Bigg Boss 7 Telugu: బిగ్ బాస్ హౌస్ లో ప్రస్తుతం ఉన్న టాప్ 6 ఫైనలిస్టులకు వరుసగా జర్నీ వీడియోలు చూపిస్తూ సర్ప్రైజ్ చేస్తున్నారు. ఈ క్రమంలోనే ప్రియాంక జైన్ కి అదిరిపోయే సర్ప్రైజ్ ఇచ్చారు బిగ్ బాస్. ఇప్పుడు హౌస్ లో ఆరుగురు ఫైనలిస్టులు ఉన్నారు. ప్రియాంక మొదటి నుంచి మగ వాళ్ళ తో సమానంగా ఆడుతూ గట్టి పోటీ ఇచ్చింది. తనదైన శైలిలో ఆటను ప్రదర్శించి ఫైనల్ కి చేరిన ఒకే ఒక ఆడపిల్ల ప్రియాంక జైన్.
అయితే ఫినాలే వీక్ లో భాగంగా నిన్న అమర్ దీప్, అర్జున్ ల జర్నీ వీడియోలు చూపించారు. ఈ నేపథ్యంలోనే ప్రియాంక కోసం గార్డెన్ ఏరియా లో ఆమె ప్రయాణాన్ని గుర్తు చేసే తీపి జ్ఞాపకాలు అన్నీ ఫోటోలు రూపంలో ఎరేంజ్ చేశారు. వాటిని చూసి ప్రియాంక ఆనందంతో పొంగి పోయింది. ఇక ప్రియాంక గురించి బిగ్ బాస్ చెప్తూ .. ప్రియాంక .. ఎవరితో స్నేహం సరైనదో .. ఆటలో ముందుకు వెళ్లేందుకు ఏ దారిని ఎంచుకోవాలో మీకు స్పష్టత ఉంది.
ఇంటికి ఆయువుపట్టు లాంటి కిచెన్ కి ఉన్న శక్తిని అర్థం చేసుకుని అక్కడి నుంచే మీ ఆట కొనసాగించారు .. సింపుల్ ప్రియాంక గా ఉండే మీరు సివంగి ప్రియాంక గా మారి నామినేషన్లలో విరుచుకుపడ్డ తీరు మీరేంటో అందరికీ అర్ధమయ్యేలా చేసింది. ఎవరు ఎన్ని మాటలన్నా వాటి నుంచి తేరుకుని మీ లక్ష్యం పై దృష్టి పెట్టారు తప్ప .. ఆత్మ విశ్వాసాన్ని కోల్పోలేదు .. అంటూ బిగ్ బాస్ ప్రియాంక గురించి గొప్పగా చెప్పారు.
ఇక తన బిగ్ బాస్ జర్నీ చూసి ప్రియాంక చాలా ఎమోషనల్ అయ్యింది. అయితే బిగ్ బాస్ కిచెన్ ప్రస్తావన తెచ్చి ఆమె బిగ్ బాస్ ఇంటి వంటలక్క అని తేల్చేశాడు. ప్రతి సీజన్లో ఒకరికి ఈ పోస్ట్ దక్కుతుంది. ఈ సీజన్ వంటలక్కగా ప్రియాంక జైన్ నిలిచింది. ఇక షో మరో నాలుగు రోజుల్లో ముగుస్తుంది. కాగా విన్నర్ ఎవరు అవుతారు, రన్నర్ అప్ గా ఎవరు నిలుస్తారు అనేది ఆసక్తికరంగా మారింది.