Bigg Boss Telugu 6 Revanth: బిగ్ బాస్ సీజన్ 6 టాప్ సెలబ్రిటీగా ఎంట్రీ ఇచ్చిన రేవంత్ అట తీరు, ప్రవర్తన విమర్శల పాలవుతుంది. అటు ఇంట్లో ఇటు బయట రేవంత్ ఇమేజ్ డ్యామేజ్ అవుతుంది. రేవంత్ యాటిట్యూడ్ కారణంగా అతడు టైటిల్ గెలుచుకునే అవకాశాలు చేజార్చుకుంటున్నాడన్న వాదనలు వినిపిస్తున్నాయి. బిగ్ బాస్ టైటిల్ గెలవాలంటే ఫిజికల్ స్ట్రెంగ్త్ కి మించి మెంటల్ స్ట్రెంగ్త్ ఉండాలి. సందర్భానుసారంగా నిర్ణయాలు తీసుకున్న వాళ్ళకే మైలేజ్ ఉంటుంది. మంచి చెడులను జడ్జి చేయాలి. తప్పు చేసిన వాళ్ళను ప్రశ్నించాలి. మంచి చేసిన వాళ్లకు మద్దతుగా నిలవాలి. ఇలాంటి జెన్యూన్ గేమ్ ఆడియన్స్ లో ఇమేజ్ తీసుకొస్తుంది.

ఈ నియమాలకు విరుద్ధంగా సింగర్ రేవంత్ ప్రవర్తన ఉంది. హౌస్లోకి వెళ్లే ముందే తాను ముక్కుసూటి మనిషిని అని హోస్ట్ నాగార్జునతో రేవంత్ చెప్పాడు. ఈ కారణంగా తనని పొగరుబోతు అనుకుంటారని చెప్పాడు. హౌస్లో రేవంత్ ప్రవర్తన ముక్కుసూటిగా ఏమీ లేదు. కంటెస్టెంట్స్ ని అతడు వాళ్ళ ఫేమ్ ఆధారంగా విలువ ఇస్తున్నాడు. వాళ్లతో అదే విధంగా ప్రవర్తిస్తున్నాడు. కంటెస్టెంట్ ఆది రెడ్డిని నువ్వు కేవలం సోషల్ మీడియా సెలెబ్రిటీవి అని అర్థం వచ్చేలా కించపరిచారు. ముఖ్యంగా అతడు హౌస్ లో ఉన్నవారందరి కంటే గొప్ప అన్నట్లు ఫీల్ అవుతున్నాడు.
రేవంత్ తో పాటు బాల ఆదిత్య, చలాకీ చంటి, కీర్తి భట్ లకు కూడా మంచి పాపులారిటీ, ఫేమ్ ఉంది. వారెవరు తాము గొప్ప ఇతరులు తక్కువ అన్నట్లు ప్రవర్తించడం లేదు. రేవంత్ మాత్రం తనను సపరేట్ గా ఫీల్ అవుతున్నాడు. ఈ క్రమంలో మెజారిటీ కంటెస్టెంట్స్ అతనికి శత్రువులుగా తయారవుతున్నారు. అదే సమయంలో రేవంత్ ఆర్గ్యూ చేసే విధానం కూడా బాగా లేదు. పాయింట్ లేకుండా తన మాటే గెలవాలన్నట్లు మాట్లాడుతున్న రేవంత్ ప్రేక్షకులకు విసుగు తెప్పిస్తున్నాడు.

ఇండియన్ ఐడల్ విన్నర్ గా, స్టార్ సింగర్ గా రేవంత్ కి మంచి పాపులారిటీ ఉంది. మిగతా వాళ్లతో పోల్చుకుంటే అతడు పెద్ద సెలబ్రిటీనే. అయితే బిగ్ బాస్ హౌస్ లో అందరూ ఒకటే. పదుల సంఖ్యలో ఉన్న కెమెరాలు మన చర్యలను, మాటలను ప్రతిక్షణం రికార్డు చేస్తూ ఉంటాయి. కంటెస్టెంట్ చేసే చిన్న మిస్టేక్, తప్పుడు ఆరోపణ ఇమేజ్ మొత్తం డామేజ్ చేస్తుంది. ఇవన్నీ రేవంత్ కి తెలియని కావు. హౌస్ లో మెజారిటీ కంటెస్టెంట్ అతని ప్రవర్తనపై కంప్లైంట్స్ చేస్తున్నా అతడు మారడం లేదు.
ఇప్పటి వరకు జరిగిన రెండు నామినేషన్స్ లో రేవంత్ పేరుంది. అప్కోర్స్ అతడు టాప్ సెలెబ్రిటీ, ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్నవాడు కాబట్టి ఎలిమినేట్ కాకపోవచ్చు. అయితే లాంగ్ రన్ లో అతడికి నష్టం జరుగుతుంది. ప్రతి వారం నెగిటివిటీ పెరుగుతూ ఉంటే టైటిల్ ఆశలు గల్లంతు అవుతాయి. గతంలో టాప్ సెలెబ్రిటీలు కొందరు టైటిల్ ఫేవరెట్స్ గా బరిలో దిగారు. వాళ్ళను వెనక్కి నెట్టి అంతగా ఫేమ్ లేని కౌశల్, రాహుల్ సిప్లిగంజ్, సన్నీ లాంటి వాళ్ళు టైటిల్ సొంతం చేసుకున్నారు. ఇప్పటికైనా మేలుకొని రేవంత్ ఆటతీరు మార్చుకోకపోతే… టైటిల్ కాదు కదా ఫైనల్ కి చేరడం కూడా కష్టమే.