Allu Aravind : నాగచైతన్య, సాయి పల్లవి కాంబినేషన్ లో తెరకెక్కిన లేటెస్ట్ చిత్రం ‘తండేల్’ మరో ఆరు రోజుల్లో మన ముందుకు రాబోతున్న సందర్భంగా, ఈ సినిమాకి సంబంధించిన ప్రొమోషన్స్ కార్యక్రమాల్లో క్షణం తీరిక లేకుండా గడుపుతున్నారు మేకర్స్. మొదట్లో ఈ సినిమాని కేవలం తెలుగు బాషలోనే విడుదల చేయాలని అనుకున్నారు, కానీ సినిమా కంటెంట్ అన్ని భాషల్లో క్లిక్ అయ్యే విధంగా ఉండడంతో తమిళం, హిందీ లో కూడా ప్రమోట్ చేసి విడుదల చేస్తున్నారు. తమిళంలో ఇటీవలే ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి హీరో కార్తీ ని ముఖ్య అతిథిగా పిలిచారు. అదే విధంగా హిందీ వెర్షన్ కోసం నిన్న హిందీ లో ప్రీ రిలీజ్ ఈవెంట్ ని ఏర్పాటు చేసి, బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ ని ముఖ్య అతిథిగా పిలిచారు. గతంలో అమీర్ ఖాన్ తో అల్లు అరవింద్ ‘గజినీ’ లాంటి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ హిట్ చిత్రాన్ని నిర్మించాడు.
అదే విధంగా నాగ చైతన్య రెండేళ్ల క్రితం అమీర్ ఖాన్ తో కలిసి ‘లాల్ సింగ్ చద్దా’ అనే చిత్రం లో నటించాడు. అలా ఇద్దరితో మంచి సాన్నిహిత్యం ఉండడంతో అమీర్ ఖాన్ పిలవగానే ఈ మూవీ ఈవెంట్ కి వచ్చాడు. అక్కడికి వచ్చిన తర్వాత అల్లు అరవింద్ ని విలేఖరి ఒక ప్రశ్న అడుగుతూ ‘మీ ఇద్దరి కాంబినేషన్ లో వచ్చిన గజినీ అప్పట్లో పెద్ద హిట్ అయ్యింది..మళ్ళీ మీ ఇద్దరు కలిసి ఎప్పుడు సినిమా చేయబోతున్నారు’ అని అడగగా, దానికి అల్లు అరవింద్ సమాధానం చెప్తూ ‘గజినీ సినిమా షూటింగ్ జరుగుతున్న సమయం లోనే అమీర్ ఖాన్ గారు ఈ చిత్రం కచ్చితంగా 100 కోట్లు రాబడుతుందని అన్నారు, ఆయన అన్నట్టుగానే ఆ చిత్రం వంద కోట్ల రూపాయిలను రాబట్టిన మొట్టమొదటి ఇండియన్ చిత్రం అయ్యింది. ఇప్పుడు మా కాంబినేషన్ లో సినిమా సెట్ అయితే, అది వెయ్యి కోట్ల సినిమా అవ్వాలి’ అంటూ చెప్పుకొచ్చాడు.
అదే విధంగా అమీర్ ఖాన్ మాట్లాడుతూ ‘అల్లు అరవింద్ గారితో నాకు ఎప్పటి నుండో మంచి సాన్నిహిత్యం ఉంది. ఆయన నాకు కెరీర్ ని మలుపు తిప్పే సినిమాని అందించారు, అది నేను ఎప్పటికీ మర్చిపోలేను. హీరో నాగ చైతన్య తో కలిసి రెండేళ్ల క్రితమే ఒక సినిమా చేశాను. చాలా మంచి పొటెన్షియల్ ఉన్న నటుడు అతను. నా మనసుకి బాగా దగ్గరయ్యాడు. ఆయన నాన్న గారు నాగార్జున కూడా నాకు మంచి స్నేహితుడు. ఈ సినిమా ట్రైలర్ ని చూసాను, హృదయానికి హత్తుకునే సినిమాలాగా అనిపించింది. ఇలాంటి సినిమాలు ఎక్కువగా రావాలి, ఈ చిత్రం సంచలన విజయం సాధించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను’ అంటూ ఆయన మాట్లాడిన మాటలు ఇప్పుడు సోషల్ మీడియా లో బాగా వైరల్ అయ్యాయి.