Asha Bhosle Cooking Talent: ఆశా భోంస్లే .. పాడితే లోకం మొత్తం ఊగింది. ఆమె గాత్రానికి యావత్ భారతదేశం ఫిదా అయిపోయింది. సంవత్సరాలుగా పాడింది.. 14 భాషలలో తన గాత్రాన్ని కోట్లాదిమంది అభిమానులకు అందించింది. అందువల్లే ఆమె భారతీయ సుప్రసిద్ధ గాయని అయింది. ఆశా భోంస్లే పాడిన దమ్ మారో దమ్ పాట ఇప్పటికి టీవీలలో వస్తే అలానే చూస్తూ ఉండిపోతారు అభిమానులు. ఎందుకంటే ఆమె గాత్రం అంత గొప్పగా ఉంటుంది.
బాధలో ఉన్నప్పుడు విరహాన్ని.. ప్రేమలో ఉన్నప్పుడు మాధుర్యాన్ని.. బంధం లో ఉన్నప్పుడు గాడతను ప్రదర్శించాలంటారు. ఇవన్నీ కూడా తన గొంతుతో పలికించారు ఆశా భోంస్లే .. అందుకే 14 భాషల్లో వేలాది పాటలు పాడారు.. తన గాత్ర మాధుర్యంతో కోట్లాదిమంది అభిమానులను సంపాదించుకున్నారు .
ఆశా భోంస్లే .. స్వరంలో సరస్వతి.. చేతితో గరిట పడితే నల భీమురాలు. అద్భుతమైన వంటలు చేసే ఆమెకు.. బాలీవుడ్ లో సుప్రసిద్ధ నటులు.. ఇతర సెలబ్రిటీలు ఫ్యాన్స్ అంటే అతిశయోక్తి కాదు. ముఖ్యంగా ఆశ చేసే షమీ అబాబ్, కడాయి గోస్ట్, కాలీదాల్, పనీర్ తాడ్క, గోబీ మంచూరియా అంటే బాలీవుడ్ సుప్రసిద్ధ నటుడు రిషి కపూర్ కు చాలా ఇష్టం. బాలీవుడ్ లో ఉన్న ప్రముఖులు మొత్తం ఆశ చేతివంట రుచి చూసిన వారే. ఒకవేళ సింగర్ కాకపోయి ఉంటే తాను కచ్చితంగా కుక్ అయ్యేదానినని ఆమె అనేక సందర్భాల్లో చెప్పారు. దుబాయ్ ప్రాంతంలో Ashajs అనే రెస్టారెంట్ కూడా ఏర్పాటు చేశారు. బహ్రెయిన్, కువైట్, దోహా, అబుదాబి ప్రాంతాలలో ఆమె రెస్టారెంట్లు ఏర్పాటు చేశారు. వాఫీ అనే గ్రూప్ వీటిని నిర్వహిస్తోంది. ఈ రెస్టారెంట్లలో ఆశకు వాటా ఉంది. ఇక్కడ పనిచేసే వంట వాళ్లకు ఆశ అనేక సందర్భాలలో శిక్షణ ఇచ్చారు. 90 సంవత్సరాలు నిండినప్పటికీ.. ఆశ తాను స్వయంగా వండిన వంటలను మనవళ్లకు, మనవరాళ్లకు వడ్డించేవారు.
“జీవితం ఒకే విధంగా ఉండకూడదు. ఒకే విధంగా ఉంటే మూస వచ్చేస్తుంది. కొంత మార్పును కోరుకోవాలి. మనం కూడా మారి చూపించాలి. మనకు ఇష్టమైన రంగాలలో ప్రతిభ చూపించాలి. అప్పుడే మనకు మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఇష్టం లేని వాటిని వదిలేయాలి. మనసుకి నచ్చిన వాటిని మరింత అందిపుచ్చుకోవాలి. అప్పుడే ఇంకా కొత్తగా కనిపిస్తుంటాం. మనకు మనం కొత్తగా కనిపిస్తుంటే కచ్చితంగా జీవితంలో ఏదో సాధించామని సంతృప్తి కచ్చితంగా కలుగుతుందని” ఆశ ఓ ఇంటర్వ్యూలో అన్నారు.