కరోనా వైరస్ ప్రభావితమైన తెలుగు సినిమాకి మరో యువ హీరో అండ దొరికింది. షూటింగ్స్ లేక ఇబ్బంది పడే సినీ కార్మికులకు తన వంతు సాయం చేయడానికి ఈదర నరేష్ అలియాస్ అల్లరి నరేష్ ముందుకొచ్చాడు. తాజాగా అల్లరి నరేశ్ నటిస్తున్న కొత్త చిత్రం ‘నాంది’. కాగా ఈ చిత్ర యూనిట్ లో రోజువారీ వేతనంతో జీవనం సాగించే 50 మంది కార్మికులున్నారు . నాంది సినిమా పూర్తి అయ్యాక వీరంతా పనిలేని స్థితికి చేరుకోనున్నారు. ఈ విషయం తెలిసిన అల్లరి నరేష్ ఆ 50 మందికి ఆర్థిక సాయం చేయనున్నట్టు తెలిసింది.
ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ వల్ల ఇబ్బంది పడే వారిలో తమ ‘నాంది’ చిత్ర యూనిట్ ఉందని భావించిన అల్లరి నరేష్ ఆ చిత్ర నిర్మాత సతీశ్ వేగేశ్నతో కలిసి తమ చిత్ర యూనిట్ లోని యాభై మందికి ఒక్కొక్కరికీ రూ.10 వేల చొప్పున ఆర్ధిక సాయం అందించాలని నిర్ణయించినట్టు తెలిసింది. ఈ సందర్భంగా ‘ఇది గుర్తింపు కోసం చేస్తున్న ప్రయత్నం కాదు.. సాటి మనిషికి సాయం చెయ్యడం మన కర్తవ్యం.. ఈ సాయం కావాలి మరిన్ని సాయాలకు నాంది..అని అల్లరి నరేష్ అనడం విశేషం.