Allu Arjun : అల్లు అర్జున్-సుకుమార్ కాంబోలో రాబోతున్న చిత్రం పుష్ప. ఒకే సినిమాగా రావాల్సిన ఈ మూవీ.. కరోనా కారణంగా రెండు భాగాలుగా రాబోతున్న సంగతి తెలిసిందే. మొదటి పార్టును క్రిస్మస్ కానుగా రిలీజ్ చేయాలని నిర్ణయించారు. ఈ మేరకు రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేశారు. డిసెంబర్ 17న పుష్ప మొదటి పార్టును విడుదల చేయబోతున్నట్టు మేకర్స్ ప్రకటించారు. అయితే.. ఈ విషయానికి సంబంధించి అల్లు అర్జున్ మాత్రం ఓ ట్వీట్ కూడా చేయలేదు. దీంతో.. ఏం జరుగుతోంది అనే చర్చ మొదలైంది.
నిజానికి తన వ్యక్తిగత విషయాల నుంచి వృత్తిగత విషయాల వరకూ అభిమానులతో పంచుకుంటాడు బన్నీ. కానీ.. పుష్ప రిలీజ్ గురించి మాత్రం సోషల్ మీడియాలో పోస్టు చేయలేదు. అయితే.. ఇదేదో క్యాజువల్ గా మరిచిపోయిన విషయం కాదని, దీని వెనుక కారణం ఉందని అంటున్నారు. అదేంటని ఆరాతీసినప్పుడు కనిపిస్తున్న సమాధానం ఆచార్య.
అవును.. మెగాస్టార్ ఆచార్యను ఎప్పుడో రిలీజ్ చేయాల్సి ఉంది. మే నెలలోనే విడుదలకు సన్నాహాలు చేశారు. కానీ.. కరోనా సెకండ్ వేవ్ కారణంగా కుదరలేదు. ఏపీలో థియేటర్లు పూర్తిగా తెరుచుకోకపోవడంతో వేచి చూస్తున్నారు. అందుతున్న సమాచారం ప్రకారం.. క్రిస్మస్ సందర్బంగానే ఈ చిత్రాన్ని రిలీజ్ చేయాలని చూస్తున్నారట.
దీంతో.. బన్నీ సందిగ్ధంలో ఉన్నాడట. మెగా స్టార్ సినిమా సమయంలోనే రిలీజ్ చేయడానికి మల్లగుల్లాలు పడుతున్నాడట. నిజానికి పరిస్థితి కూడా అలాగే ఉంది. సంక్రాంతికి స్లాట్లు బుక్ అయిపోయాయి. ఆర్ ఆర్ ఆర్ మొదలు సర్కారువారి పాట, భీమ్లా నాయక్ వంటి చిత్రాలు లైన్లో ఉన్నాయి. అందువల్ల సంక్రాంతికి కుదరదు. అప్పుడు కాకుంటే సమ్మర్ వరకు వేచి చూడాల్సిందే. మరీ.. అంత కాలం వేచి ఉండలేరు.
ఆచార్య విషయంలోనూ ఇదే పరిస్థితి. గత సమ్మర్ లో విడుదల కావాల్సిన సినిమా.. వచ్చే సమ్మర్ వరకు వేచి చూడడం అసాధ్యం. సంక్రాంతికి ఆల్రెడీ షెడ్యూల్ ఫుల్ అయిపోయింది కాబట్టి.. క్రిస్మస్ కు ఆచార్య రావడం గ్యారంటీ అని అంటున్నారు. అంతేకాదు.. పుష్ప ప్రకటించిన రిలీజ్ డేట్ నే ఆచార్యను అనుకుంటున్నారట. దీంతో.. ఏం జరుగుతుందో అర్థంకాని పరిస్థితి నెలకొంది. అందుకే.. బన్నీ తన సినిమా గురించి ట్వీట్ చేయలేదని అంటున్నారు. మరి, మెగాస్టార్ తో బన్నీ పోటీ పడతాడా? ఎవరు ముందుగా వస్తారు? అన్నది చూడాలి.