Bigg Boss 7 Telugu: ఆదివారం ఆసక్తికర అంశాలతో సాగింది. టాప్ కంటెస్టెంట్ అనుకున్న ఒకరు ఎలిమినేట్ అయ్యారు. హోస్ట్ నాగార్జున సన్ డే అంటే ఫన్ డే అంటూ స్టార్ట్ చేశాడు. సరదా గేమ్స్ తో పాటు చెమటలు పట్టించే ఎలిమినేషన్ కూడా జరిగింది. ఈ రోజంతా అమ్మాయిలు వర్సెస్ అబ్బాయిలు అని స్పష్టం చేశాడు. దీనిలో భాగంగా ఓ గేమ్ కండక్ట్ చేశారు. ఒక అబ్బాయి కళ్ళకు గంతలు కట్టి చేతికి ఒక పాము బొమ్మను ఇస్తారు. ఆ బొమ్మతో ఆ గదిలో ఉన్న అమ్మాయిలను తాకాల్సి ఉంది.
టేస్టీ తేజ కళ్ళకు గంతలు కట్టారు. అతడు ఎవరినీ తాకలేకపోయాడు. నటుడు అమర్ దీప్ కూడా ఆడాడు. అతని వల్ల కూడా కాలేదు. అమ్మాయిల్లో శోభా శెట్టి కళ్ళకు గంతలు కట్టుకుని అబ్బాయిలను తాకే ప్రయత్నం చేసింది. ఈ గేమ్ లో శుభశ్రీ ఆకట్టుకుంది. ఆమె ఎనర్జిటిక్ గా గేమ్ ఆడింది. ఒకరిద్దరు అబ్బాయిలను పాముతో తాకింది. నాగార్జున ఆమెను మెచ్చుకున్నాడు.
అనంతరం హౌస్లో గుర్తు పెట్టుకునే సంఘటన, మర్చిపోవాలనుకుంటున్న సంఘటనలు చెప్పాలని నాగార్జున కంటెస్టెంట్స్ ని ఆదేశించాడు. గుర్తు పెట్టుకునే సంఘటనకు కారణమైన కంటెస్టెంట్ ని లవ్ సింబల్ వద్ద, మర్చిపోవాలనుకునే సంఘటనకు కారణమైన కంటెస్టెంట్ ని క్రాస్ సింబల్ వద్ద ఉంచి చెప్పాలన్నారు. 14 మంది కంటెస్టెంట్స్ తమకు మంచి ఫీలింగ్ ఇచ్చిన సంఘటన, ఇబ్బందిపెట్టిన సంఘటన పంచుకున్నారు.
ఫన్ మధ్య కీలకమైన ఎలిమినేషన్ ప్రక్రియ స్టార్ట్ చేశాడు నాగార్జున. నామినేషన్ లో ఉన్న 8 మందిని నిల్చోమన్నాడు. అందరికీ వారి పేర్లు రాసిన కఫిన్ బాక్సులు ఇచ్చారు. ఆ బాక్స్ లో అస్తిపంజరం ఉంటే నాట్ సేఫ్, గులాబీ రేకులు ఉంటే సేఫ్ అని చెప్పాడు. రతికా రోజ్, శోభా శెట్టిలకు రోజ్ పెటల్స్ వచ్చాయి. దీంతో వారిద్దరూ మొదటి రౌండ్ లో సేవ్ అయ్యారు. అనంతరం గౌతమ్ కృష్ణ, షకీలా, దామినీ, పల్లవి ప్రశాంత్ సైతం సేవ్ అయ్యారు.
డేంజర్ జోన్లో కిరణ్ రాథోడ్, ప్రిన్స్ యావర్ నిలిచారు. వీరిలో ఎవరు ఎలిమినేట్ అవుతారనే ఉత్కంఠ సాగింది. నాగార్జున కిరణ్ రాథోడ్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. ఒకప్పుడు సౌత్ ఇండియాను షేక్ చేసిన కిరణ్ రాథోడ్ ఫస్ట్ వీక్లోనే ఇంటి బాట పట్టడం షాకింగ్ పరిణామం. ఆమెకు తెలుగు రాకపోవడం మైనస్ అయ్యింది. నాగార్జున ఆమెను సాదరంగా సొంత ఇంటికి పంపారు.