
లాక్డౌన్ కారణంగా దేశంలో సినిమా షూటింగులు వాయిదా పడగా, థియేటర్లన్నీ మూతపడ్డాయి. టీవీ షోలు కూడా పాతవాటిని రిపిట్ చేస్తుండటంతో ప్రేక్షకులు ఓటీటీ వైపు చూస్తున్నారు. ఓటీటీ ప్లాట్ ఫామ్స్ లో విడుదలవుతోన్న కొత్త మూవీలు, వెబ్ సీరిసులకు ప్రేక్షకులకు అలవాటు పడిపోతున్నారు. ఒకప్పుడు సినిమాలకే పరిమితమైన వివాదాలు ప్రస్తుతం వెబ్ సీరీసులను తాకుతున్నాయి. ఇటీవల బాలీవుడ్ నటి అనుష్క శర్మ నిర్మాతగా మారి తెరకెక్కించిన ‘పాతల్ లోక్’ వివాదాల్లో చిక్కుకున్న సంగతి తెల్సిందే. ఓ వర్గాన్ని కించపరిచేలా కొన్ని సన్నివేశాలున్నాయని అనుష్క శర్మకు లీగల్ నోటీసులు కూడా జారీ అయ్యాయి. తాజాగా బాలీవుడ్ బాద్షా షారూఖ్ నిర్మించిన ‘బేతాళ్’ వెబ్ సీరిస్ వివాదాల్లో చిక్కుకుంది.
షారూక్‌ఖాన్ నిర్మాతగా రెడ్ చిల్లీస్ సంస్థతో కలిసి ‘బేతాళ్’ వెబ్ సీరిస్ నిర్మించాడు. ఇందులో వినీత్ కుమార్, అహనా కుమార్, సుచిత్ర పిళ్లై, జితేంద్ర జోషి ముఖ్య పాత్రల్లో నటించారు. ఈనెల 24న వెబ్ సీరిసు తొలి సీజన్‌ను విడుదల చేయాలని భావించారు. అయితే బేతాళ్ కథకు తాము రాసుకున్న వితాళ్ కథకు పోలికలు ఉన్నాయని స్క్రీన్ రైటర్స్ సమీర్, మహేశ్ ముంబై కోర్టును ఆశ్రయించారు. ‘మేం మా కథను చాలా నిర్మాణ సంస్థలకు చెప్పాం. కానీ రెడ్ చిల్లీస్ సంస్థకు చెప్పలేదు.. అయితే మా ఐడియా వారికెలా తెలిసిందో అర్థం కావడం లేదు.. రైటర్స్ అసోసియేషన్‌లోనూ ఫిర్యాదు చేశా’మని పేర్కొన్నారు. దీంతో ‘బేతాళ్’ సిరీస్‌పై ప్రసారంపై కోర్టు నిషేధం విధించింది. ఈ వెబ్ సీరీసుకు పాట్రిక్ గ్రాహం, నిఖిల్ మహాజన్ దర్శకత్వం వహిస్తున్నారు. సెలబ్రెటీలు నిర్మించిన వెబ్ సీరీసులపై వరుసగా వివాదాలు చోటుచేసుకుంటుండం చర్చనీయాంశంగా మారింది.