Body Shaming- Mallemala Programs: బాడీ షేమింగ్ ఈ రోజుల్లో దేవుళ్లకు కూడా తప్పడం లేదు. ‘నల్లనయ్య’ అనీ ‘బొజ్జ గణపయ్య’ అనీ నోరారా పిలుస్తున్నారు. ఇక మనుషుల పరిస్థితి చెప్పేది ఏముంది ?, లావూ సన్నం… తెలుపూ నలుపూ… పొడుగూ పొట్టీ అంటూ ఇలా మనుషులకు చాలా రకాల మాటలు వాడుక పదాలు అయిపోయాయి. కానీ, అతి ఏదైనా అనర్ధదాయకమే. ఇలాంటి మాటలతో సున్నిత మనస్కుల మనసు చివుక్కుమంటుంది. పుట్టకతో వచ్చిన రూపానికి ఆ వ్యక్తుల్ని బాధ్యుల్ని చేయడం బాధాకరమైన విషయం. అయితే, ఇంతకన్నా బాధాకరమైన విషయం ఏమిటంటే.. ఇలాంటి బాధింప మాటలతోనే పదిమందిని నవ్వించడానికి ప్రయత్నం చేస్తున్నారు.
సామాజిక మాధ్యమాలలో ఇప్పుడిది అడ్డూ ఆపూ లేకుండా సాగుతుంది. కానీ.. మల్లెమాల, ఈటీవీ లాంటి దిగ్గజాల ఛానల్స్ లో కూడా ఇలాంటి పైత్యం రోజురోజుకు చెలరేగిపోతూ వికృత రూపం దాల్చడం నిజంగా దురదృష్టకరం. అందంగా లేరని అవతలి వాళ్లను అవమానించి పక్కవాళ్ళను నవ్వించడమే మల్లెమాల, ఈటీవీ తమ విజయ రహస్యం అని భావిస్తున్నట్లు ఉన్నాయి.
ముఖ్యంగా జబర్దస్త్, ఎక్స్ట్రా జబర్దస్త్, జాతిరత్నాలు లాంటి షోలలో ఒక వ్యక్తి రూపాన్ని చూసి గేలి చేస్తూ కామెడీ పండించడం ఈ మధ్య తరచుగా జరుగుతుంది. ఈ షోలు అన్నీ మల్లెమాల నిర్మాణంలో, ఈటీవీ సమర్పణలోనే వస్తున్నాయి. ఇటు రామోజీ రావు లాంటి విలువలు ఉన్న వ్యక్తి ఉండి, అటు ఖచ్చితత్వంతో నిర్మాణం చేప్పట్టే నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి నిర్మాతగా ఉండి.. అమ్మాయిల పై బాడీ షేమింగ్ చేస్తూ ఇంతటి దిగజారుడు కామెడీని అందించడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది.
ఒకప్పుడు తన మీడియాలో అయినా, తన ఛానెల్ లోనైనా కఠినమైన విలువలను సైతం పాటించేవారు రామోజీరావు. తన పత్రికలో ఓ రోజు తన రిపోర్టర్ ఓ ప్రముఖ రాజకీయ నాయకుడిని కించపరిచేలా ఏక వచనం వాడినందుకే రామోజీ రావు గారు ఎంతగానో బాధ పడ్డారట. అలాంటి రామోజీ రావు.. ప్రస్తుతం తన ఈటీవీలో వస్తున్న నాసిరకపు బూతు కామెడీ షోలను ఎందుకు పట్టించుకోవడం లేదు..?, పెరిగిన పోటీ ప్రపంచంలో ఈటీవి వారికి టీఆర్పీ రేటింగే ముఖ్యమైపోయిందా ?
జబర్దస్త్, జాతిరత్నాలు లాంటి షోలలో ఎక్కువగా ఒక అమ్మాయి ఎత్తు, లావు, కనుముక్కు తీరు… ఇలా ఆ అమ్మాయి సమస్త రూపాన్ని ఉద్దేశించే జోకులు వదులుతున్నారు. ప్రతి స్కిట్ లో బాడీ షేమింగ్ అనేది సర్వసాధారణం అయిపోయింది. ఈ షోలలో నటించే అమ్మాయిలందరూ బాడీ షేమింగ్ ఎదుర్కొన్న వాళ్లే. ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నారు.
ఉదాహరణకు జబర్దస్త్ కమెడియన్ హైపర్ ఆది స్కిట్స్ అన్నీ ఇలాగే సాగుతాయి. ఆ మధ్య తెలంగాణ గౌరమ్మ, బతుకమ్మ ను కూడా కించపరుస్తూ జోకులు వేశాడు ఈ కమెడియన్. నిజానికి ఈ షోలలో బాడీ షేమింగ్ జోకులు హైపర్ ఆది నుంచే మొదలైంది. అతని స్కిట్స్ అన్నీ బాడీ షేమింగ్ పైనే సాగుతాయి. అంతకు ముందు రైజింగ్ రాజు బాడీ పై జోకులు వేసి నవ్వించిన ఆది, ఈ మధ్య పటాస్ తో పాపులర్ అయిన ‘ఫైమా’ అనే అమ్మాయి మీద బాడీ షేమింగ్ డైలాగ్ లు వేస్తూ మితిమీరిపోయాడు. ‘నీ బాడీలో ఒక్కటైనా సరిగ్గా ఉందా.. అన్నీ ఎవరో లోపలికి తోసేసినట్లున్నావ్’ అంటూ ఆది చెప్పిన డైలాగ్ పై పెద్ద రాద్దాంతమే జరిగింది.
అయినా, ఈ బాడీ షేమింగ్ జోకులు అడగడం లేదు. నిత్యం పెరుగుతూనే ఉన్నాయి. నిన్న రిలీజ్ అయిన ఎక్స్ట్రా జబర్దస్త్ ప్రోమోస్ లో కూడా బుల్లెట్ భాస్కర్ ‘వర్ష’ను ఉద్దేశించి.. ‘దీన్ని అమ్మాయి అంటే ఎవ్వరూ నమ్మడం లేదు’ అని పంచ్ వేశాడు. పైగా శాంతి స్వరూప్ తో పోల్చాడు. ఇలాంటివి చాలా ఉన్నాయి. రష్మీ… ముసలిది అని, రోహిణి… దున్నపోతు, నలుగురు సైజ్ ఉంటుంది అని, ఇక విష్ణుప్రియ…ముక్కు పై అయితే ఎన్నో బూతులు, అదే విధంగా మిగిలిన వాళ్ళు మేకప్ లేకపోతే చూడలేము అంటూ ఇలా చాలా బాడీ షేమింగ్ డైలాగ్ లు నిత్యం వినిపిస్తూనే ఉన్నాయి. ఇలా ఇప్పటికైనా బాడీ షేమింగ్ పై జోకులు పరిధి దాటకుండా ఈటీవీ యాజమాన్యం చర్యలు తీసుకుంటే ఛానెల్ కి ఉన్న గౌరవం నిలబడుతుంది.
Also Read:Ramarao On Duty: రవితేజ ‘రామారావు ఆన్ డ్యూటీ’ సినిమా హిట్ అవ్వాలంటే ఎంత వసూలు చెయ్యాలో తెలుసా?