Arvind Swamy Net Worth : 90లలో అరవింద స్వామి ఒక సెన్సేషన్. తెల్లని ఛాయ, చక్కని రూపం, పక్కింటి కుర్రాడిలా అనిపించే ముఖం. ముఖ్యంగా అమ్మాయిల కలల రాకుమారుడిగా వెలిగిపోయాడు. మణిరత్నం మూవీలో నటించడం గొప్ప అవకాశంగా భావించే రోజుల్లో అరవింద స్వామి ఆయన డైరెక్షన్ లో వెండితెరకు పరిచయమయ్యాడు. 1991లో విడుదలైన బ్లాక్ బస్టర్ మూవీ దళపతి చిత్రంలో రజనీకాంత్, మమ్ముట్టి లీడ్ రోల్స్ చేయగా, అరవింద స్వామి కీలక పాత్రలో మెప్పించారు.
తన టాలెంట్ తో మణిరత్నంని విపరీతంగా ఆకర్షించిన అరవింద స్వామి రోజా, బొంబాయి వంటి ఆల్ టైం క్లాసిక్స్ లో నటించే అవకాశం దక్కించుకున్నాడు. ఈ పాన్ ఇండియా హిట్స్ అరవింద స్వామి ఇమేజ్ దేశవ్యాప్తం చేశాయి. సౌత్ టు నార్త్ అరవింద స్వామి బిజీ హీరో అయ్యారు. కమల్, రజినీ తర్వాత తమిళ పరిశ్రమను శాసించే హీరో అవుతాడని ఇండస్ట్రీ పెద్దలు అంచనా వేశారు. అయితే అలా జరగలేదు. అరవింద స్వామి లీడ్ హీరోగా చేసిన చిత్రాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టాయి.
బాలీవుడ్ బడా దర్శకులు కూడా ఆయనకు హిట్ ఇవ్వలేకపోయారు. మాస్ హీరోలకు ఉండే అప్పీరెన్స్ అరవింద స్వామికి లేదు. ఆయన కేవలం ఒక తరహా కథలకే సరిపోతారని ప్రేక్షకులు ఫిక్స్ అయ్యారు. బ్యాక్ టు బ్యాక్ ప్లాప్స్ తో డీలా పడ్డ అరవింద స్వామి ఆలోచన మారింది. సినిమాలను పూర్తిగా పక్కన పెట్టి తన తండ్రి బిజినెస్ లను అభివృద్ధి చేసే పనిలో పడ్డాడు. వి డి స్వామి అండ్ కంపెనీ బిజినెస్ లపై దృష్టి పెట్టాడు. అలాగే ఇంటర్ ప్రో గ్లోబల్ పేరుతో మరొక కంపెనీ స్టార్ట్ చేశాడు.
బిజినెస్ మెన్ గా సక్సెస్ ట్రాక్ లో దూసుకెళుతున్న అరవింద స్వామికి అనుకోని సంఘటన ఎదురైంది. 2005లో ఆయన ఓ మేజర్ ఆక్సిడెంట్ కి గురయ్యారు. దాని కారణం పాక్షిక పక్షవాతం వచ్చింది. ఈ సమస్యను అధిగమించేందుకు అరవింద స్వామికి నాలుగైదేళ్ళ సమయం పట్టింది. ట్రీట్మెంట్ తీసుకుంటూ కూడా వ్యాపారాలను విస్మరించలేదు. 2005లోనే టాలెంట్ మాగ్జిమస్ పేరుతో మరొక బిజినెస్ స్టార్ట్ చేశారు. పే రోల్ ప్రాసెసింగ్, టెంపరరీ స్టాఫింగ్ సేవలు అందించే ఈ సంస్థ ఆదాయం రూ. 3300 కోట్లు.
మనకు చాలా సింపుల్ గా కనిపించే అరవింద స్వామి వేల కోట్లకు అధిపతి. తన గురువు మణిరత్నం సలహాతో అరవింద స్వామి 2013లో కమ్ బ్యాక్ ఇచ్చారు. కడలి మూవీలో పాస్టర్ రోల్ చేశారు. తని ఒరువన్ మూవీలో అరవింద స్వామి చేసిన పాత్ర ప్రశంసలు దక్కించుకుంది. తెలుగులో ఆ మూవీ ధ్రువగా రీమేక్ అయ్యింది. ఇటీవల నాగ చైతన్య హీరో విడుదలైన కస్టడీ మూవీలో అరవింద స్వామి కీలక రోల్ చేశారు. అటు సక్సెస్ఫుల్ బిజినెస్ మాన్ గా రాణిస్తూ, నటుడిగా తన ప్యాషన్ నెరవేర్చుకుంటున్నాడు.