Pawan Kalyan: జనసేనానిని పవన్ కళ్యాణ్ కీలక నిర్ణయాలు దిశగా అడుగులు వేయనున్నట్టు తెలుస్తోంది. పార్టీ బలోపేతంపై ఫోకస్ పెట్టిన ఆయన అక్టోబరు 5 నుంచి చేపట్టనున్న బస్సు యాత్రను సైతం వాయిదా వేసుకున్నారు. అయితే పార్టీ ప్రణాళిక లోపంపై మాత్రం తరచూ విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నియోజకవర్గ ఇన్ చార్జుల నియామకం, సమన్వయ కర్తలకు బాధ్యతలు, పార్టీ అనుబంధ కార్యవర్గాల ఏర్పాటు వంటివి లేకపోవడం ఆ పార్టీకి మైనస్ గా మారిందని రాజకీయ విశ్లేషకులు సైతం చెబుతుంటారు. అయితే వీటిన్నింటికీ చెక్ చెప్పాలని పవన్ భావిస్తున్నారు. ఈ నెల మూడు, నాలుగు వారాల్లో మంగళగిరి రానున్న పవన్ కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో ప్రస్తుతం 70 నియోజకవర్గాల్లో పార్టీ బలోపేతంగా ఉందని గుర్తించారు. అక్కడ పార్టీ బాధ్యుల నియామకంతో పాటు అనుబంధ విభాగాల కార్యవర్గాలను నియమించనున్నారు. ఆ నియోజకవర్గాల్లో పార్టీని లీడ్ చేసేదెవరు? నాయకులు, కార్యకర్తలు ఎవరితో కలిసి పనిచేయాలి? అన్నదానిపై క్లారిటీ ఇవ్వనున్నట్టు తెలుస్తోంది. అలాగే బస్సు యాత్ర ఎప్పటి నుంచి ప్రారంభించాలి? దానికి సంబంధించిన రూట్ మ్యాప్ ఏమిటి? అన్నది కూడా తేల్చనున్నట్టు సమాచారం.

ఏపీలో జనసేన గ్రాఫ్ పెరిగిందని సర్వేనివేదికలు తేటతెల్లం చేయడంతో పవన్ బస్సు యాత్రను పక్కనపెట్టి మరీ నియోజకవర్గాల రివ్యూను మొదలు పెట్టారు. విజయవాడ వెస్ట్ నుంచి రివ్యూ మొదలు పెట్టి చాలా నియోజకవర్గాల సమీక్షలను పూర్తిచేశారు. పార్టీ బలంతో పాటు మెగా ఫ్యాన్స్ బలమున్న నియోజకవర్గాల జాబితాను తీసుకున్నారు. అక్కడ ముందుగా సమావేశాలు నిర్వహించి శ్రేణులకు దిశా నిర్దేశం చేయనున్నారు. ఇటీవల పార్టీ లీగల్ సెల్ సమావేశం సైతం నిర్వహించారు. అధికార పార్టీ దాడులను ఎదుర్కొంటున్న జన సైనికులకు అండగా ఉంటానని కూడా పవన్ హామీ ఇచ్చారు. వైసీపీ ఆగడాలను ఎలా ఎదుర్కొవాలో దిశ నిర్దేశం చేశారు. అటు జనవాణి కార్యక్రమాన్ని రాష్ట్రంలో మూడు ప్రాంతాల్లో నిర్వహించి ప్రజా సమస్యలపై వినతులు స్వీకరించారు. విశాఖలో నిర్వహించనున్న జనవాణి కార్యక్రమానికి ఈ నెల 15న హాజరుకానున్నారు.

నియోజకవర్గాల్లో జనసేన ఇన్ చార్జిల నియామకం కొలిక్కి వచ్చిన తరువాతే పవన్ బస్సు యాత్ర ప్రారంభమయ్యే అవకాశ ముంది. పార్టీ బలోపేతంగా ఉన్న నియోజకవర్గాలను కలుపుతూ బస్సు యాత్ర రూట్ మ్యాప్ కొనసాగనుంది. తన తమ్ముడికి నా సపోర్టు ఉంటుందన్న చిరంజీవి ప్రకటన తరువాత చిరు అభిమాన సంఘాలు కూడా జనసేనలో యాక్టివ్ అవుతున్నాయి. అటు చిరు ఫ్యాన్స్ ను కలుపుకొని కార్యక్రమాలు నిర్వహించాలని పవన్ నిర్దేశించినట్టు సమాచారం. ఈ నెల చివరి నాటికి అన్నింటిపైనా క్లారిటీ వచ్చే అవకాశాలైతే కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలా మంది నాయకులు జనసేనలో చేరేందుకు సిద్ధపడుతున్నారు. వారందర్నీ బస్సు యాత్రలో పార్టీలో చేర్చుకొని ఒక ఊపు తేవాలని పవన్ భావిస్తున్నారు. మొత్తానికైతే పవన్ ఎన్నడూలేనంతగా బిజీ షెడ్యూల్ లో గడపనున్నారు. అటు పార్టీ సమీక్షలు, మరోవైపు పెండింగ్ సినిమాలు పూర్తిచేయాలని భావిస్తున్నారు.
[…] […]