AP Liquor Scam Case Updates: ఏపీ మద్యం కుంభకోణంలో( liquor scam ) కీలక ట్విస్ట్. ఈ కేసులో అరెస్ట్ అయిన వైసీపీ ఎంపీ పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి విడుదలయ్యారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో భారీ మద్యం కుంభకోణం జరిగిందన్నది ప్రధాన ఆరోపణ. ప్రభుత్వ మద్యం పాలసీని మార్చి అడ్డగోలుగా దోపిడీ చేశారని కూటమి ప్రభుత్వం ఆరోపిస్తోంది. విచారణకు ప్రత్యేక దర్యాప్తు ప్రాంతాన్ని నియమించింది. సిట్ దాదాపు 29 మంది పై కేసులు నమోదు చేసింది. ఓ 12 మందిని అరెస్టు చేసింది. అందులో ఓ నలుగురు బెయిల్ పై విడుదలయ్యారు. మిగతావారు సైతం డిఫాల్ట్ బెయిల్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ క్రమంలోనే పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి విడుదల కావడం విశేషం. అయితే ఆయన పూర్తిగా విడుదల కాలేదు. ఆయన కస్టడీ మారినట్లు తెలుస్తోంది.
కీలక సూత్రధారి..
మద్యం కుంభకోణం కేసులో రాజ్ కసిరెడ్డి( Raj kasareddy) కీలక సూత్రధారి. అయితే మొత్తం వ్యవహారాన్ని నడిపించింది మాత్రం పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అన్న ఆరోపణలు ఉన్నాయి. మద్యం సరఫరా చేసే డిస్టర్లరీలను స్వాధీనం చేసుకుని.. మద్యం తయారీ చేసే పరిశ్రమలనుంచి భారీగా కమీషన్లు, ముడుపులు దండుకున్నారన్న అభియోగాలు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి పై ఉన్నాయి. ప్రతినెల ఐదు కోట్ల రూపాయల వరకు మద్యం ముడుపులు పెద్దిరెడ్డి మిధున్ రెడ్డికి అందాయి అన్న అభియోగాలు ఉన్నాయి. దాదాపు రెండు నెలల కిందట మిధున్ రెడ్డి అరెస్ట్ జరిగింది. రాజమండ్రి సెంట్రల్ జైల్లో ఉండగా ఆయనకు ఇంటి భోజనం అందుతోంది. మొన్న ఆ మధ్యన ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటు వేసేందుకు, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎంపీలను సమన్వయం చేసేందుకు మధ్యంతర బెయిల్ కావాలని కోరడంతో కోర్టు మంజూరు చేసింది. ఆ గడువు ముగియడంతో ఆయన స్వచ్ఛందంగా వచ్చి రాజమండ్రి సెంట్రల్ జైల్లో లొంగిపోయారు.
కోర్టు అనుమతితో..
అయితే ప్రస్తుతం ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ లోతుగా సాగుతోంది. ఈ క్రమంలో ఎంపీ మిధున్ రెడ్డిని( MP Mithun Reddy) మరోసారి విచారించాలని కోరుతూ సిట్ ఎసిబి కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై పలుమార్లు విచారణ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో తాజాగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని రెండు రోజులపాటు సిట్ కస్టడీకి అప్పగిస్తూ కోర్టు ఉత్తర్వులు జారీచేసింది. అయితే పోలీసులకు కొన్ని రకాల షరతులు విధించింది.
* ఉదయం 8 నుంచి సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే విచారించాలి
* విచారణ సమయంలో కొట్టడం తిట్టడం వంటివి చేయకూడదు
* మానసిక వేధింపులకు గురి చేయకూడదు.
* విచారణ సమయంలో విరామం కూడా ఇవ్వాలని సూచించింది.
* రెండు పూటలా ఆయన కోరుకున్న ఆహారం ఇవ్వాలని సూచించింది.
* విచారణ సమయంలో మిథున్ రెడ్డి న్యాయవాదిని కూడా అనుమతించాలని ఆదేశించింది.
* విచారణ మొత్తాన్ని ఆడియో, వీడియో రికార్డులు వేయాలని కూడా తెలిపింది.
* ఈ కేసు విచారణలో సంబంధం లేని వ్యక్తులు జోక్యం చేసుకోకూడదు అని కూడా సూచించింది.
* సిట్ నియమించిన అధికారులను మాత్రమే విచారణకు అనుమతించింది.
విచారణలో తేల్చే అంశాలు..
ప్రధానంగా పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అరెస్ట్ వెనుక చాలా అంశాలు ఉన్నట్లు తెలుస్తోంది. మద్యం డిష్టలరీల నుంచి పెద్దిరెడ్డి ముడుపులు వసూలు చేశారన్నది ప్రధాన ఆరోపణ. అలా ఎవరు చేయాలని చెప్పారు అన్నది ఇప్పుడు తాజాగా విచారించనున్నట్లు తెలుస్తోంది. డిష్టలరీలకు ప్రతినెల ఎంత టార్గెట్ విధించారు? దుబాయ్ తదితర దేశాల్లో ఎందుకు సిట్టింగులు వేశారు? ఇతర నిందితులతో ఉన్న సంబంధాలు ఏంటి? గత ఎన్నికల్లో ఓటర్లకు ఈ నిధులు పంపిణీ చేశారా? అసలు ఈ కేసులో అంతిమ లబ్ధిదారుడు ఎవరు? అనే దానిపై పెద్దిరెడ్డి మిధున్ రెడ్డిని విచారిస్తారని తెలుస్తోంది.