Bala krishna: బాలకృష్ణ పేరు వినగానే యువతలో తెలియని ఉత్సాహం ఉరకలేస్తుంది. ఆయన సినిమా విడుదలైందంటే చాలు థియేటర్ల ముందు పండగ వాతావరణం నెలకొంటుంది. టికెట్ల కోసం జనాలు బారులు తీరుతుంటారు. ఇక అభిమానులైతే ఆయన సినిమా రిలీజ్ రోజును ఒక ఉత్సవంగా జరుపుకుంటారు. బోయపాటి దర్శకత్వంలో నట సింహం నందమూరి బాలకృష్ణ హీరోగా రానున్న చిత్రం అఖండ. ద్వారకా క్రియేషన్ పతాకంపై మిర్యాల రవీందర్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు తమన్ స్వరాలు అందిస్తున్నారు. ప్రగ్యా జైస్వాల్ హీరోయిన్. ఇటీవలే సినిమా షూటింగ్ పూర్తి చేసుకున్న బాలయ్య.. వరుస షెడ్యూల్తో ఫుల్ బిజీ అవుతున్నారు.

ఈ క్రమంలోనే దర్శకుడు గోపీచంద్ మలినేనితో సినిమాను పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు బాలకృష్ణ. ఇది ఆయన 107వ చిత్రం కాగా.. మైత్రీ మూవీస్ సంస్థ నిర్మిస్తోంది. వాస్తవ సంఘటనల ఆధారంగా ఎంతో అద్భుతంగా ఈ కథ రూపొందనుంది.
అయితే, ఈ చిత్రానికి జై బాలయ్య అనే టైటిల్ పరిశీలిస్తున్నట్లు సమాచారం. నవంబర్లో లాంఛనంగా షూటింగ్ ప్రారభించనున్నట్లు తెలుస్తోంది. టైటిల్ను కూడా అప్పుడే అధికారికంగా ప్రకటించనున్నారట. ఇప్పటికే స్క్రిప్ట్ పనులు పూర్తయ్యాయని సినిమా బృందంలో పలు వార్తలు వస్తున్నాయి. మరి ఈ సినమాలో బాలయ్య పాత్ర ఎలా ఉండనుందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడాల్సిందే.