Battle Of Galwan Teaser Review: తన ప్రయోజనాల కోసం చైనా ఎంతటి దుర్మార్గానికైనా పాల్పడుతుంది. ఎంతటి దారుణానికైనా సరే ఒడిగడుతుంది. కేవలం తనకు ఉపయోగపడితే చాలు.. ఈ దేశం ముందు అయినా సరే స్నేహ హస్తం చాచుతుంది. తన అక్కర తీరిపోయిన తర్వాత మొహమాటం లేకుండా వదిలేస్తుంది. అందువల్లే చైనాతో దోస్తీ అంటే దృతరాష్ట్ర కౌగిలి అని విశ్లేషకులు చెబుతుంటారు.
చైనా మనతో కుదుర్చుకున్న ఒప్పందం ప్రకారం యుద్ధం చేయకూడదు. అందులోనూ ఇటువంటి యుద్ధ సామాగ్రిని వాడకూడదు. ఇదే నిబంధన మనకు కూడా వర్తిస్తుంది. అందువల్లే గాల్వాన్ లోయలో జరిగిన ఉద్రిక్తతలో రెండు దేశాలకు సంబంధించిన సైనికులు కేవలం భౌతికపరమైన దాడులు మాత్రమే చేసుకున్నారు. అప్పట్లో జరిగిన ఈ ఘటనలో మన దేశానికి చెందిన సంతోష్ అనే సైనికుడు వీరమరణం పొందాడు. గాల్వాన్ లోయలో జరిగిన ఘటన తర్వాత చైనా సరిహద్దుల బద్ద భారత్ తన భద్రతను మరింత పటిష్టం చేసింది. అరుణాచల్ ప్రదేశ్ వద్ద రకరకాల విన్యాసాలు చేస్తున్నప్పటికీ.. చైనాకు సరైన స్థాయిలో భారత్ సమాధానం చెబుతోంది.
గాల్వాన్ లోయలో జరిగిన నాటి ఘటనను ప్రధాన ఇతివృతంగా తీసుకొని రూపొందిస్తున్న సినిమాలో బాలీవుడ్ అగ్ర నటుడు సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. ఇటీవల ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమాకు సంబంధించిన టీజర్ విడుదల చేశారు. ఈ టీజర్ కాస్త ప్రపంచ వ్యాప్తంగా చర్చకు దారి తీసింది. మనదేశంలో విపరీతమైన ఆదరణ దక్కగా.. చైనా మాత్రం షేక్ అయింది. సినిమాను సినిమా మాదిరిగా చూడకుండా.. తన అక్కసు మొత్తం వెళ్లగక్కింది. అంతేకాదు తన మౌత్ పీస్ గ్లోబల్ టైమ్స్ ద్వారా పిచ్చి రాతలు రాసింది. తమ దేశం మీద వ్యతిరేకతను రెచ్చగొడుతున్నారని.. చరిత్రను వక్రీకరిస్తున్నారని అడ్డగోలుగా రాసింది. అంతేకాదు, బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ సినిమా మీద నోరు పారేసుకుంది.
సల్మాన్ ఖాన్ నటిస్తున్న ఈ సినిమాను జాతీయవాద డ్రామా అని కొట్టిపారేసింది చైనా. గాల్వాన్ లోయలో ఉద్రిక్తతలకు భారత సైనికుల కారణమంటూ చైనా వితండవాదాన్ని చేయడం మొదలు పెట్టింది. తమ భూభాగంలోకి భారత దళాలు ప్రవేశించాయని.. తమ సైనికుల మీద దాడులు చేశాయని పిచ్చిపిచ్చి వ్యాఖ్యలు చేసింది. తమ దేశానికి చెడ్డ పేరు తీసుకురావడానికి భారత్ ఇలాంటి వాస్తవ వక్రీకరణలకు పాల్పడుతోందని ఆరోపించింది. “మాకు బలమైన దృఢ సంకల్పం ఉంది. చైనా భూభాగాన్ని మేము రక్షించుకుంటాం. సార్వభౌమ అధికారాన్ని కాపాడుకుంటాం. మా సామర్థ్యాన్ని కదిలించలేరని” చైనా సైనికనిపుణుడు సాంగ్ జాంగ్ పింగ్ చేసిన వ్యాఖ్యలను గ్లోబల్ టైమ్స్ తన సంపాదకీయంలో ప్రస్తావించింది.
2020 జూన్ లో గాల్వాన్ లోయలో రెండు దేశాల సైనికుల మధ్య భీకరమైన ఘర్షణలు చోటుచేసుకున్నాయి. భారత సైనికులపై చైనాసైనికులు మెరుపు దాడికి దిగారు. మన సైనికులు కూడా ప్రతి దాడి బలంగానే చేశారు. ఈ పోరాటంలో తెలంగాణకు చెందిన సంతోష్ తో పాటు 20 మంది భారత సైనికులు వీరమరణం చెందారు. చైనా వైపు కూడా భారీగానే ప్రాణ నష్టం ఉన్నప్పటికీ.. దానిని డ్రాగన్ అధికారికంగా ప్రకటించలేదు.
ఈ ఘర్షణలను ఆధారంగా చేసుకొని బ్యాటిల్ ఆఫ్ గాల్వాన్ అనే సినిమాను రూపొందించారు. సంతోష్ బాబు పాత్రలో సల్మాన్ ఖాన్ నటిస్తున్నారు. చిత్రంగాద సింగ్ కథానాయకగా నటిస్తున్నారు. ఇటీవల విడుదలైన ఈ సినిమా టీజర్ లో సల్మాన్ ఖాన్ భావోద్వేగమైన మాటలు చెప్పారు. ” సైనికులారా చావుకు భయపడాల్సిన అవసరం లేదు. అది ఎప్పుడైనా వస్తుంది. మీరు ఒకటి మాత్రం గుర్తుంచుకోండి. గాయపడితే దానిని ఒక మెడల్ మాదిరిగా అనుకోండి. చావు కనుక ఎదురైతే సెల్యూట్ చేసి.. ఇప్పుడు కాదు.. బహుశా ఇంకొకసారి అని చెప్పండని” సల్మాన్ ఖాన్ టీజర్ లో డైలాగులు చెప్పారు. అవి ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఆకట్టుకుంటున్నాయి.