Pushpa 2 : ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా, రష్మిక హీరోయిన్ గా, సుకుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న పుష్ప-2 సినిమా ఆగస్టు 15న విడుదల కానుంది. సుకుమార్, అల్లు అర్జున్ ద్వయం ఆధ్వర్యంలో రూపొందిన పుష్ప-1 బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రానికి కొనసాగింపుగా పుష్ప-2 సినిమాను తీసుకొస్తున్నారు. ఇటీవల ఈ సినిమాకు సంబంధించిన వైజాగ్ షెడ్యూల్ పూర్తయింది. అంతేకాదు యాగంటి క్షేత్రంలో రష్మికపై కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు తీశారు.
ఈ సినిమా ఆగస్టు 15న విడుదల కానుందని మేకర్స్ ఎప్పుడో చెప్పారు. ఈ సినిమాపై ఆడియన్స్ కు విపరీతమైన అంచనాలున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ కొద్ది రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా క్రేజీ అప్డేట్స్ ఇస్తోంది. ఏప్రిల్ 8న అల్లు అర్జున్ పుట్టినరోజు ఉండడంతో టీజర్ విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. దీంతో అల్లు అర్జున్ అభిమానులు పుష్ప-2 టీజర్ కోసం వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. తాజాగా ఈ సినిమా నిర్మాతలు టీజర్ విడుదల తేదీని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.. అల్లు అర్జున్ బర్త్ డే సందర్భంగా సోమవారం ఉదయం 11: 7 నిమిషాలకు పుష్ప-2 టీజర్ విడుదల కానుంది.. ఇప్పటికే ఈ చిత్ర యూనిట్ వరుస అప్డేట్స్ ఇస్తుండడంతో ఫ్యాన్స్ పూనకాలతో ఊగిపోతున్నారు. ఫలితంగా ఈ సినిమాపై భారీ అంచనాలు పెంచుకుంటున్నారు. తగ్గేది లేదన్నట్టుగా సినిమా మేకర్స్ కూడా మాస్ మహా జాతర అంటూ అంచనాలు అమాంతం పెంచేస్తున్నారు.
ఈ సినిమా టీజర్ కి సంబంధించిన సమయాన్ని చిత్ర యూనిట్ ప్రకటించిన నేపథ్యంలో.. సోషల్ మీడియా వేదికగా అల్లు అర్జున్ ఒక చేతిలో గొడ్డలితో సింహాసనం పై కూర్చున్న మాస్ లుక్ ఫోటోను విడుదల చేసింది. అందులో అల్లు అర్జున్ రగ్ డ్ అవతారంలో కనిపించాడు. చేతిలో గొలుసులు.. వైవిధ్యమైన కాస్ట్యూమ్, ఎడమ చేతి చివరివేలికి గులాబీ రంగు, జూలపాల జుట్టు, కళ్ళకు అద్దాలు, మెడలో బంగారు గొలుసులతో అల్లు అర్జున్ సరికొత్త రూపంలో దర్శనమిచ్చాడు. అల్లు అర్జున్ ను అలా చూసి ఫ్యాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు. పూనకాలు లోడింగ్ అనే స్థాయిలో సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు.
పుష్ప-1 సినిమా మొదట డివైడ్ టాక్ తెచ్చుకుని.. ఆ తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. నాన్ బాహుబలి రికార్డ్స్ క్రియేట్ చేసింది. ఇక హిందీ చిత్ర సీమలో అయితే సరికొత్త రికార్డులు సృష్టించింది. పుష్ప దెబ్బకు బాలీవుడ్ లో హిందీ సినిమాలను పక్కనపెట్టి ఈ సినిమాను ప్రదర్శించడం మొదలుపెట్టారు. దాదాపు వందల కోట్లు వసూలు చేసిన ఈ సినిమా బుల్లితెరపై కూడా అద్భుతమైన టిఆర్పి రేటింగ్స్ నమోదు చేసింది. ఇప్పటికీ అమెజాన్ ప్రైమ్ ఓటీటీ లోనూ టాప్ టెన్ జాబితాలో కొనసాగుతోంది. ఇక ఈ సినిమాకు కొనసాగింపుగా వస్తున్న పుష్ప-2 పై భారీ అంచనాలున్నాయి.