Balayya: నటసింహం బాలయ్య బయటికి కోపదారిగా కనిపించినా.. ఆయన మనసు ఎంత మంచిదో ఆయనతో సన్నిహితంగా ఉన్నవారికే తెలుస్తుంది. ఎవరైనా ఆపదలో ఉన్నారంటే చాలు వారు అడగకుండానే సాయం చేసేందుకు ముందుకొస్తుంటారు. పేదలకు అండగా ఉంటూ, ఎప్పుడూ వారికి తోడుగా నిలుస్తుంటారని ఆయనను దగ్గరగా చూసిన వాళ్లు చెబుతూ ఉంటారు. ఈ క్రమంలోనే మరోసారి తన ఉదార స్వభావాన్ని చాటుకున్నారు బాలయ్య.

ప్రస్తుతం ఆహా వేదికగా అన్‌స్టాపబుల్ అనే షో బాలయ్య చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ షో ఫస్ట్ ఎపిసోడ్లో అజీజ్ అనే కుర్రాడు.. తన సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ నిమిత్తం చదువు మానేసి పనిచేస్తున్నారు. అయితే, తన అక్కను కాపాడుకోవాలనే అతని తపన బాలయ్యను కదిలించింది. దీంతో బాలయ్య తన బసవతారకం ఆసుపత్రిలో అజీజ్ సోదరికి ఉచితంగా చికిత్స అందిస్తానని ఆ కుర్రాడికి మాట ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు కూడా. ప్రస్తుతం అజీజ్ సోదరి బేగం బ్రెయిన్ క్యాన్సర్ ట్రీట్మెంట్ మొదలు పెట్టారు వైద్యులు. ఎప్పటి నుంచో బాలయ్య తన బసవతారకం చారిటబుల్ ట్రస్ట్ నుంచి పేదవారికి క్యాన్సర్ చికిత్సను ఉచితంగా అందిస్తున్నారు.
కాగా, ఇటీవల తొలి ఎపిసోడ్ పూర్తి చేసుకున్న అన్‌స్టాపబుల్ విత్ ఎన్బీకే. ఎంతో విజయవంతమైంది. తొలి ఎపిసోడ్లో మోహన్‌బాబు ఫ్యామిలీ అతిథిలుగా హాజరయ్యారు. షో ఆద్యంతం ఎంతో ఆకట్టుకుంది. మరోవైపు, బాలయ్య అఖండ సినిమాతో ఫుల్ బిజీగా ఉన్నారు. బోయపాటి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా.. త్వరలోనే షూటింగ్ పూర్తి చేసుకుని ప్రేక్షకుల ముందుకు రానుంది.