Allu Arjun Arrested: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నిన్న అరెస్ట్ అయిన ఘటన ఎంత నాటకీయ కోణాల మధ్య సాయంత్రం వరకు కొనసాగిందో మనమంతా చూసాము. ముందుగా 14 రోజుల పాటు రిమాండ్ విధించిన కోర్టు, ఆ తర్వాత లాయర్ నిరంజన్ రెడ్డి వాదనలను పరిగణలోకి తీసుకొని అల్లు అర్జున్ కి బెయిల్ మంజూరు చేసిన సంగతి తెలిసిందే. అయితే కోర్టు వెంటనే అతన్ని విడుదల చేయమని చెప్పినప్పటికీ కూడా, చంచల్ గూడా పోలీసులు ఆయన్ని రాత్రంతా జైలులోనే ఉంచి ఉదయం 6 గంటలకు విడుదల చేశారు. విడుదల చేసిన వెంటనే ముందుగా గీత ఆర్ట్స్ ఆఫీస్ కి వెళ్లి తన తండ్రి అల్లు అరవింద్ ని కలిసిన అల్లు అర్జున్, ఆ తర్వాత తన ఇంటికి బయలుదేరాడు. ఇంటికి వెళ్లిన వెంటనే అల్లు అర్జున్ ని కలిసేందుకు సినీ ప్రముఖులందరూ విచ్చేసారు. కాసేపటి క్రితమే అల్లు అర్జున్ ప్రెస్ మీట్ ని ఏర్పాటు చేసారు.
ఈ ప్రెస్ మీట్ లో పోలీసులు అన్యాయంగా తనపై ప్రవర్తించిన తీరు పట్ల రెస్పాన్స్ ఇస్తాడని అందరూ ఆశించారు కానీ, అల్లు అర్జున్ కేవలం కృతఙ్ఞతలు తెలియజేసి నిమిషం లోపే తన ప్రసంగం ని ముగించాడు. ఆయన మాట్లాడుతూ ‘నాకు ఇలాంటి కష్ట సమయంలో అండగా నిల్చిన మీడియా మిత్రులకు ధన్యవాదాలు. ముఖ్యంగా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి నా అభిమానులు నాపై చూపించిన ప్రేమ కి ధన్యవాదాలు, నేను బాగానే ఉన్నాను, ఎవ్వరూ కంగారు పడొద్దు. నిన్న ఉదయం నుండి చిరంజీవి గారి దగ్గర నుండి నా కుటుంబ సభ్యులందరు చాలా కంగారు పడ్డారు’ అని చెప్పుకొచ్చాడు. మధ్యలో మీడియా రిపోర్టర్స్ జరుగుతున్న కాంట్రవర్సీలపై మీ స్పందన ఏమిటి అని అడగగా, అల్లు అర్జున్ సమాధానం చెప్పకుండా లోపలకు వెళ్ళిపోయాడు. అల్లు అర్జున్ సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై రెస్పాన్స్ ఇస్తాడేమో అని ఆయన అభిమానులు ఆశించారు, కానీ అలాంటిదేమి లేకపోవడంతో కాస్త నిరుత్సాహపడ్డారు.
అంతకు ముందు ఆయన ఇంటికి చేరుకున్న వెంటనే మీడియా తో మాట్లాడుతూ ‘జరిగిన దుర్ఘటన దురదృష్టకరమైనది. దానికి మేమంతా విచారిస్తున్నాము. మరోసారి రేవతి గారి కుటుంబానికి నా సంతాపం వ్యక్తం చేస్తున్నాను. నేను క్షేమంగానే ఉన్నాను, అభిమానులు కంగారు పడకండి. కోర్టులో ప్రస్తుతం కేసు నడుస్తుంది కాబట్టి ఈ ఘటనపై ఇప్పుడు నేనేమి మాట్లాడలేను’ అని చెప్పుకొచ్చాడు అల్లు అర్జున్. నిన్న ఉదయం అరెస్ట్ చేయడానికి పోలీసులు వచ్చినప్పుడు అల్లు అర్జున్ వాళ్ళ ప్రవర్తనపై విచారం వ్యక్తం చేస్తూ మాట్లాడడం మనమంతా మీడియాలో చూసాము. నేరుగా ఆయన బెడ్ రూమ్ లోకి వెళ్లి బట్టలు మార్చుకునే సమయం కూడా ఇవ్వలేదు, తమ ముందే బట్టలు మార్చుకోవాలని ఆదేశించారు, ఈ తీరుపై అల్లు అర్జున్ పోలీసులతోనే తన అసంతృప్తి ని వ్యక్తపర్చాడు. దీని గురించి ఆయన ఇప్పుడు మాట్లాడకపోయినా, భవిష్యత్తులో అయినా మాట్లాడాలని కోరుకుంటున్నారు అభిమానులు. నిన్న రాత్రి అల్లు అర్జున్ ని పోలీసులు ఒక సాధారణ ఖైదీ లాగ ట్రీట్ చేసారు, నేల మీదనే ఆయన నిద్రపోయాడని తెలుస్తుంది.