Akhanda: నందమూరి, అల్లు కుటుంబాల మధ్య ఉన్న బంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఎన్టీ రామారావు, అల్లు రామలింగయ్య కాలం నుంచి ఇరు కుటుంబాల మధ్య సఖ్యత నెలకొంది. ఇప్పటికీ కొనసాగుతోంది. కాగా, నిన్న రాత్రి నందమూరి బాలకృష్ణ హీరోగా నటిస్తున్న అఖండ ప్రీరిలీజ్ ఈవెంట్లో ఇదే విషయాన్ని గుర్తు చేసుకున్నారు బాలయ్య. అల్లు రామలింగయ్య, అల్లు అరవింద్‌తో తనకు చనువు ఉందని… తన తండ్రి ఎన్టీఆర్ గారికి అల్లు రామలింగయ్య గారు ఓ నటుడిగా కంటే ఓ మనిషిగా చాలా ఇష్టమని బాలయ్య తెలిపారు.

మరోవైపు అఖండ సినిమా గురించి మాట్లాడుతూ.. భక్తిని ఈ సినిమా బ్రతికిస్తుందని.. ఇక ముందు కూడా వైవిధ్యభరితమైన పాత్రల్లో కనిపిస్తానని నటించడం అంటేనే.. ఓ పాత్రలో పరకాయ ప్రవేశం చేయడం లాంటిదని అన్నారు బాలయ్య. తనకు అల్లు అర్జున్, శ్రీకాంత్ తమ్ముళ్ల లాంటి వారని అన్నారు.
మరోవైపు, కరోనా సమయంలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా చాలా మంది షూటింగ్‌లు చేశారని.. వాళ్లంతా సినిమాకోసం ఇదంతా చేశారని అన్నారు బాలయ్య. కష్టకాలంలో సినిమా ఇండస్ట్రీకి రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అండగా నిలవాలని కోరారు. వచ్చే ఏడాది జనవరిలో పుష్ప, ఆర్ఆర్ఆర్, ఆచార్య సినిమాలు రిలీజ్ అవుతున్నాయని.. ఆ సినిమాలు కూడా మంచిగా ఆడేలా సహకరించాలని అభిమానులను కోరారు బాలయ్య.
దీంతో పాటు నందమూరి అభిమానుల గురించి స్పందిస్తూ.. సేవా కార్యక్రమాల విషయంలో తమ అభిమానులు ఎప్పుడూ ఇంకొకరికి ఆదర్శంగా ఉంటారని పొగిడారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కిన అఖండ.. డిసెంబరు 2న విడుదలకు సిద్ధమైంది.