Ranbir Kapoor Alia Bhatt: బాలీవుడ్ బ్యూటీ ‘అలియా భట్’ గత కొన్ని సంవత్సరాలుగా బాలీవుడ్ హీరో రణబీర్ కపూర్ తో పీకల్లోతు ప్రేమలో మునిగి తేలుతుంది. వీరి ప్రేమ పై పుకార్లు రాసి రాసి గాసిప్ రాయుళ్లు కూడా అలిసిపోయారు గానీ, వీళ్ళు మాత్రం తమ ప్రేమను మరో మెట్టు ఎక్కించలేదు, పోనీ అటు తొక్కించనూ లేదు. గత మూడేళ్లు నుంచి వీరి పెళ్లి గురించి వార్తలు వస్తూనే ఉన్నాయి.

ప్రేక్షకులు కూడా ఆ వార్తలు చదివి చదివి నీరసించి పోయారు. చాలాకాలంగా ఇవే వార్తలు రాస్తున్నారు అంటూ నెటిజన్లు కూడా కామెంట్లతో విరుచుకుపడ్డారు. అయితే, ఈ మధ్య ఈ జంట తమ పెళ్లి గురించి ఆలోచిస్తోంది. అందుకే.. వీరి పెళ్లికి సంబంధించిన వార్తల పై ప్రేక్షకుల్లో మళ్ళీ ఆసక్తి మొదలైంది. ముఖ్యంగా “మా నాన్న గారు జీవించే ఉండి ఉంటే.. మేం ఈపాటికే పెళ్లి చేసుకుని ఒక్కటి అయ్యేవాళ్లం’ అని రణబీర్ కపూర్ రీసెంట్ గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఎమోషనల్ అవుతూ చెప్పుకొచ్చాడు.
ఇక అప్పటి నుంచి వీరి పెళ్లికి సమయం దగ్గర పడిందనే వార్త బాగా వైరల్ అయింది. అయితే తాజాగా ఈ ప్రేమ జంట జోధాపూర్ కి వెళ్ళింది. ఈ రోజు రణబీర్ కపూర్ పుట్టిన రోజు. కాబట్టి.. తన ప్రేయసితో తన బర్త్ డే సెలెబ్రేషన్స్ చేసుకోవడానికి రణబీర్ కపూర్ అక్కడికి వెళ్లాడు. మరి పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట తమ పెళ్లి వేదికను కూడా ఫిక్స్ చేసుకుంటారేమో చూడాలి.
ఈ రోజుతోటి రణబీర్ 39లోకి అడుగుపెడుతున్నాడు. అలియాకి కూడా ప్రస్తుతం 30 ఏళ్ళు. అందుకే, రణబీర్ తల్లి ‘నీతూ కపూర్’ ఎట్టిపరిస్థితుల్లో ఈ ఏడాది వీరిద్దరికి పెళ్లి చేయాలని ప్రస్తుతం ముహుర్తాలు చూస్తున్నారట. కావున ఈ సంవత్సరం క్యాలెండర్ ముగిసేలోపే వీరి పెళ్లి కబురు రానుంది. అలియా ప్రస్తుతం ‘ఆర్ఆర్ఆర్’ సినిమాలో నటిస్తోంది.