Siri Hanmanth: బాలీవుడ్ స్టార్ బాద్ షా షారుఖ్ ఖాన్ సినిమా అంటే అంచనాలు మరోలా ఉంటాయి. ఊహించని రేంజ్ లో కలెక్షన్లు, బాక్సాఫీస్ హిట్ లు ఆయన సొంతం. ఫ్లాప్ లు తక్కువ హిట్ లు ఎక్కువగా ఉంటాయి ఈ స్టార్ హీరో సినిమాలు. పఠాన్ తో తనేంటో ప్రూఫ్ చేసుకున్న షారుఖ్, జవాన్ సినిమాతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకున్నారు. అయితే ఈ సినిమా ఇటీవల సెప్టెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు జవాన్ సినిమాతో వచ్చి భారీ విజయం సాధించారు. తమిళ్ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కింది జవాన్. ఇప్పటికే ఈ సినిమా దాదాపు 800 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ కలెక్ట్ చేసి 1000 కోట్లకు దూసుకెళ్తుంది. ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటించగా దీపికా పదుకొనే, ప్రియమణి ముఖ్య పాత్రలు పోషించారు. ఇక ఈ సినిమాలో కొంతమంది అమ్మాయిల్ టీం ఉంటుంది.
జవాన్ సినిమాలోని అమ్మాయిల టీంలో మన తెలుగు యూట్యూబర్, సీరియల్ నటి, బిగ్ బాస్ ఫేమ్ సిరి హన్మంతు కూడా నటించింది. సినిమాలో కొన్ని సీన్స్ లో కనిపిస్తుంది సిరి. సిరిని జవాన్ సినిమాలో చూసినప్పుడు తెలుగువాళ్లంతా ఆశ్చర్యపోయారు. సినిమాలో షారుఖ్ సిరి కాంబినేషన్ లో సీన్స్ కూడా ఉన్నాయి. దీంతో ఆ అమ్మాయి జవాన్ సినిమా దాకా వెళ్లిందా, షారుఖ్ తో యాక్ట్ చేసిందా అని షాక్ అయ్యారు నెటిజన్లు.
జవాన్ సినిమా తర్వాత సిరి మరింత పాపులర్ అయింది. తాజాగా ఓ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో సిరి జవాన్ సినిమా గురించి మాట్లాడింది. జవాన్ లో నటించేందుకు మొదట ఫోన్ వస్తే.. ప్రాంక్ కాల్ అని లైట్ తీసుకుందట సిరి. ఆ తర్వాత అదే విషయాన్ని తన మేనేజర్ కూడా ఫోన్ చేసి చెప్పడంతో షాక్ అయ్యాను అని తెలిపింది. షూటింగ్ కోసం ముంబై వెళ్లిందట ఈ భామ. సెట్స్ లో షారుఖ్ గారిని చూసేదాకా నమ్మకం కలగలేదట. సెట్స్ కి వెళ్ళాక కూడా ఇది నిజంగానే షారుఖ్ సినిమానా అని చాలా మందిని అడిగిందట. మొదటి సారి షూటింగ్ కి ముంబై వెళ్లడంతో భయం అనిపించి శ్రీహన్ ని తోడు తీసుకెళ్ళిందట ఈ అమ్మడు.
ఈ సినిమా షూటింగ్ లో జరిగిన మరో సన్నివేశాన్ని కూడా పంచుకుంది సిరి.తను తెలుగమ్మాయి అని డైరెక్టర్ కు తెలియదట. తనను హిందీ అమ్మాయి అనుకున్నారట. ఒక సీన్ లో డైలాగ్ సరిగ్గా చెప్పలేక దాదాపు ఏడు టేక్స్ తీసుకుందట సిరి. దాంతో డైరెక్టర్ అట్లీ బాగా తిట్టేసాడని.. తనకు ఏడ్పు కంట్రోల్ అవలేదని తెలిపింది. అంతే కాదు సెట్స్ లోనే ఏడ్చేసిందట ఈ భామ. అయితే షారుఖ్ తన దగ్గరికి వచ్చి ఎందుకు ఏడుస్తున్నావు అని మోటివేట్ చేశారట. అసలు ఆయనతో నటించడమే ఒక కలలా ఉందంటే, ఆయన తన దగ్గరికి వచ్చి మోటివేట్ చేయడం ఎప్పటికి మర్చిపోలేను అని జవాన్ సినిమాలో తన అనుభవాలను తెలియజేసింది సిరి.