Nagarjuna: నాగార్జునను వరుస వివాదాలు వెంటాడుతున్నాయి. ఒక ప్రక్క ఆయన బిగ్ బాస్ హోస్ట్ గా విమర్శలు ఎదుర్కొంటున్నారు. బిగ్ బాస్ షో వలన యువత తప్పుదోవ పడతారనే వాదన చాలా కాలంగా ఉంది. నాగార్జున ఇంటి ఎదుట కొందరు ధర్నాలు కూడా చేశారు. నాగార్జునపై సిపిఐ నారాయణ ఘాటైన వ్యాఖ్యలు చేశాడు. ఇదిలా ఉండగా హైడ్రా నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ సెంటర్ ని కూల్చి వేసింది. తుమ్ముడికుంట చెరువును ఆక్రమించి నాగార్జున ఎన్ కన్వెన్షన్ నిర్మించారు అనేది ప్రధాన ఆరోపణ.
ఎలాంటి నోటీసులు ఇవ్వకుండానే ఎన్ కన్వెన్షన్ కూల్చేయడం అక్రమం అని నాగార్జున ఆగ్రహం వ్యక్తం చేశాడు. కోర్టులో కేసు నడుస్తుండగా చర్యలు ఎలా తీసుకుంటారని ఆయన ప్రశ్నించారు. స్టే ఆర్డర్ తెచ్చుకోవడంతో ఎన్ కన్వెన్షన్ కూల్చివేతకు హైడ్రా బ్రేక్ వేసింది. ఇదే వివాదంలో నాగార్జున మీద మరో కేసు నమోదైంది. జనం కోసం అధ్యక్షుడు కసిరెడ్డి భాస్కర్ రెడ్డి మాదాపూర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తుమ్మిడికుంటను ఆక్రమించి ఎన్ కన్వెన్షన్ నిర్మించిన నాగార్జున పర్యావరణాన్ని పాడు చేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు లీగల్ ఒపీనియన్ కి పంపించినట్లు సమాచారం. ఎన్ కన్వెన్షన్ వివాదం ఇప్పటిది కాదు. అప్పటి భారసా ప్రభుత్వం ఎన్ కన్వెన్షన్ నిర్మాణం అక్రమం అంటూ కూల్చివేసే ప్రయత్నం చేసింది. నాగార్జున కోర్టులో స్టే ఆర్డర్ తెచ్చుకున్నారు. అప్పటి నుండి కేసు కోర్టులో నడుస్తుంది.
మరోవైపు మంత్రి కొండా సురేఖ సమంత-నాగ చైతన్యలను ఉద్దేశిస్తూ చేసిన కామెంట్స్ దుమారం రేపాయి. కేటీఆర్ టాలీవుడ్ ప్రముఖుల ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడ్డాడు. అదే సమంత, నాగ చైతన్యల విడాకులకు కారణమైంది. కేటీఆర్ వలన కొందరు పరిశ్రమను వదిలి వెళ్లిపోయారని కొండా సురేఖ అన్నారు.
కొండా సురేఖ ఆరోపణలను టాలీవుడ్ ముక్తకంఠంతో ఖండించింది. ఎన్టీఆర్, మహేష్ బాబు, చిరంజీవి, విజయ్ దేవరకొండతో పాటు పలువురు ప్రముఖులు కొండా సురేఖ కామెంట్స్ పై మండిపడ్డారు. నాగార్జున కొండా సురేఖ మీద పరువు నష్టం దావా వేసినట్లు సమాచారం. పరోక్షంగా సమంత, నాగ చైతన్యల క్యారెక్టర్స్ ని కొండా సురేఖ తప్పుబట్టారు. కొండా సురేఖ క్షమాపణలు చెప్పినా, వివాదం చల్లారలేదు. 2021లో సమంత-నాగ చైతన్య విడాకుల ప్రకటన చేసిన సంగతి తెలిసిందే. ఆగస్టు 8న శోభిత ధూళిపాళ్లతో నాగ చైతన్యకు ఎంగేజ్మెంట్ జరిగింది.