీజన్ లో శివాజీ ఈ విషయాన్ని ప్రత్యేకంగా చెప్పేవాడు. అప్పట్లో తేజ లోని ఇంటలిజెన్స్ ని ఎవ్వరూ గుర్తించలేదు కానీ, ఈ సీజన్ లో ఆయన మొన్న జరిగిన క్విజ్ టాస్క్ లో ఎంత తెలివైన మనిషో నిరూపించుకున్నాడు. ఎంత కష్టమైన ప్రశ్నకి అయినా తేజ నిమిషాల వ్యవధి లో సమాదానాలు చెప్పి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసాడు. బిగ్ బాస్ హిస్టరీ లో ఇప్పటి వరకు ఎవ్వరూ ఇలా చేయలేదు. ఇక నామినేషన్స్ విషయానికి వస్తే, టేస్టీ తేజ రేంజ్ లో పాయింట్స్ ఏ కంటెస్టెంట్స్ కూడా పెట్టలేకపోతున్నారు.
అంత స్పష్టమైన క్లారిటీ తో ఉంటాడు ఆయన. అలాగే ఎంటర్టైన్మెంట్ విషయంలో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఈ వారం గంగవ్వ దెయ్యం స్కిట్ కి కర్త, ఖర్మ, క్రియ మొత్తం టేస్టీ తేజ నే. ఆ స్కిట్ హౌస్ మేట్స్ అందరినీ ఎంతలా భయపెట్టిందో తెలిసిందే. ఇక టాస్కుల విషయానికి వస్తే టేస్టీ తేజ కి ఉన్న దూకుడు, వాళ్ళ క్లాన్ లో ఏ కంటెస్టెంట్ కి కూడా లేదు అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ముఖ్యంగా ఈ వారం బస్తాల టాస్క్ లో తేజ ఆట తీరుని చూసి ఆడియన్స్ కి భయం వేసింది. ఎందుకంటే అంత పొట్ట వేసుకొని ఆయన నిఖిల్, పృథ్వీ ని అడ్డుకోవడం కోట్లాది మంది తెలుగు ప్రేక్షకులు వీక్షించారు.
ఆ క్రమం లో ఎన్నోసార్లు క్రింద పడినప్పటికీ కూడా పైకి లేచి దూకుడుగా ఆడడం, మెహబూబ్, గౌతమ్ వంటి వారు కూడా బస్తాని తోపుడు బండి వరకు తీసుకొని వెళ్లలేకపోయారు, కానీ టేస్టీ తేజ మాత్రం అంత దూరం తీసుకెళ్లి, ఒక బస్తా తోపుడు బండి మీద వేస్తాడు, రెండవ సారి కూడా ఆయన బస్తని తోపుడు బండికి దగ్గరగా తీసుకొస్తాడు. ఇలా ప్రతీ వారం తన ఆట తీరుని మార్చుకుంటూ ముందుకు దూసుకుపోతున్నాడు. కానీ అతన్ని అక్కినేని నాగార్జున గుర్తించకపోవడం ఆడియన్స్ కి నచ్చడం లేదు. నిన్న పృథ్వీ, నిఖిల్ ని పొగిడారు. ఆ తర్వాత గౌతమ్, మెహబూబ్ ని పొగిడారు. కానీ టేస్టీ తేజ, అవినాష్ ని మాత్రం పట్టించుకోలేదు. దీంతో బిగ్ బాస్ టీం కి కమెడియన్స్ అంటే చాలా చిన్న చూపు అనే విషయం అర్థమైంది.