Old Woman: చిన్నపాటి కాలువలో కొట్టుకుపోతే ప్రాణాలు గాల్లో కలిసిపోతున్న రోజులివి. అటువంటిది పొరపాటున కాలుజారి నదిలో పడిన ఆ వృద్ధురాలు బతికి బయటపడ్డారు. ఒకటి కాదు రెండు కాదు.. దాదాపు 40 కిలోమీటర్ల మేర నదిలో కొట్టుకుపోయినా సజీవంగా నిలిచారు. వినడానికి వింతగా ఉంది కదూ. ఉత్తరప్రదేశ్ లో చోటుచేసుకుంది ఈ ఘటన. వృద్ధురాలు కొట్టుకుపోయిన ప్రాంతంలో స్థానికులతో వెతుకుతున్న కుటుంబసభ్యులకు ఫోన్ వచ్చింది. వృద్ధురాలు సజీవంగా ఉన్నారని.. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని పోలీసులు సమాచారమిచ్చిన వారు నమ్మలేదు. ఎందుకంటే వృద్ధురాలు కొట్టుకుపోయిన 40 కిలోమీటర్ల దూరంలోని పోలీస్ స్టేషన్ నుంచి పోన్ రావడమే అందుకు కారణం. అయితే ఆస్పత్రికి వెళ్లి వృద్దురాలిని చూసిన కుటుంబసభ్యులు ఆశ్చర్యపోయారు. ఆనందంతో పరవసించిపోయారు. వృద్ధురాలిని ఆత్మీయ ఆలింగనం చేసుకున్నారు.

ఫతేపూర్ జిల్లాలోని హత్ గావ్ లోని షామాపూర్ గ్రామానికి చెందిన ఏడు పదుల వయసుండే శాంతిదేవి శనివారం రాత్రి 9 గంటల సమయంలో ప్రమాదవశాత్తూ కాలుజారి గంగా నదిలో పడింది. దీంతో కుటుంబసభ్యులు గజ ఈతగాళ్ల సాయంతో వెతుకులాట ప్రారంభించారు. కానీ ఆచూకీ దొరకలేదు. దీంతో పోలీసులను ఆశ్రయించారు. ఈ పరిస్థితుల్లో ఆదివారం ఉదయం కౌశాంబి జిల్లాలోని కడథామ్ కొత్వాళిలోని నదీ తీరానికి వృద్ధురాలు కొట్టుకొచ్చింది. స్థానికులు గమనించి బయటకు తీసి సపర్యలు చేశారు. పోలీసులకు సమాచారమందించారు. పోలీసులు ఆమెను అంబులెన్స్ లో ఆస్పత్రికి తీసుకెళ్లి చికిత్స అందించారు. కొద్దిసేపటికే ఆమె తేరుకుంది. తాను షామాపూర్ లో నదిలో పడిపోయినట్టు చెప్పింది. దీంతో పోలీసులు ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. 40 కిలోమీటర్ల పాటు గంగానదిలో కొట్టుకొచ్చిన ఆమె సజీవంగా నిలవడంపై ఆశ్చర్యపోయారు. ఆమె నుంచి వివరాలు సేకరించి కుటుంబసభ్యులకు సమాచారమందించారు.

అయితే ఆస్పత్రికి వచ్చే వరకూ కుటుంబసభ్యులకు నమ్మకం లేదు. అటు పోలీసులు వృద్ధురాలు చెబుతున్న మాటలు నమ్మశక్యంగా లేవు. అయితే ఆస్పత్రికి చేరుకున్న కుటుంబసభ్యులు శాంతిదేవిని చూసి ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు. అప్పటికే ఆమె చనిపోయి ఉంటుందన్న భావనకు వచ్చిన కుమారుడు రామ్ జీవన్ తల్లిని చూసి ఉద్వేగం ఆపుకోలేక కన్నీరుమున్నీరయ్యాడు. జరిగిన విషయం పోలీసులకు చెప్పడంతో వారు నిజం తెలుసుకున్నారు. భగవంతుడే తన తల్లిని రక్షించడాన్ని కుమారుడు రామ్ జీవన్ చెబుతున్నారు. అయితే ఈ విషయం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. 40 కిలోమీటర్ల మేర నదిలో కొట్టుకొచ్చిన వృద్ధురాలు సజీవంగా ఉన్న ఆమెను మృత్యుంజయురాలిగా నెటిజన్లు కామెంట్స్ పెడుతున్నారు.