Sudigali Sudheer: కొన్ని కొన్ని స్థానాలను కొందరు మాత్రమే భర్తీ చేయగలరు. ఏహే మా దగ్గర డబ్బుంది.. ఏమైనా చేయగలం.. ఎవరినైనా తీసుకురాగలం.. అని అనుకుంటే మొదటికే మోసం వస్తుంది. ఆ తర్వాత జరగాల్సిన నష్టం జరిగిపోతుంది. ఇదంతా ఎందుకు చెప్తున్నామంటే.. పై ఉపోద్ఘాతం మొత్తం ఈటీవీ ఛానల్ ను నిర్వహిస్తున్న మల్లెమాల అనే సంస్థకు వర్తించింది కాబట్టి.. అంతేకాదు చేతులు కాలిన తర్వాత ఆ సంస్థ ఇప్పుడు ఆకులు పట్టుకుంటుంది కాబట్టి.. మల్లెమల ఈటీవీ ఛానల్ లో ఎంటర్టైన్మెంట్ కార్యక్రమాలను చేపట్టిన నాటి నుంచి మొన్నటివరకు మంచి ఫలితాలను రాబట్టింది. జబర్దస్త్, ఢీ, పటాస్, పోవే పోరా, వంటి కార్యక్రమాలు ఆ సంస్థను తిరుగులేని స్థాయిలో నిలబెట్టాయి. అంతేకాదు ఆ కార్యక్రమాలకు కర్త, కర్మ, క్రియ లాంటి వాళ్లు కూడా తిరుగులేని స్థాయిలో నిలబడ్డారు. అయితే వారిని కాపాడుకోవడంలో మల్లెమాల తప్పు చేసిందో, నిలబడటంలో వారే తప్పడుగులు వేశారో తెలియదు కానీ.. బెంచ్ మార్క్ లాంటి ప్రోగ్రామ్స్ నుంచి వారంతా వెళ్ళిపోయారు. అలా వెళ్లిపోయిన వారిలో సుధీర్ ఒకడు. సుధీర్ ఒక కమెడియన్ మాత్రమే కాదు.. మెజీషియన్.. సింగర్.. యాంకర్.. యాక్టర్ కూడా.. చతురతతో ఎలాంటి కార్యక్రమాన్నయినా కూడా నిలబెట్టగలిగే సత్తా ఉన్నవాడు.. అలాంటివాడు మల్లెమాల సంస్థలో చాలా సంవత్సరాలపాటు పనిచేశాడు. ఢీ, జబర్దస్త్, పోవే పోరా వంటి కార్యక్రమాల్లో మెరిసేవాడు. ఢీ ప్రోగ్రాం లో తన స్పాంటేనిటితో దానిని ఎక్కడికో తీసుకెళ్లాడు. అంతేకాదు ప్రదీప్ ను ఏకంగా ఓవర్టేక్ చేయగలిగాడు.. అలాంటి వాడిని మల్లెమాల కారణాలు తెలియవు కానీ బయటికి పంపింది. దీని వెనుక చాలా జరిగాయని రకరకాల ప్రచారాలు వినిపిస్తాయి కానీ.. అందులో నిజం ఎంతో ఇప్పటికీ ఎవరికీ తెలియదు.
అయితే ఇక సుధీర్ రాడా? మల్లెమాల నిర్వహిస్తున్న కార్యక్రమాలలో కనిపించడా? అని నిన్నటి వరకు అతడి అభిమానుల్లో కొంతమేర సందేహాలు ఉండేవి. ఆ మధ్య ఈటీవీకి సంబంధించి వార్షికోత్సవం జరిగినప్పుడు సుధీర్ కనిపించాడు. తన మిత్రులు రాంప్రసాద్, గెటప్ శ్రీను తో కలిసి స్కిట్లు వేశాడు. అయితే కేవలం ఆ కార్యక్రమానికి మాత్రమే సుధీర్ వచ్చాడు. ఆ తర్వాత మల్లెమాల నిర్వహించిన ఏ షో లలో కూడా సుధీర్ కనిపించలేదు. తర్వాత ఇన్ని రోజులకి సుధీర్ దర్శనం కనిపించింది. వచ్చే సంక్రాంతిని పురస్కరించుకుని ఈటీవీ మల్లెమాల అల్లుడా మజాకా అనే ఒక కార్యక్రమాన్ని రూపొందించింది. ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ ప్రత్యేక ఆకర్షణగా కనిపిస్తున్నారు. చూడబోతే త్వరలో విడుదలయే అతడి 75వ సినిమా సైంధవ్ ప్రమోషన్ కోసం అనుకుంటా. గతంలో అతనితో ఆడి పాడిన కుష్బూ, మీనా కూడా ఈ షోలో కనిపించారు.. వెంకటేష్ కూడా సరదాగా డ్యాన్స్ వేశాడు. ఇక హైపర్ ఆది.. మిగతా కమెడియన్లు కూడా ఇందులో కనిపించారు.
రేటింగ్స్ పడిపోతుండడం.. ఢీ, జబర్దస్త్ వంటి కార్యక్రమాలు పూర్ రేటింగ్స్ పెర్ఫార్మన్స్ చేస్తుండడం వల్లే మల్లెమాల సంస్థకు తాను చేసిన తప్పు ఏమిటో తెలిసి వచ్చిందని.. అందుకే ఒకప్పుడు తనకు బంగారు బాతు గుడ్డు లాగా ఉన్న సుధీర్ ను మళ్ళీ తీసుకొచ్చిందనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. వినిపించడమేమిటి యూట్యూబ్లో అతడి ఫ్యాన్స్ అలాగే కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఆ కార్యక్రమానికి సంబంధించిన ప్రోమో విడుదలైంది. అందులో వెంకటేష్ చేసిన డ్యాన్సులు, సుధీర్ మార్క్ డైలాగులు, హైపర్ ఆది పంచులు బాగా పేలాయి. నితిన్_ భరత్ బయటికి వెళ్లిపోయిన చాలాకాలం తర్వాత మల్లెమాల ఒక ప్రోగ్రాం కోసం బాగా కష్టపడిందంటే అది ఇదే కావచ్చు. ప్రోమోలో ఈ షోకు సంబంధించి టీం పడిన కష్టం మొత్తం బయటికి కనిపిస్తోంది. అంటే ఇప్పటివరకు పోటీ చానల్స్ కూడా సంక్రాంతి పండుగ సందర్భంగా ప్రత్యేక కార్యక్రమాలు చేయకపోవడం (ప్రోమోలు విడుదల చేయలేదు కాబట్టి), ఇటువంటి షో ల నిర్వహణలో మల్లెమాల తోపు కాబట్టి.. సంక్రాంతి సందర్భంగా అల్లుడా మజాకా ఈటీవీని ఎంతో కొంత నిలబెట్టవచ్చు.. అలాగని ఈ షో ఈటీవీ ని పైకి తీసుకెళ్తుందని కాదు. నిండా మునగకుండా ఎంతో కొంత కాపాడుతుందని.. అన్నట్టు సుధీర్ ను ఈ ఒక్క షో కే పరిమితం చేస్తారా? లేక ఢీ, జబర్దస్త్ లో కూడా కొనసాగిస్తారా? ఏమో దీనికి మల్లెమాల టీమే సమాధానం చెప్పాలి.