RGV Vyuham: వ్యూహానికి మరోసారి బ్రేక్.. రాంగోపాల్ వర్మకు షాక్

ఏపీ సీఎం జగన్ జీవిత గాధను ఇతివృత్తంగా చేసుకుని రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాత్రలను ప్రతికూలంగా చూపించారు.

Written By: Dharma, Updated On : December 29, 2023 1:41 pm

RGV Vyuham

Follow us on

RGV Vyuham: వ్యూహం చిత్రానికి అడ్డంకులు తప్పడం లేదు. లెక్కల ప్రకారం ఈ రోజు థియేటర్లో ఆ చిత్రం విడుదల కావాలి. కానీ సినిమా రిలీజ్ నిలిచిపోయింది. తెలంగాణ హైకోర్టు స్టే విధించింది. సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఆధారంగా ఈ చిత్రం విడుదల కరెక్ట్ కాదని కోర్టు అభిప్రాయపడింది. జనవరి 11 వరకు సెన్సార్ సర్టిఫికెట్ ను సస్పెండ్ చేస్తూ న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దీంతో మరోసారి వ్యూహం దెబ్బతిన్నట్టు అయ్యింది. కొద్దిరోజుల కిందటే ఈ చిత్రం ఫ్రీ రిలీజ్ వేడుకలు విజయవాడలో జరిగాయి. అనుకున్న షెడ్యూల్ ప్రకారం సినిమాను విడుదల చేస్తామని దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. కానీ న్యాయచిక్కులు అధిగమించలేక.. ఈ సినిమా రిలీజ్ ప్రక్రియ నిలిచిపోయింది. జనవరి 11 వరకు వేచి చూడాల్సి వచ్చింది. సంక్రాంతి ముంగిట రిలీజ్ అవుతుందా? లేదా? అన్న చర్చ నడుస్తోంది.

ఏపీ సీఎం జగన్ జీవిత గాధను ఇతివృత్తంగా చేసుకుని రాంగోపాల్ వర్మ వ్యూహం సినిమాను తెరకెక్కించారు. ఈ చిత్రంలో చంద్రబాబుతో పాటు పవన్ కళ్యాణ్ పాత్రలను ప్రతికూలంగా చూపించారు. ఈ విషయాన్ని పలుమార్లు ఆర్జీవి ధ్రువీకరించారు కూడా. అయితే ఈ తరుణంలో నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాశారు. దీంతో చిత్రం విడుదలపై సెన్సార్ బోర్డు నిషేధం విధించింది. రివైజ్డ్ కమిటీకి రిఫర్ చేసింది. కొద్ది రోజుల కిందటే ఈ చిత్రం విడుదల చేసుకోవచ్చని సెన్సార్ బోర్డు అనుమతి ఇచ్చింది. దీంతో చిత్ర యూనిట్ ఈనెల 29న విడుదలకు సన్నాహాలు పూర్తి చేసింది. ఫ్రీ రిలీజ్ వేడుకలను కూడా ఘనంగా జరిపింది. కానీ సెన్సార్ బోర్డు అనుమతిని సవాల్ చేస్తూ నారా లోకేష్ తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.

తొలుత విచారణ జరిపిన తెలంగాణ న్యాయస్థానం తదుపరి ఉత్తర్వులు వచ్చేవరకు సినిమా విడుదల చేయకూడదని ఆదేశాలు ఇచ్చింది. ఈనెల 28 కి విచారణను వాయిదా వేసింది. అయితే సెన్సార్ బోర్డ్ అనుమతులపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ న్యాయస్థానం జనవరి 11 వరకు సినిమా విడుదలను నిలిపివేయాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాలపై వ్యూహం నిర్మాతలు అభ్యంతరం చెబుతున్నారు. కేవలం ట్రైలర్ చూసి సినిమా విడుదల ఆపేయడం సరికాదన్నారు. పైగా సెన్సార్ బోర్డు సర్టిఫికెట్ ఇచ్చిన తర్వాత సినిమాల్లో కోర్టులు జోక్యం చేసుకోవడం సబబు కాదంటున్నారు. పదిమంది సభ్యులతో కూడిన సెన్సార్ కమిటీ లేవనెత్తిన అభ్యంతరాలను పరిగణలోకి తీసుకుని ఆ దృశ్యాలను తొలగించిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. అయినా కోర్టు సినిమా రిలీజ్ పై స్టే విధించడం విశేషం. దీంతో వ్యూహం సినిమా విడుదల చేయాలన్న చిత్ర యూనిట్ ప్రయత్నానికి ఎప్పటికప్పుడు గండిపడుతోంది.