Pawan kalyan: పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ వరుస సినిమాలతో ఫుల్ బిజీ అవుతున్నారు. ప్రస్తుతం భీమ్లనాయక్ షూటింగ్లో మునిగిపోయిన పవన్… మరోవైపు హరిహర వీరమల్లు ప్రాజెక్టును కూడా పట్టాలెక్కించేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే కొంతవరకు ఈ సినిమా షూటింగ్ పూర్తయింది. ఇక హరీశ్ శంకర్, పవన్ కాంబినేషన్లో తెరకెక్కిస్తోన్న భవదీయుడు భగత్ సింగ్ కూడా త్వరలోనే షూటింగ్ మొదలవనుంది. ఇంకా, సురేందర్‌రెడ్డి దర్శకత్వంలోనూ మరో సినిమాను ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే పవన్ కొత్త సినిమా గురించి మరోవార్త సినీ ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతోంది.

ప్రముఖ డైరక్టర్ అనిల్ రావిపూడి తాజాగా పవన్‌కల్యాణ్‌కు కథ వినిపించినట్లు సమాచారం. ఈ కథ విన్నవెంటనే పవన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. కాగా, ప్రస్తుతం వరుస చిత్రాలతో బిజీగా ఉడటం వల్ల కథకు ఓకే చెప్పారా లేదా అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. త్వరలోనే ఈ విషయంపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని ఇండస్ట్రీ వర్గాలు చెప్పుకుంటున్నాయి. అన్నీ అనుకున్నట్లు జరిగితే దిల్‌రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరించనున్నట్లు టాక్. ఇప్పటికే దిల్‌రాజు, పవన్ కాంబినేషన్లో వకీల్‌సాబ్ తెరకెక్కిన సంగతి తెలిసిందే. బాక్సాఫీసు వద్ద ఘన విజయం సాధించింది ఈ సినిమా.
మరోవైపు నటుడు మంచు మనోజ్ గురువారం పవన్ కల్యాణ్‌ను కలిశారు. ‘భీమ్లానాయక్’ చిత్రీకరణ జరుగుతున్న సెట్‌లో పవన్‌ను కలిసి దాదాపు గంటసేపు ముచ్చటించారు. చిత్ర పరిశ్రమలో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో వీరిద్దరి భేటీ ఆసక్తిగా మారింది. ఇటీవలే జరిగిన మా ఎన్నికల్లో ప్రకాశ్‌కు మెగా ఫ్యామిలీ మద్దతుగా నిలిచిన సంగతి తెలిసిందే. అయితే మంచు విష్ణు విజయం తర్వాత… మెగా ఫ్యామిలీపై రకరకాల వార్తలు వినిపిస్తున్నాయి.