Balayya : వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఒక రేంజ్ ఊపులో ఉన్న నందమూరి బాలకృష్ణ, ఈ సంక్రాంతికి ‘డాకు మహారాజ్’ అనే చిత్రం తో మన ముందుకు రాబోతున్న సంగతి తెలిసిందే. ‘వాల్తేరు వీరయ్య’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ తర్వాత డైరెక్టర్ బాబీ తెరకెక్కిస్తున్న సినిమా ఇది. షూటింగ్ చివరి దశలో ఉన్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా జనవరి 12 న విడుదల కాబోతుంది. ఇప్పటికే ఈ చిత్రం నుండి ఒక గ్లిమ్స్ వీడియో, ఒక టైటిల్ సాంగ్ ని మేకర్స్ విడుదల చేయగా, వాటికి అభిమానుల నుండి మంచి రెస్పాన్స్ వచ్చింది. అయితే ఈ సినిమాపై సాధారణ ఆడియన్స్ లో కావాల్సినంత బజ్ ఏర్పడలేదని ట్రేడ్ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ఇప్పటికే ఈ చిత్రానికి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ని ఓవర్సీస్ లో ప్రారంభించారు. తొలుత టెక్నీకల్ గ్లిచ్ రావడంతో షెడ్యూల్ చేసిన షోస్ ని రద్దు చేసారు.
ఆ తర్వాత సమస్య ని పరిష్కరించి అడ్వాన్స్ బుకింగ్స్ ని లైవ్ చేయగా, 256 షోస్ కి గానూ 1335 టిక్కెట్లు అమ్ముడుపోయాయి. గ్రాస్ వసూళ్లు 31 వేల డాలర్లు వచ్చినట్టు చెప్తున్నారు ట్రేడ్ విశ్లేషకులు. ఈ సినిమాతో పాటుగా రామ్ చరణ్ ‘గేమ్ చేంజర్’ చిత్రం రెండు రోజులు ముందుగా విడుదల అవుతుంది. భారీ బిజినెస్ జరిగిన పాన్ ఇండియన్ సినిమా కావడంతో బయ్యర్స్ ఈ చిత్రానికే అధికంగా షోస్ ని కేటాయిస్తున్నారు. ఇప్పటి వరకు గేమ్ చేంజర్ చిత్రానికి నార్త్ అమెరికా నుండి లక్ష 60 వేల డాలర్లు వచ్చాయి. కాసేపటి క్రితమే ఆ చిత్రానికి మరికొన్ని XD ప్రీమియర్ షోస్ ని షెడ్యూల్ చేయగా, రెండు లక్షల డాలర్ల గ్రాస్ వసూళ్లకు అతి చేరువలో వచ్చింది. ‘డాకు మహారాజ్’ కి తక్కువ షోస్ ఉండడంతో అనుకున్న స్థాయిలో గ్రాస్ వసూళ్లు రావడం లేదు.
అంతే కాకుండా అక్కడి ఆడియన్స్ ఎక్కువగా తమ అభిమాన హీరోల సినిమాలను XD స్క్రీన్స్ లో చూస్తుంటారు. డాకు మహారాజ్ చిత్రానికి అత్యధికంగా ఆ స్క్రీన్స్ లోనే షోస్ షెడ్యూల్ చేసారు. అయినప్పటికీ ఆక్యుపెన్సీ ఆశించిన స్థాయిలో లేకపోవడంతో, కచ్చితంగా ఈ చిత్రానికి హైప్ ఇంకా ఏర్పడలేదని అంటున్నారు అక్కడి ట్రేడ్ విశ్లేషకులు. థియేట్రికల్ ట్రైలర్, ప్రీ రిలీజ్ ఈవెంట్ వంటివి ఏర్పాటు చేస్తే, కచ్చితంగా ఈ చిత్రానికి ప్రీమియర్స్ నుండి మంచి గ్రాస్ వసూళ్లు వస్తాయని అభిప్రాయపడుతున్నారు. గత సంక్రాంతికి విడుదలైన ‘వీర సింహా రెడ్డి’ చిత్రానికి కేవలం ప్రీమియర్ షోస్ నుండి 8 లక్షలకు పైగా గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ‘డాకు మహారాజ్’ చిత్రానికి కూడా ఆ రేంజ్ గ్రాస్ వసూళ్లు వస్తాయో లేదో చూడాలి. అప్పటి కంటే ఇప్పటి మార్కెట్ బాగా పెరిగినందున కచ్చితంగా ‘వీరసింహా రెడ్డి’ కంటే ఎక్కువ వసూళ్లు వస్తాయని అంచనా వేస్తున్నారు.