Allu Arjun: అల్లు శిరీష్ లేటెస్ట్ మూవీ ఊర్వశివో రాక్షసివో పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. ప్రేక్షకులు, క్రిటిక్స్ బాగుందంటూ ప్రశంసలు కురిపిస్తున్నారు. దీంతో చిత్ర సక్సెస్ మీట్ ఏర్పాటు చేశారు. గెస్ట్ గా అల్లు శిరీష్ అన్నయ్య అల్లు అర్జున్ హాజరయ్యారు. ఈ సందర్భంగా అల్లు అర్జున్ చిత్ర యూనిట్ పై ప్రశంసలు కురిపించారు. సినిమాను విజయవంతం చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు తెలిపారు. అల్లు అర్జున్ మాట్లాడుతూ… ఊర్వశివో రాక్షసివో సినిమా మా అమ్మ, నాన్న, నేకు అలాగే శిరీష్ కి చాలా ప్రత్యేకం. సినిమాను ఇంత పెద్ద సక్సెస్ చేసిన ప్రేక్షకులకు ధన్యవాదాలు. ముఖ్యంగా మంచి సినిమా రూపొందించి సక్సెస్ సెలెబ్రేషన్స్ కి కారణమైన దర్శకుడుకి రాకేష్ శశి గారికి కృతజ్ఞతలు.

నటుడు, సాంకేతిక నిపుణులు ఎంత గొప్పగా చేసినప్పటికీ దర్శకుడు అద్భుతంగా తెరకెక్కించినప్పుడే సినిమాకు న్యాయం జరుగుతుంది. అలాగే మా నాన్న అల్లు అరవింద్ కి కూడా కృతజ్ఞతలు చెప్పాలి. ఆయన నా సినిమాలు ఎన్నో చూశారు. ఆయన సమర్పణలో అల్లు శిరీష్ కి ఒక హిట్ మూవీ రావడం మెమరబుల్ మూమెంట్. ఇక గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ స్థాపించిన బన్నీ వాసు గురించి చెప్పాలి. బన్నీ వాసు నేను వేరు కాదు. ఇద్దరం ఒకటే. నా ఎదుగుదలలో బన్నీ వాసు పాత్ర ఎంతో ఉంది. ఈ విషయంలో మానాన్న కంటే కూడా ఎక్కువ క్రెడిట్ బన్నీ వాసుకి ఇస్తాను. ఈ స్థాయిలో ఉన్నానంటే బన్నీ వాసు ప్రమేయం చాలా ఉంది.
ఇక నా తమ్ముడు శిరీష్ గురించి చెప్పాలి. శిరీష్ గురించి మాట్లాడే సమయం ఎప్పుడు వస్తుందా అని ఎదురు చూస్తున్నాను. ఎందుకంటే మంచి హిట్ మూవీ పడి, అల్లు శిరీష్ పెర్ఫార్మన్స్ గురించి అందరు మాట్లాడుతున్నప్పుడు మనం మాట్లాడాలి అనుకున్నాను. ఆ రోజు ఇప్పుడు వచ్చింది. ఆ గౌరవం శిరీష్ సంపాదించుకున్నాడు. నా సినిమా విజయం సాధించినా నాకు ఇంత సంతోషం కలగదు. అంతకు మించిన ఆనందం శిరీష్ మూవీ హిట్ కావడం వలన వస్తుంది.

శిరీష్ నువ్వు హిట్ కొట్టినా కొట్టకున్నా నువ్వు ఎప్పుడు నా దృష్టిలో సక్సెసే. నువ్వు జీవితాన్ని చూసే విధానం. జీవించే విధానం పట్ల నాకు గౌరవం ఉంది. అందరూ శిరీష్ బాగా చేశాడు అంటుంటే సంతోషం వేస్తుంది. నేను చాలా ఆనందంగా ఉన్నాను. మంచి రివ్యూలు వచ్చాయి. శిరీష్ అమ్మాయిలు ఇష్టపడే హీరో అవుతాడని అనిపిస్తుంది. చివరిగా పుష్ప 2 గురించి ఒక అప్డేట్ ఇస్తాను. పుష్ప తగ్గేదేలే… పుష్ప 2 అస్సలు తగ్గేదేలే, అందరికీ ధన్యవాదాలు అంటూ అల్లు అర్జున్ ముగించారు. ఊర్వశివో రాక్షసివో చిత్ర యూనిట్ కి బెస్ట్ విషెస్ తెలియజేసిన అల్లు అర్జున్ హీరోయిన్ అను ఇమ్మానియేల్ గురించి ప్రత్యేకంగా మాట్లాడారు.