Anushka Shetty Birthday: సౌత్ ఇండస్ట్రీ ముద్దుగుమ్మ అనుష్క శెట్టి గురించి తెలియదంటే ఎవరూ నమ్మరు. ఆమె నటించిన ‘అరుంధతి’ నుంచి ‘బాహుబలి’ వరకు తన నటనతో అశేష అభిమానులను సంపాదించుకుంది. ‘సూపర్’సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తరువాత డిఫరెంట్ సినిమాల్లో నటించి స్టార్ నటిగా పేరు తెచ్చుకుంది. అయితే బాహుబలి సినిమా తరువాత అనుష్క చేసిన సినిమాలు తక్కువే. 1981 నవంబర్ 7న అనుష్క బర్త్ డే. ఆమె పుట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు తన జీవితంలో ఎన్నో విశేషాలు చోటు చేసుకున్నాయి. తన పుట్టిన రోజు సందర్భంగా కొన్ని పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంది.

సినిమాల్లోకి రాకముందు అనుష్క యోగా టీచర్. అయితే చాలా మంది యోగా టీచర్ అంటే పెద్ద పెద్ద వాళ్లకు ట్రైనర్ అని అనుకుంటారు. కానీ నేను మూడో తరగతి విద్యార్థులకు మాత్రమే యోగా నేర్పించే దాన్ని.. అని అనుష్క నవ్వుతూ చెప్పారు. ఇక తన కెరీర్ గురించి ఎప్పుడూ ప్లాన్ వేసుకోలేదని, ఏదీ చేయాలనిపిస్తే అదే చేసేదాన్ని అని అన్నారు. సినిమాల్లోకి వస్తానని అస్సలు అనుకోలేదని, కెమెరా ముందుకు రాగానే ఎలా నటించాలో కూడా తెలియదని అన్నారు. కానీ కొంచెం కష్టపడితే నటిగా రాణించడం పెద్ద విషయమేమీ కాదని అనుష్క అన్నారు.
ఇక కొందరు యువకులు, యువతులు ‘అనుష్క’ ఉండాలని అనుకుంటారు. కానీ నాలా ఉండాలని ఎవరూ కోరుకోవద్దు. ఎందుకంటే ఎవరి ప్రతిభ వారిది.. ఎవరు ఎవరిలా ఉండాలని అనుకరించకూడదు. ప్రయత్నిస్తే అనుకున్నది ఎవరైనా సాధిస్తారు. మీ జీవితం ఇంకోకరి మీద ఆధారపడకుండా చూసుకోవడం మంచిది.. అని అనుష్క పలువురికి సూచించారు. జీవితం చాలా అందమైనది దానిని అందంగా అనుభవించాలని కోరుకోవాలి తప్ప ముళ్ల కంప బాటలో వెళ్లాలని అస్సలు అనుకోవద్దు అని అన్నారు.

తన కెరీర్లో ది బెస్ట్ మూవీ అరుంధతి అని చెప్పింది అనుష్క. ఈ సినిమా సమయంలో ఒక హీరోయిన్ కోసం అంత బడ్జెట్ పెట్టడం అవసరమా..? అని చాలా మంది అన్నారు. అంతేకాకుండా ఈ సినిమా తీయకుండా అడ్డుకునే ప్రయత్నం చేశారు. కానీ నిర్మాత మాత్రం నామీద నమ్మకంతో ముందుకు వచ్చారు. ఆ తరువాత తనతో పాటు సినిమాలోని చాలా మందికి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఈ సినిమాలో జేజమ్మలా కనిపించిన తరువాత వెంటనే ‘బిల్లా’ చేయాల్సి వచ్చింది. ఇందులో బికినీ వేసుకోవడం కొంచెం ఇబ్బందిగా అనిపించింది.. అని అనుష్క తన గురించి చెప్పారు.