AP Govt : సినిమా పరిశ్రమకు అనుకూలమైన ప్రభుత్వాలు ఏర్పడ్డాయి. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం, ఏపీలో కూటమి ప్రభుత్వం ఉండడంతో సినీ ఇండస్ట్రీకి అంతా మంచి జరుగుతుందని ఆశిస్తున్నారు. ఏపీలో కూటమి ప్రభుత్వం కొలువు దీరిన తర్వాత కల్కి సినిమా టికెట్ ధరల పెంపు, అదనపు షోల ప్రదర్శనకు వెసులుబాటు కలిగింది. దీంతో సినీ పరిశ్రమ సైతం కొంత ఊరట పొందింది. ఈ తరుణంలో చిత్ర పరిశ్రమపై రెండు ప్రభుత్వాలు దృష్టి పెడతాయన్న సానుకూల వాతావరణం ఏర్పడింది. పైగా ఏపీ ప్రభుత్వంలో జనసేన కీలక భాగస్వామ్యం కావడంతో సమస్యలకు పరిష్కార మార్గం దొరుకుతుందని సినీ పెద్దలు ఆశిస్తున్నారు.
పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా ఉన్నారు. ఆ పార్టీకి చెందిన కందుల దుర్గేష్ సినిమాటోగ్రఫీ మంత్రిగా పదవి బాధ్యతలు చేపడుతున్నారు. ఇటీవలే సినీ పరిశ్రమ పెద్దలు పవన్ కళ్యాణ్ ను కలిశారు. సినిమాటోగ్రఫీ కందుల దుర్గేష్ తో చర్చలు జరిపారు. త్వరలో సీఎం చంద్రబాబును కలిసి సమస్యలను విన్నవించనున్నారు. దీనిపై ఏపీ ప్రభుత్వం నుంచి సానుకూల నిర్ణయాలు వస్తాయని ఆశిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఏపీ ప్రభుత్వానికి సంబంధించి.. ఏపీ ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ పదవికి డిమాండ్ ఏర్పడింది. టిడిపికి చెందిన సినీ ప్రముఖులతో పాటు మెగా కుటుంబానికి దగ్గరగా ఉన్నవారు సైతం తమ ప్రయత్నాల్లో ఉన్నట్లు తెలుస్తోంది.
వైసిపి హయాంలో ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ గా పోసాని కృష్ణ మురళి ఉండేవారు. ఆయన సినీ పరిశ్రమ సమస్యల కంటే.. రాజకీయాలపైనే ఎక్కువ దృష్టి పెట్టారు అన్న విమర్శ ఉంది. అందుకే ఈసారి సినీ పరిశ్రమ పై పూర్తి అవగాహన ఉన్నవారే అధ్యక్ష పదవి చేపట్టాలన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ప్రధానంగా సూపర్ స్టార్ కృష్ణ సోదరుడు ఘట్టమనేని ఆదిశేషగిరిరావు పేరు వినిపిస్తోంది. ఈయన గతంలో ఈ పదవి చేపట్టారు. చంద్రబాబుకు అత్యంత సన్నిహితుడు కూడా. గత ఎన్నికలకు ముందు టిడిపిలో చేరారు. ఎటువంటి పదవి చేపట్టలేదు. అందుకే తనకు ఆ పదవి కేటాయించాలని చంద్రబాబును కోరినట్లు సమాచారం. దీనిపై టిడిపి అధినేత సైతం సానుకూలంగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది.
మరోవైపు మెగా కుటుంబానికి అత్యంత సన్నిహితుడు, మెగా ప్రొడ్యూసర్ గా పేరు పొందిన కేఎస్ రామారావు సైతం పదవి ఆశిస్తున్నట్లు సమాచారం. ఈయన చిరంజీవితో సూపర్ హిట్ చిత్రాలు నిర్మించారు. ఇటీవలే రామారావు సీఎం చంద్రబాబును కలిసి మాట్లాడినట్లు సమాచారం. అటు మెగా బ్రదర్ నాగబాబును కలిసి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. ఈ విషయంపై నాగబాబు సైతం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో మాట్లాడినట్లు ప్రచారం జరుగుతోంది. ఆయన కూడా సానుకూలత వ్యక్తం చేశారని తెలుస్తోంది. అయితే చంద్రబాబు ఈ ఇద్దరిలో ఎవరికి పదవి కేటాయిస్తారో చూడాలి.