Unstoppable With NBK Season 2: ఏపీ పొలిటికల్ హిస్టరీలో వైస్రాయ్ హోటల్ ఎపిసోడ్ కి చాలా ప్రాధాన్యత ఉంది. నారా చంద్రబాబు నాయుడు ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టి వైస్రాయ్ హోటల్ లో ఉంచారు. ఎన్టీఆర్ ని మైనారిటీలోకి నెట్టి పదవీచ్యుతుడ్ని చేశారు. ఆయన నుండి టీడీపీ పార్టీని, సీఎం సీటును లాక్కున్నారు. చివరకు ఎన్టీఆర్ బ్యాంకు ఖాతాలను స్తంభింపజేసి ఆర్ధికంగా కూడా దెబ్బతీశారు. దీన్నే ఎన్టీఆర్ కి చంద్రబాబు వెన్నుపోటు పర్వం అంటారు.1995 సెప్టెంబర్ 1న ఎన్టీఆర్ ని గద్దె దించి బాబు సీఎంగా అధికారం చేపట్టాడు. దీనిపై ప్రజల్లో వ్యతిరేకత రాకుండా ముందుగానే బాబు ప్రణాళిక పన్నారు.

ఎన్టీఆర్ పై వ్యతిరేకంగా మీడియాలో తప్పుడు ప్రచారం చేయించారు. ఎన్టీఆర్ కొడుకులు, కూతుళ్లు, అల్లుళ్ళు కూడా చంద్రబాబు పక్షాన చేరారు. పదవిని, కుటుంబాన్ని కోల్పోయిన ఎన్టీఆర్ తీవ్ర మానసికవ వేదన అనుభవించారు. ఆరు నెలల వ్యవధిలో 1996 జనవరి 18న గుండెపోటుతో మరణించారు. ఎన్టీఆర్ ని సీఎం సీటు నుంచి దించేయాలన్న నిర్ణయం ఒక్క చంద్రబాబుదే కాదు. అందులో బాలయ్య ప్రమేయం కూడా ఉంది.
ఈ విషయాన్ని నారా చంద్రబాబు నాయుడు తాజాగా బయటపెట్టారు. బాలయ్య హోస్ట్ గా అన్ స్టాపబుల్ సీజన్ 2 మొదలైంది. ఫస్ట్ ఎపిసోడ్ అక్టోబర్ 14న విడుదల స్ట్రీమ్ కానుంది. ఈ ఫస్ట్ ఎపిసోడ్ గెస్ట్స్ గా చంద్రబాబు, లోకేష్ వచ్చారు. హోస్ట్ బాలయ్య మీ జీవితంలో తీసుకున్న బిగ్ డెసిషన్ ఏమిటని బాబుని అడిగారు? 1995 డెసిషన్ అని చంద్రబాబు చెప్పారు. నీకు తెలుసు కదా? అని బాబు అనగా.. అవును ఆ రోజు ఇంకా నాకు గుర్తింది అన్నారు. ఆయన(ఎన్టీఆర్) కాళ్ళు పట్టుకొని బ్రతిమాలాడాను,నా మాట వినలేదు అని బాబు అన్నారు.

అన్ స్టాపబుల్ 2 ఫస్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఈ ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎన్టీఆర్ కి వ్యతిరేకంగా ఎమ్మెల్యేలను కూడగట్టాలి, పదవి నుండి దింపాలనేది తన ఒక్కడి నిర్ణయం కాదని చంద్రబాబు ఈ వేదికగా ఒక క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశారు. ఎన్టీఆర్ కుటుంబ సభ్యులకు కూడా తెలుసని చెప్పే ప్రయత్నం చేశారు. అదే సమయంలో అది వెన్నుపోటు కాదు పార్టీ కోసం, ప్రజల సంక్షేమం కోసం తీసుకున్న నిర్ణయమని చెప్పాలనుకుంటున్నారు. మొత్తంగా దశాబ్దాలుగా తనను వెంటాడుతున్న అపవాదును బాలయ్య సమక్షంలో తొలగించుకునే ప్రయత్నం జరుగుతుందనిపిస్తుంది.