Dileep Shankar : గత కొన్ని రోజులుగా సినీ ఇండస్ట్రీని వరుస విషాదాలు వెంటాడుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు చాలా మంది ప్రముఖ, దిగ్గజ నటులు, నిర్మాతలు, దర్శకులు వరుసగా మరణించారు. దీంతో ఇండస్ట్రీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఇక ఈ వార్తలను మరిచిపోకముందే మరో వార్త ఇప్పుడు ఇండస్ట్రీని బాధ పెడుతుంది. తాజాగా చిత్ర పరిశ్రమలో మరో విషాదం సంభవించింది.
మలయాళ సినిమా,టీవీ నటుడు దిలీప్ శంకర్ డిసెంబర్ 29 ఉదయం హోటల్లో శవమై కనిపించాడు. ఈ వార్తతో సినీ పరిశ్రమ మొత్తం ఉలిక్కిపడింది. హోటల్ గది నుంచి దిలీప్ శంకర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకొని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. దిలీప్ శంకర్ ఆత్మహత్య చేసుకున్నాడా లేక సహజ మరణమా అనేది ఇంకా తెలియరాలేదు.
నివేదికల ప్రకారం, తిరువనంతపురంలోని హోటల్ గదిలో దిలీప్ శంకర్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. ‘పంచగని’ అనే టీవీ షో షూటింగ్‌లో ఉన్న ఆయన గత కొన్ని రోజులుగా అదే హోటల్‌లో ఉంటున్నారు. గదిలో నుంచి దుర్వాసన రావడంతో హోటల్ సిబ్బంది గమనించడంతో దిలీప్ మృతి చెందిన విషయం వెలుగులోకి వచ్చింది.
గత కొన్ని రోజులుగా దిలీప్ శంకర్ తన హోటల్ రూమ్ నుంచి బయటకు రావడం లేదని చెబుతున్నారు హోటల్ సిబ్బంది. అతను బయటకు రావడం ఎవరూ చూడలేదట. అయితే దిలీప్ శంకర్ ఎలా మరణించాడనేది ఇంకా తెలియరాలేదు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్ లాంటిది ఏమీ లభించలేదట. అయితే దిలీప్ శంకర్ ఎలా మరణించారు? దీనికి కారణం ఎవరు అనే విషయాలు తెలుసుకోవడానికి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
దిలీప్ శంకర్ ఆకస్మిక మరణంతో ఇండస్ట్రీ మొత్తం శోక సంద్రంలో మునిగిపోయింది. అభిమానులు కూడా షాక్ లో ఉన్నారు. ఇక ఈయన అనేక ప్రాంతీయ భాషా చిత్రాలు, టీవీ సీరియల్స్‌లో పనిచేశాడు. ‘అమ్మారియాతే’ అనే టీవీ షో ఆయనకు బాగా నచ్చింది. ‘పంచగని’లో చంద్రసేనన్ పాత్ర పోషించినందుకుగానూ చాలా ప్రశంసలు అందుకున్నారు. అతను ‘నార్త్ 24 కథమ్’, చప్పా కురిషు వంటి మలయాళ చిత్రాలలో నటించారు.
దిలీప్ మృతి తెలియడంతో మలయాళ పరిశ్రమలో విషాద ఛాయలు చోటు చేసుకున్నాయి. ఈ సమాచారం తెలియడంతో ప్రముఖులు, నెటిజన్లు, అభిమానులు సోషల్ మీడియాలో సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక నటుడు తీవ్రమైన అనారోగ్యంతో బాధపడుతున్నారని పంచాగ్ని టీవీ షో డైరెక్టర్ వెల్లడించారు. వ్యాధి పేరు, దాని సంబంధిత సమాచారం తెలియడం లేదు. ఇక దిలీప్ శంకర్ మరణానికి గల కారణాలను అధికారులు ఇంకా తెలుసు కోకపోవడంతో అభిమానులు కలత చెందుతున్నారు. కానీ ఆయన మృతి వెనుక ఎవరి ప్రమేయం లేదని ప్రాథమిక విచారణలో వెల్లడైంది అంటున్నారు పోలీసులు. దిలీప్ శంకర్ అకాల మరణం మలయాళ సినీ పరిశ్రమను దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. ఆయన సహనటి సీమా జి నాయర్ తన సంతాపాన్ని సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు.