సామాజిక స్పృహ ఉన్న దర్శకుడు కొరటాల శివ. రచయితగా పలు చిత్రాలకు పని చేసిన కొరటాల.. డైరెక్టర్ గా తన కంటూ ప్రత్యేక పంథా ఏర్పరుచుకున్నారు. ‘మిర్చి’ వంటి బ్లాక్ బస్టర్ హిట్‌తో దర్శకుడిగా పరిచమయ్యారు. ఆ తర్వాత శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, భరత్ అనే నేను చిత్రాలతో టాప్ డైరెక్టర్ గా మారిపోయారు. పది బ్లాక్ బస్టర్ హిట్స్ ఇవ్వాలన్న టార్గెట్‌తో దర్శకుడిగా మారిన కొరటాల.. ఐదో హిట్ కోసం చిరంజీవితో ‘ఆచార్య’ తీస్తున్నాడు. సాధారణంగా ఒక మూవీ పూర్తయిన తర్వాతే మరోదాన్ని ప్రకటించడం శివ అలవాటు. ‘ఆచార్య’ సెట్స్‌పై ఉండగానే తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై దృష్టి పెట్టినట్టు తెలుస్తోంది. తన ఆరో చిత్రాన్ని స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్‌కు దర్శకత్వం వహించబోతున్నట్టు సమాచారం.
ఈ మధ్య ‘అల వైకుంఠపురములో’తో భారీ విజయాన్ని ఖాతాలో వేసుకున్న బన్నీ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘పుష్ప’ చిత్రంలో హీరోగా నటిస్తున్నాడు. ఆపై, వేణు శ్రీరామ్ దర్శకత్వంలో ‘ఐకాన్’కు కమిట్మెంట్ ఇచ్చాడు. ఇది పూర్తయిన తర్వాత కొరటాల శివతో కలిసి పని చేస్తాడని ఇండస్ట్రీ టాక్. క్లాస్, మాస్ కలగలిసిన కమర్షియల్ ఎంటర్టైన్మెంట్స్ కు ప్రాధాన్యత ఇచ్చే బన్నీ ప్రతీ సినిమాలో లుక్ పరంగా కూడా చాలా జాగ్రత్త తీసుకుంటాడు. వీటితో పాటు తన కథలో సమాజానికి ఉపయోపడే సందేశం కూడా ఇచ్చే శివతో బన్నీ కలిస్తే అది క్రేజీ కాంబినేషన్ కానుంది.