Gabbar Singh Re Release: టాలీవుడ్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ సినిమా వస్తుందంటే ఏ రేంజ్ హంగామా ఉంటుందో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. సినిమా హిట్ లేదా ఫ్లాప్ అనేది పక్కన పెడితే కేవలం పవన్ కళ్యాణ్ ని వెండితెర మీద చూస్తే చాలు అని అనుకుంటూ ఉంటారు ఆడియన్స్. అందుకే ఆయన సినిమా ఎంత ఫ్లాప్ అయినా మొదటి వారం కళ్ళు చెదిరే ఓపెనింగ్స్ వస్తుంటాయి. అంతే కాదు పవన్ కళ్యాణ్ రీ రిలీజ్ సినిమాలకు కూడా విపరీతమైన క్రేజ్ ఉంటుంది. జల్సా, ఖుషి, తమ్ముడు, తొలిప్రేమ వంటి సినిమాలను రీ రిలీజ్ చేస్తే ఏ స్థాయి వసూళ్లు వచ్చాయో మన కళ్లారా చూసాము.
చివరికి ఆయన ఫ్లాప్ చిత్రం ‘కెమెరా మెన్ గంగతో రాంబాబు’ ని రీ రిలీజ్ చేసినా డీసెంట్ స్థాయి వసూళ్లు వచ్చాయంటే పవన్ కళ్యాణ్ స్టామినా ఎలాంటిదో అర్థం చేసుకోవచ్చు. ఇకపోతే ప్రతీ ఏడాది లాగానే ఈ ఏడాది కూడా పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ఆయన కెరీర్ లో మైలు రాయిగా నిల్చిన ‘గబ్బర్ సింగ్’ చిత్రాన్ని గ్రాండ్ గా విడుదల చెయ్యబోతున్నారు. ఈ సినిమాకి పవన్ ఫ్యాన్స్ సరికొత్త ట్రెండ్ కి శ్రీకారం చుట్టబోతున్నట్టు తెలుస్తుంది. సాధారణంగా ఏ స్టార్ హీరో సినిమాకి అయినా బెన్ఫిట్ షోస్ కచ్చితంగా ఉంటాయి. కొన్ని చోట్ల తెల్లవారు జామున బెన్ఫిట్ షోస్ వేసుకుంటారు, మరికొన్ని చోట్ల అర్థ రాత్రి నుండి బెన్ఫిట్ షోస్ వేసుకుంటారు. కానీ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ ఈసారి రీ రిలీజ్ సినిమాకి బెన్ఫిట్ షోస్ ప్లాన్ చేసే పనిలో ఉన్నారు. ఆంధ్ర ప్రదేశ్ కి ఉప ముఖ్యమంత్రి అయిన తర్వాత వస్తున్న మొట్టమొదటి సినిమా కావడంతో ఆయన పుట్టినరోజు ని కనీవినీ ఎరుగని రీతిలో ఉండేలా ప్లాన్ చేస్తున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ గబ్బర్ సింగ్ స్పెషల్ షోస్ అర్థరాత్రి నుండే ప్రారంభం కానున్నాయి. మొదటి రోజు 15 నుండి 20 కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టే టార్గెట్ తో ప్లానింగ్ చేస్తున్నారు అభిమానులు. ఇప్పటి వరకు రీ రిలీజ్ చిత్రాలలో అత్యధిక వసూళ్లు రాబట్టిన సినిమాలలో తమిళ హీరో విజయ్ నటించిన గిల్లి చిత్రం నిల్చింది. ఈ సినిమాకి దాదాపుగా మొదటి రోజు 7 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి.
ఓవర్సీస్ లో ప్రభంజనం సృష్టించింది. ఇప్పుడు గబ్బర్ సింగ్ చిత్రానికి దానికంటే రెండింతలు ఎక్కువ వచ్చే అవకాశాలు ఉన్నట్టుగా చెప్తున్నారు ట్రేడ్ పండితులు. కేవలం నార్త్ అమెరికాలోనే ఈ సినిమాకి మొదటి రోజు వందకి పైగా లొకేషన్స్ లో షోస్ ప్లాన్ చేస్తున్నారట. లక్ష డాల్లర్లకు పైగానే వసూళ్లను రాబట్టే అవకాశాలు ఈ చిత్రానికి పుష్కలంగా ఉన్నాయట. ఇప్పటి వరకు యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరో గా నటించిన సింహాద్రి చిత్రానిదే రీ రిలీజ్ లలో ఆల్ టైం రికార్డు. ఆ సినిమాకి దాదాపుగా 60 వేల డాలర్ల వసూళ్లు వచ్చాయి. ఇప్పుడు ఈ రికార్డు డబుల్ మార్జిన్ తో బ్రేక్ అవ్వబోతున్నట్టు సమాచారం.