సూపర్ స్టార్ మహేష్ బాబుతో మైత్రీ మూవీ మేకర్స్ ‘శ్రీమంతుడు’ మూవీని నిర్మించి బ్లాక్ బస్టర్ అందుకుంది. టాలీవుడ్లోకి మైత్రీ నిర్మాణ సంస్థ ‘శ్రీమంతుడు’తోనే ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత అనేక బ్లాక్ బస్టర్ హిట్స్ ఖాతాలో వేసుకున్న మైత్రీ మూవీస్ తాజాగా మహేష్ బాబుతో ‘సర్కారువారిపాట’ను తెరకెక్కించేందుకు సిద్ధమైంది.
సూపర్ స్టార్ కృష్ణ జన్మదినం సందర్భంగా ‘సర్కారువారిపాట’ సినిమా ప్రారంభమైంది. అదేరోజుకు సినిమాకు సంబంధించి ఫస్టు లుక్ రిలీజ్ చేసి ఘట్టమనేని అభిమానుల్లో జోష్ నింపింది. దర్శకుడు పర్శురాం ‘సర్కారువారిపాట’ సినిమాను తెరకెక్కుస్తుండగా థమన్ మ్యూజిక్ అందిస్తున్నాడు.
‘సర్కారువారిపాట’ కోసం మహేష్ తాజాగా 45రోజుల డేట్స్ ఇచ్చాడు. ఈ మూవీ తొలి షెడ్యూల్ అమెరికాలో తెరకెక్కించేందుకు చిత్రయూనిట్ సన్నహాలు చేసింది. అయితే ప్రస్తుత పరిస్థితుల్లో అమెరికాలో షూటింగ్ చేయడం అంతా సేఫ్ కాదని తేలడంతో ఈ మూవీ షూటింగ్ ఆలస్యం అయ్యేలా కన్పిస్తోంది.
ఈమేరకు ఇప్పటికే నటీనటులు ఇచ్చిన డేట్స్ అన్ని చిత్రయూనిట్ క్యాన్సిల్ చేసినట్లు తెలుస్తోంది. నవంబర్లో ప్రారంభం కావాల్సిన ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభించనుందట. మరోవైపు మహేష్ బాబు దర్శకుడు త్రివిక్రమ్ తో మూవీ చేయనున్నట్లు ప్రకటించాడు. దీంతో మైత్రీ మూవీస్ లో టెన్షన్ మొదలైంది.
ఇటీవలే మహేష్-త్రివిక్రమ్ కాంబోలో వచ్చిన ‘ఖలేజా’ చిత్రం పదేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా నాటి జ్ఞాపకాలను మహేష్ గుర్తుచేసుకున్నాడు. త్రివిక్రమ్ తో మరోసారి కలిసి పని చేసేందుకు సిద్ధమని ప్రకటించాడు. ఆర్ఆర్ఆర్ కారణంగా జూనియర్ ఎన్టీఆర్ తో మూవీ ఆలస్యం అవుతుండటంతో గురూజీ మహేష్ తో సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నాడు.
ఈనేపథ్యంలోనే ‘సర్కారువారిపాట’ సినిమా ఆలస్యం అవుతుండటంతో మహేష్ ఎక్కడ చేజారిపోతాడననే మైత్రి మూవీస్ ఆందోళన చెందుతోంది. దీంతో తొలుత ‘సర్కారువారిపాట’ సైట్స్ పైకి వెళుతుందా? లేక గురూజీ మూవీ వెళుతుందా? అనేది ఆసక్తికరంగా మారింది.