Another flop for Nidhi Agarwal: నిధి అగర్వాల్(NIDHHI AGERWAL) పరిశ్రమకు వచ్చి దాదాపు ఎనిమిదేళ్లు అవుతుంది. 2017లో విడుదలైన మున్నా మైఖేల్ అనే హిందీ చిత్రంతో సిల్వర్ స్క్రీన్ కి పరిచయమైంది. ఆ సినిమా ఆడలేదు. రెండో చిత్రం సవ్యసాచి. నాగ చైతన్య హీరోగా దర్శకుడు చందూ మొండేటి తెరకెక్కించాడు. ఈ సినిమా ఎంత పెద్ద డిజాస్టరో తెలిసిందే. నాగ చైతన్య తమ్ముడు అఖిల్ మిస్టర్ మజ్ను టైటిల్ తో రొమాంటిక్ లవ్ ఎంటర్టైనర్ చేశాడు. నిధి అగర్వాల్ ని హీరోయిన్ గా ఎంచుకున్నారు. మిస్టర్ మజ్ను తో నిధి తెలుగులో హ్యాట్రిక్ ప్లాప్స్ పూర్తి చేసింది.
అయినప్పటికీ నిధికి ఆఫర్స్ వస్తూనే ఉన్నాయి. దర్శకుడు పూరి జగన్నాధ్ ఇస్మార్ట్ శంకర్ చిత్రంలో ఓ హీరోయిన్ గా నిధిని ఎంపిక చేశాడు. అప్పటికి పూరి జగన్నాధ్ సైతం ప్లాప్స్ లో ఉన్నారు. ఇస్మార్ట్ శంకర్ చిత్రానికి నిర్మాత కూడా ఆయనే కాగా.. పూరి, ఛార్మి ఉన్నదంతా ఊడ్చి ఇస్మార్ట్ శంకర్ చేశారు. రామ్ పోతినేని హీరోగా నటించిన ఇస్మార్ట్ శంకర్ సూపర్ హిట్ కొట్టింది. వరల్డ్ వైడ్ దాదాపు రూ. 75 కోట్ల గ్రాస్ రాబట్టింది. నిధి అగర్వాల్ కి ఫస్ట్ హిట్ పడింది. ఆ వెంటనే మరలా పరాజయాల పరంపర కొనసాగింది.
తమిళ్ లో చేసిన భూమి, ఈశ్వరన్ నిరాశపరిచాయి. మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా తో జతకట్టిన హీరో కూడా ఆడలేదు. నిధి అగర్వాల్ ట్రాక్ పరిశీలిస్తే… ఆమె ప్లాప్ హీరోయిన్. ఆఫర్ ఇవ్వడానికి దర్శక నిర్మాతలు భయపడతారు. అయితే క్రిష్, పవన్ కళ్యాణ్(PAWAN KALYAN) నిధికే ఓటు వేశారు. హరి హర వీరమల్లు(HARI HARA VEERAMALLU)లో ఛాన్స్ ఇచ్చారు. పవన్ కళ్యాణ్ వంటి బడా స్టార్ సరసన అవకాశం రావడంతో నిధి ఎగిరి గంతేసింది. వివిధ కారణాలతో హరి హర వీరమల్లు థియేటర్స్ లోకి రావడానికి ఐదేళ్ల సమయం పట్టింది. సినిమా పూర్తి అయ్యాక కూడా విడుదల తేదీ పోస్ట్ ఫోన్ అయ్యింది.
Also Read: హరిహర వీరమల్లు.. చూసినోళ్ల బాధ ఇదీ
నిధి మాత్రం పట్టు వదలకుండా హరి హర వీరమల్లు విజయం కోసం పరితపించింది. పదుల సంఖ్యలో ఇంటర్వ్యూలు ఇచ్చింది. ఆమె కష్టం వృధా అయిన సూచనలు కనిపిస్తున్నాయి. జులై 24న థియేటర్స్ లోకి వచ్చిన హరి హర వీరమల్లుకి నెగిటివ్ రివ్యూలు పడ్డాయి. ఫస్ట్ హాఫ్ పర్లేదు, సెకండ్ భరించలేమని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు. దారుణమైన విఎఫ్ఎక్స్ తో పాటు ఫస్ట్ హాఫ్ కి సెకండ్ హాఫ్ కి సంబంధం లేకుండా కథ సాగిందని నిరాశ వ్యక్తం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ వంటి స్టార్ హీరో సినిమా క్వాలిటీ ఇంతేనా ఉండేదని ఫైర్ అవుతున్నారు.
హరి హర వీరమల్లు ప్రాథమిక అంచనా ప్రకారం నిధి అగర్వాల్ కి మరో ప్లాప్ ఖాయం. ఇదే నిజమైతే ఆమెను ఇక ప్రభాస్ కాపాడాల్సిందే. హరి హర వీరమల్లు సెట్స్ మీద ఉన్నప్పుడే రాజా సాబ్ మూవీలో నిధికి ఛాన్స్ వచ్చింది. దర్శకుడు మారుతి తెరకెక్కిస్తున్న రాజా సాబ్ సైతం వాయిదా పడుతూ వస్తుంది. ఈ ఏడాది చివర్లో రాజా సాబ్ థియేటర్స్ లోకి వచ్చే అవకాశం ఉంది. ఇక రాజా సాబ్ ఎలాంటి ఫలితం అందుకుంటుందో చూడాలి.